Leopards in Tirumala: కళియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన ఏడు కొండలపై చిరుతలు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి.. ఓ బాలుడు చిరుత దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడగా.. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనల తర్వాత అప్రమత్తమైన టీటీడీ.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఐదు చిరుతలను బంధించినా.. ఇంకా భక్తుల్లో భయాందోళనలు తొలగడం లేదు.. ఎందుకంటే.. ఆపరేషన్ చిరుతలో భాగంగా తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు తాజాగా మరో రెండు చిరుతల కదలికలు చిక్కాయి.. ట్రాప్ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు.. రెండు చిరుతల సంచారాన్ని గుర్తించారు. స్పెషల్ టైప్ క్వార్టర్స్ సమీపంలో ఒకటి.. నరశింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నరట్టు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఇక, రెండు చిరుతలను ట్రాప్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ రెండు చిరుతలను కూడా బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించిన విషయం విదితమే. కాగా, జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28, సెప్టెంబర్ 6వ తేదీల్లో మొత్తం ఐదు చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు.. ఆపరేషన్ చిరుత కొనసాగుతోందని గురువారం టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే మరో రెండు చిరుతల సంచారం కలకలం రేపుతోంది.
Read Also: Crude Oil Price: ధరాభారంతో సామాన్యుడికి చుక్కులే.. 2024లో బ్యారెల్ 107 డాలర్లకు క్రూడాయిల్