Uttara Dwara Darshanam: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలు తరలివస్తున్నారు. ఇక, ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే పుణ్యం దొరుకుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఇక, భద్రాద్రి శ్రీరాముడి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే ఉత్తర ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు గరుడవాహనంపై రాముడు, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇచ్చారు. అలాగే, ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారు జామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహాక్షీరాభిషేకం చేశారు. ఉదయం 5గంటల నుంచి భక్తులకు ఆలయాధికారులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామున భారీ ఎత్తున తరలివచ్చారు.
Read Also: Covid Cases: తెలంగాణాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..ఒక్కరోజులో ఎన్నంటే?
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అలాగే, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివచ్చారు. దీంతో పాటు ఏలూరులోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంతం, పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. ఇక, హైదరాబాద్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ( మినీ తిరుపతి ) సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు.