Uttam Kumar Reddy : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం. మూడు కోట్ల మందికి ప్రతి నెలా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం అమలులో లేదు,” అని మంత్రి తెలిపారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నట్లు, గతంలో సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం పేదలకు చేరకపోవడం వల్లనే ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. “అది మధ్యలోనే దారి మళ్లి, అసలు లబ్దిదారులకు చేరకుండా తేడా వచ్చింది. అందుకే ఈసారి సన్న బియ్యాన్ని తీసుకువచ్చాం,” అని వివరించారు. ఈ పథకం విజయవంతం కావాలంటే, ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పథకం అమలును దగ్గర నుండి పర్యవేక్షించాల్సిందే అని మంత్రి స్పష్టం చేశారు. “సన్న బియ్యం పేదలకు న్యాయంగా అందేలా చూసే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిదే,” అని అన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశేష సూచన చేశారు: “ప్రతి ప్రజాప్రతినిధి, ఒక్కసారి అయినా సన్న బియ్యం తీసుకునే లబ్దిదారుల ఇంటిలో భోజనం చేయాలి. అప్పుడే వారు తినే అన్నం నాణ్యత ఎలా ఉందో తెలిసి వస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం రేషన్ సరఫరాగా కాకుండా, ఆహార భద్రతకు సంకేతంగా తీసుకుంటోంది. అన్ని శాఖల సమన్వయంతో సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు, లోపాలు లేకుండా చూడటం, అధికారుల కర్తవ్యం అని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా.. ‘సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలి. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశాం. ఇప్పుడు 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 49 వేల కార్డులే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు 30 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ప్రతీ అర్హునికి రేషన్ కార్డును అందిస్తాం.’ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.