Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను అమ్ముతున్నారు? అంటూ నిలదీశారు.
వేల ఎకరాల భూములను నాడు కేసీఆర్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, ఇప్పుడు అదే విధానం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు పాయల్ శంకర్. రాష్ట్రాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే భూములను అమ్మడం తప్పని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు పాయల్ శంకర్.
పాయల్ శంకర్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీ చేశాడు. ఇప్పుడు భూమాత పేరుతో కాంగ్రెస్ భూ దందాకు తెరలేపుతోంది.’’ ‘‘యూనివర్శిటీ భూములు ప్రభుత్వానివే కాకపోతే, అవి ఎవరివి? విద్యా సంస్థలకు సంబంధించిన భూములను అమ్మకానికి పెట్టడం ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు.
‘‘యూనివర్శిటీ భూములపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ) వెళ్లినప్పుడు పోలీసులు మమ్మల్ని నిర్బంధించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలా అణిచివేత పాలన సాగిస్తారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూనివర్శిటీ భూముల అమ్మకంపై రాజ్యసభలో కూడా ప్రస్తావించాం. భూముల లెక్కలు బయటపెట్టే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ భూముల విక్రయ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి’’ అని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
CM Chandrababu: వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది..!