ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో భారీవర్షాలతో జనజీవితం అస్తవ్యస్తమైంది. మెజారిటీ జిల్లాల్లో రైతులు వేసుకున్న పంటలు నీట కొట్టుకుపోయాయి. సుమారు రూ.1500 కోట్ల విలువైన పంట నష్టం జరిగింది. మీరు కేంద్రానికి ఓ తూతూ మంత్రపు నివేదిక పంపి చేతులు దలుపుకున్నారు. ఈ నష్టానికి తోడు వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. కొన్ని చోట్ల వరదలతో గులకరాళ్లతో పొలాలు నిండిపోయాయి. వేసిన పంట నష్టపోవడమే కాక తిరిగి పంట వేసుకోవాలంటే ఆ పొలాలను శుభ్రం చేసుకోవడం రైతులకు ఆర్థికంగా తలకు మించిన భారం. ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయించక పోవడం దుర్మార్గం… క్షమించరాని నేరం.
వరద ప్రాంతాల్లో తూతూ మంత్రంగా మీరు చేసిన పర్యటనతో ప్రజలకు ఒరిగింది ఏమిటి? కౌబాయ్ లాగా విహార యాత్రకు వెళ్లినట్టు ఉందే తప్ప ఆ పర్యటనతో రైతులకు, వరద బాధితులకు ఏం ఊరట లభించిందో చెప్పగలరా?. కేంద్ర సాయమైనా కోరతారేమో అనుకుంటే కమీషన్లు దండుకునేందుకు కాంట్రాక్టర్ల బిల్లుల కోసం మీరు ప్రయత్నించారు తప్ప కేంద్ర వరద సాయం పై మాత్రం కనీస ప్రయత్నం చేయలేదు. జనాలు చస్తుంటే డ్రామాలేంటి…!? రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్లు గడిచిపోయి తొమ్మిదో ఏడాదికి సమీపంలో ఉన్నాం అని ఆయన అన్నారు.