హైదరాబాద్‌లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్, మద్దతుధరలు, ఆయిల్ పామ్ సాగు- ప్రాసెసింగ్, శీతల గిడ్డంగులు ఏర్పాటు, తదితర అంశాల గురించి వివిధ కోణాలలో చర్చించుటము జరిగింది. భూసార పరీక్షలు ఆధారంగా పంటల సాగు మీద దృష్టి సారించడం ద్వారా రసాయన ఎరువులు వాడకం గణనీయంగా తగ్గే అవకాశముంది.
పర్యవసానంగా భూసార పరిరక్షణకు అవసరం అయిన రీతిలో నేల భౌతిక, రసాయన గుణాలు మెరుగు పడుతుంది అని రైతులు వారి అనుభవాలను మంత్రికి వివరించారు. మల్టీ లేయర్ క్రాపింగ్ ద్వారా ఒక స్థిరమైన ఆదాయం సంవత్సరం పొడవునా లభించే అవకాశం ఉందని, ఆ పద్దతులను ప్రవేశ పెట్టాలని మంత్రి గారిని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రాలు భూసార పరీక్షలు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన తో పాటు ఆచరించటం లో భాగస్వామ్యం అందుకునేలా చేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని మంత్రి గారికి తెలియచేశారు.