Tirumala: తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు పార్వేటి ఉత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడూ ఈ నూతన మండప నిర్మాణం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విమర్శకులు ఎవరైనా ప్రతి ఒక్కటీ రాజకీయ కోణంతో చూసి విమర్శించడం సరైన చర్య కాదన్నారు.
అందరూ కూడా భక్తులే కావచ్చు, కానీ, అది సకారాత్మక దృక్కోణమా లేక నకారాత్మక దృక్కోణమా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. మనం చేసే సలహా సద్విమర్శగా ఉండాలి, అది కూడా భగవంతునికి సంబంధించిన విషయాల్లో అయితే ఓ సలహాగానే ఉండాలని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. విమర్శల దాడి చేసి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలనుకుంటే దేవుని పట్ల అపచారం చేసినవాళ్లవుతారన్నారు. మనకు వచ్చిన ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని అనుకుంటే అది వారి పొరపాటేనని వ్యాఖ్యానించారు. టీటీడీలో పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చు, లేదా అత్యున్నత అధికారులంతా జ్ఞానం లేకుండా పనిచేస్తారని, మనమొక్కరమే చాలా గొప్పగా ఆలోచిస్తామని అనుకోవడం బాధాకరమన్నారు.
Also Read: ISRO Chief : గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
టీటీడీ అధికారులంతా చాలా భక్తితో పనిచేస్తారు, అంతేకాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని తపన పడుతుంటారని ఆయన తెలిపారు. వందల సంవత్సరాల నుంచి ఉన్న నిర్మాణాలు ఉపయోగంలో లేనప్పుడు వాటిని కాపాడుకోవడం తేలిక అన్నారు. కానీ, వాటిని ప్రతి సారి వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వాటితో ప్రయోగాలు చేయడం చాలా తప్పిదమని పేర్కొన్నారు. పార్వేటి మండపం చాలా శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉండేది, కాబట్టే దాన్ని ఆధునీకరించడం జరిగిందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వచ్చిన చాలా చక్కటి ఆలోచన ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. చాలా చక్కగా దాన్ని ఆధునీకరించారని వెల్లడించారు. ప్రతి భక్తుడు ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు.