OYO యూజర్స్‌కు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి UIDAI ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓయోలో ఆధార్ ఫోటో కాపీల సేకరణను UIDAI నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త నియమం అమల్లోకి వచ్చిన తర్వాత హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు, టెలికాం కంపెనీలు QR కోడ్ లేదా ఆధార్ యాప్ ఉపయోగించి డిజిటల్ ఆధార్ ధృవీకరణ కోసం UIDAI వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంది.
READ ALSO: Anesthetic Injections : చాంద్రాయణగుట్ట మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ఇద్దరు డాక్టర్లు అరెస్ట్
ఆధార్ కార్డులోని QR కోడ్ విలువైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇది సున్నితమైన వివరాలను బహిర్గతం చేయకుండా సురక్షిత ధృవీకరణకు అనుమతిస్తుంది. ఆధార్ యాప్ సురక్షిత ధృవీకరణ, చిరునామా నవీకరణలకు సహాయపడుతుంది. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ కింద ఆధార్ ఆధారిత ధృవీకరణను నిర్వహించే కంపెనీలు ఈ వ్యవస్థలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని UIDAI CEO భువనేష్ కుమార్ తెలిపారు. కొత్త ధృవీకరణ సాంకేతికత వేగంగా ఉంటుంది, గుర్తింపు దొంగతనం ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. “కొత్త నియమాన్ని అధికారులు ఆమోదించారు. ఇది త్వరలో అధికారికంగా అమలులోకి వస్తుంది. హోటళ్లు, ఈవెంట్ నిర్వాహకులు వంటి ఆఫ్‌లైన్ ధృవీకరణను నిర్వహించే సంస్థలకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తుంది. కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను తగ్గించడమే దీని లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ ఆధార్ డేటాబేస్ సర్వర్ లేకపోయినా యాప్-టు-యాప్ ధృవీకరణను ప్రారంభించే కొత్త యాప్‌ను టెస్టింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. “ఆఫ్‌లైన్ ధృవీకరణతో పని లేకుండా ఈ కొత్త వ్యవస్థ ధృవీకరణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా వినియోగదారుల గోప్యత కాపాడతుంది. దీంతో ఆధార్ డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉండదు” అని అన్నారు.
READ ALSO: CNAP India: ఫోన్ నంబర్ సేవ్ చేయాల్సిన రోజులు పోయాయి.. ఇదే ఆ మ్యాజిక్ ఫీచర్!