Munugode Bypoll: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో శుక్రవారం నుంచే నామినేషన్ల దాఖలు కూడా ప్రారంభమైపోయింది. తొలి రోజు సాయంత్రం 4 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా… రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు దాఖలు చేసిన నామినేషన్ ఒకటి కాగా… రెండో దానిని స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంకట్ రెడ్డి దాఖలు చేశారు.
Harish Rao: తెలంగాణ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టట్లేదా?
శుక్రవారం మొదలైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 14తో ముగియనుంది. నామినేషన్లు దాఖలు ప్రారంభమైన శుక్రవారం తర్వాత రెండు రోజుల పాటు నామినేషన్ల దాఖలు ఉండదు. ఎందుకనగా.. రెండురోజులు సెలవు దినాలు రెండో శనివారం, ఆదివారం కావడంతో నామినేషన్ల దాఖలుకు వీలు ఉండదు. ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికీ అన్ని కీలక పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇవాళే అధికార తెరాస తమ అభ్యర్థిని ప్రకటించింది. మునుగోడు ఇంఛార్జిగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.