బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోని నాలుగో మ్యాచ్‌లో భారీ శతకం బాదాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో 143 రన్స్ చేశాడు. 52 బంతుల్లోనే సెంచరీ చేసి.. అండర్-19 వన్డేల్లో అత్యంత వేగంగా, చిన్న వయసులో శతకం కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో వైభవ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. సెంచరీలతో సత్తాచాటుతున్న వైభవ్.. తన నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పేశాడు. డబుల్ సెంచరీ తన తదుపరి లక్ష్యం అని చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నేను రికార్డు నెలకొల్పానని తెలియదు. మా జట్టు మేనేజర్ అంకిత్ సర్ నాకు రికార్డు గురించి చెప్పారు. శుభ్‌మన్ గిల్ నుంచి చాలా ప్రేరణ పొందాను. ఎడ్జ్‌బాస్టన్‌లో నేను అతడి ఆటను ప్రత్యక్షంగా చూశాను. గిల్ సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా రిలాక్స్ కాలేదు. బాధ్యతగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. నేను 143 పరుగుల వద్ద ఔట్ అయ్యాను. నాకు ఆడేందుకు ఇంకా 20 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాను. నేను 100 శాతం నా ప్రదర్శన ఇవ్వలేకపోయాను. నా నెక్స్ట్ టార్గెట్ డబుల్ సెంచరీ. 50 ఓవర్లు ఆడటానికి ప్రయత్నిస్తాను. నేను ఎంత ఎక్కువ పరుగులు చేస్తే జట్టుకు అంత ప్రయోజనం చేకూరుస్తుంది’ అని వైభవ్ చెప్పాడు.
Also Read: ENG vs IND: సరేలే ఎన్నో అనుకుంటాం.. హ్యారీ బ్రూక్‌కు గిల్ స్ట్రాంగ్ కౌంటర్!
వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డుల్లో నిలిచాడు. సర్ఫరాజ్ ఖాన్ దశాబ్ద కాలం నాటి రికార్డును బద్దలు కొట్టాడు. సర్ఫరాజ్ 2013లో దక్షిణాఫ్రికా అండర్-19పై 15 సంవత్సరాల 338 రోజుల వయసులో సెంచరీ బాదాడు. యూత్ వన్డేల్లో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో సెంచరీ బాదిన బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హుస్సేన్ శాంటో రికార్డును కూడా అధిగమించాడు. 2013లో 14 సంవత్సరాల 241 రోజుల వయసులో శాంటో సెంచరీ చేశాడు.