నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు త్వరలో అర్థం అవుతుందన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టమంటారో చెప్పాలన్నారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను వీడుతున్న వాళ్ళంతా స్వార్థ పరులు. చెత్త పోతే పోనీ అని ఆయన వ్యాఖ్యానించారు. బెదిరింపులు, డబ్బుల ప్రలోభాలు పెట్టి పార్టీ నుంచి లాక్కుంటున్నారని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. బాజిరెడ్డి గోవర్దన్ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ప్రజల్లో తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటారన్నారు. పార్లమెంట్ లో ఒక్క సారి కూడా అభివృద్ధి పై మాట్లాడలేరని, బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే అని ఆయన విమర్శించారు.