టమాటా ధర ఆకాశాన్ని తాకుతుంది. ఒకప్పుడు కిలో రెండు రూపాయలు కూడా అమ్మిన టమాటా ఇప్పుడు వందల్లో పలుకుతుంది, దీంతో సామాన్య ప్రజలు టమాటా కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. ఏప్రిల్-మే నెలలో అధిక స్థాయిలో ఉన్న వేడి వల్ల టమాటా పంట పైన తీవ్రమైన ఫ్రభావాన్ని చూపి రకరకాల తెగుళ్ళకి కారణమైంది. దీంతో చాలామంది రైతులు పంటను కోల్పోవడంతో టమాటా దిగుమతి భారీగా తగ్గిపోవడంతో ధర విపరీతంగా పెరిగింది. పెరిగిన టమాటా ధరతో అక్కడక్కడా దొంగతనాలు కూడా జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి సంఘటనే ప్రస్తుతం బీహార్ లోను చోటు చేసుకుంది.
Read Also: Rahul Gandhi: పార్లమెంటు సభ్యత్వం పునరుద్ధరణ.. లోక్ సభలో అడుగుపెట్టనున్న రాహుల్
అయితే, నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ నిన్న (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి.. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ ఎంత వారించినా వినకుండా ప్రజలు దోపిడీ చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Read Also: Gaddar: ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరపొద్దు: ఏటీఎఫ్
ఇక, టమాటాలను తీసుకువెళుతున్న ప్రజలను చెదరగొట్టి మిగిలిన సరుకుని స్వాధీనం చేసుకున్నారు. టమాటాలను చోరీ చేసుకున్న గ్రామస్తుల దగ్గర నుంచి చాలా వరకు సరుకును వెనక్కి తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు రూ. 200 నుంచి రూ.250 వరకు పలికిన టమాటా ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నప్పటికీ రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతూ ధర ఇంకా వంద పైనే ఉంది.