Ukraine Denies Kremlin Drone Attack Allegations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. మే 9న అత్యంత ముఖ్యమైన సెలవుదినం సందర్భంగా పుతిన్ క్రెమ్లిన్ నివాసాన్ని రాత్రిపూట రెండు డ్రోన్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనిని ఉక్రేనియన్ “ఉగ్రవాద దాడి”గా రష్యా అభివర్ణించింది.
క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడులతో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్ష ప్రతినిధి మిఖైలో పొడోల్యాక్ అన్నారు. “ఉక్రెయిన్ క్రెమ్లిన్‌పై దాడి చేయదు ఎందుకంటే, ముందుగా అది ఎటువంటి సైనిక లక్ష్యాలను పరిష్కరించదు.” అని ఆయన కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో 14 నెలల యుద్ధంలో మరింత తీవ్రతరం కావడానికి మాస్కో ఈ విధంగా ఆరోపణలు చేస్తోందని ఆయన సూచించారు. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడికి సిద్ధం చేసే ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలని మిఖైలో పొడోల్యాక్ తెలిపారు. క్రెమ్లిన్‌పై దాడి చేయడం ఉక్రెయిన్‌కు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని.. రష్యాను మరింత తీవ్రమైన చర్యలకు రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుందని పోడోల్యాక్ అన్నారు. “ఉక్రెయిన్ ప్రత్యేకంగా రక్షణాత్మక యుద్ధాన్ని చేస్తుంది. రష్యన్ ఫెడరేషన్ యొక్క భూభాగంలో లక్ష్యాలపై దాడి చేయదు” అని పోడోల్యాక్ చెప్పారు.
Read Also: Russia-Ukraine War: పుతిన్‌పై హత్యాయత్నం!.. ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా హెచ్చరిక
ఇదిలా ఉండగా.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు. ఇదిలా ఉండగా.. దాడి అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నివాసంపై క్షిపణి దాడికి రష్యా పార్లమెంట్ పిలుపునిచ్చింది. జెలెన్‌స్కీ ఈ కుట్ర చేశారని.. ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉందని పేర్కొంది.