US – China Tariffs: అమెరికా, చైనా దేశాలు పరస్పర వాణిజ్య ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు సంయుక్తంగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో రాబోయే 90 రోజులపాటు ఇరు దేశాలు తమ సుంకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. సమాచారం మేరకు, అమెరికా ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాన్ని ప్రస్తుత 145 శాతం నుండి ఏకంగా 30 శాతానికి తగ్గించనుంది. అదే విధంగా, చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన సుంకాన్ని 125 శాతం నుండి 10 శాతానికి తగ్గించనుంది. ఈ తగ్గింపు నిర్ణయం 90 రోజులపాటు అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: End Of RO-KO Era: దిగ్గజాల రిటైర్మెంట్.. టెస్టుల్లో ముగిసిన RO-KO శకం..!
జెనీవాలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ.. “90 రోజుల విరామ ఒప్పందాన్నీ మేము చేరుకున్నాం.. సుంకాలను గణనీయంగా తగ్గించాం” అని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత అమెరికా డాలర్ గత నెలలోపు గరిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: Virat Kohli Test Retirement: అభిమానులకు హార్ట్ బ్రేక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ!
తాజాగా ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “చైనా తో వాణిజ్య చర్చల మొదటి రోజే గొప్ప పురోగతి సాధించాం” అని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఇరు దేశాలు పరస్పరం విధించిన అధిక సుంకాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక రంగానికి ఊరటను కలిగించనుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం వలన ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగవ్వడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సహకరిస్తుందని భావిస్తున్నారు.