*సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగి పోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. మేడిగడ్డ, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జీతో విచారణకు ఆదేశిస్తామని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు? వారి వెనుక ఉన్న మంత్రులు ఎవరు? అధికారుల పాత్ర అన్ని విచారణలో బయటకు వస్తాయని.. నిష్పాక్షిక విచారణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నిజాం చక్కర కర్మాగారం తిరిగి ప్రారంభానికి కట్టుబడి ఉన్నాం.. మంత్రులతో ఒక కమిటీ వేస్తాం.. తన పాదయాత్ర సందర్భంగా కూడా ఈ విషయం అక్కడి ప్రజలకు తెలిపానన్నారు. తమ మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం నకిలీ ప్రభుత్వం.. తమ ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పబ్బులు, బార్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. పబ్బులు, బార్ల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్స్ లో ముఖ్యమంత్రి టిఫిన్ పథకాన్ని సమీక్ష చేస్తామని పేర్కొన్నారు. వారంలో మూడు రోజులు మంత్రులు సెక్రటేరియట్ లో అందుబాటులో ఉంటారని.. రోజు 3 నుంచి 6 గంటల పాటు ఆయా మంత్రులను కలిసి సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వొచ్చన్నారు. అసెంబ్లీ ఆవరణలోని హాల్ లోకి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు శాసన మండలిని అక్కడకు షిఫ్ట్ చేద్దామని తెలిపారు. మనం పాలకులం కాదు.. సేవకులం.. సమస్యలను ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు.. తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని సీఎం తెలిపారు. ఒకరినొకరం సహకరించుకుందామని పేర్కొన్నారు.
*ఇందిరమ్మ రాజ్యం కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది.. మండలిలో సీఎం..
శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని సభలలో తనకు అనుభవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన తప్పును మేము సరిదిద్దాము.. అందుకే గతంలో ప్రగతి భవన్ ముందు ఉంచిన ముల్లె కంచెను తొలగించామని తెలిపారు. పాలనపరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకున్న వారు ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వండి అని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బీమాలు చూస్తే అర్థం అవుతుంది… ఎంత మంది యువ రైతులు చనిపోయారో అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కల్పించుకుని మండలి చైర్మన్ గుత్తా క్లారిటీ ఇచ్చారు.
*తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20కి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా సాగాయి. ఈ క్రమంలో.. మళ్లీ ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి విరుచుకుపడగా.. అటు ప్రతిపక్ష నేత కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకుపడ్డారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప.. ఏముంది చెప్పుకోవడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. ఇలా శనివారం అసెంబ్లీ హాట్ హాట్ గా కొనసాగింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
*నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. నిజంగానే సిగ్గు పడుతున్నా.. పంట భీమా, రైతు భీమాకి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు సీఎం అని ఎద్దేవా చేశారు. అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39 కోట్లు.. 2014 తర్వాత ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుక మాఫియా మాది కాదు.. కాంగ్రెస్ దని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా ఉండేదని.. అందుకే అప్పట్లో రూ.4 కోట్ల ఆదాయం కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేరేళ్లలో తనకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దని కేటీఆర్ సూచించారు. ఏ విచారణకు అయినా సిద్ధం.. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు.. డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వంటి సమర్థుడైన అధికారిని దీనికి చీఫ్‌గా నియమించామని పేర్కొన్నారు. తొమ్మిది నెలల కిందటే అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెట్లతో ఓ పకడ్బందీగా యాంటీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీవీ ఆనంద్‌ను ఆ స్థానం నుంచి బదిలీ చేసిందని, దీని వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
*సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయింది.. తెలుసుకుంటామన్నారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. మేడిగడ్డ అది ఏమైనా టూరిస్ట్ స్పాటా అందరినీ తీసుకు వెళ్ళడానికి అని ప్రశ్నించారు?. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కమిటీని తీసుకు వెళ్ళండని తెలిపారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కవిత అన్నారు. గవర్నర్ స్పీచ్ బాధాకరంగా ఉంది.. జనాలు కూడా అదే బాధతో ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. మండలిలో తమకు మెజార్టీ సభ్యులు ఉన్నా.. ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు తాను మండలి లో ఇచ్చిన అమైండ్ మెంట్ ను వెనక్కి తీసుకున్నానని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తాము ఏమి చేస్తాము అని చెప్పాలి కానీ.. గత ప్రభుత్వ పాలన అని ఎన్ని రోజులు చెపుతారని విమర్శించారు. తెలంగాణలోని ప్రజలకు నష్టాలు జరిగితే ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత పేర్కొన్నారు.
*కేసీఆర్ కుటుంబం సహా.. బీఆర్ఎస్ నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయండి
అధికారంలో ఉన్నన్నాళ్లు అవినీతి, అరాచకాలతో చెలరేగిపోయి ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతల పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేనిపక్షంలో వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని చెప్పారు. కేసీఆర్ హయాంలో పదవీ విరమణ చేసినప్పటికీ సీఎంఓలో పనిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటూ కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టిన అధికారుల పాస్ పోర్టులను సైతం సీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ను ఈ విషయంలో మినహాయించాలని కోరారు. కరీంనగర్ లో ఈరోజు మధ్యాహ్నం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం జరిగింది. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బీఆర్ఎస్ నేతలు చెబుతుండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ఆ మాటలు అనడానికి సిగ్గుండాలే.. తెలంగాణ బంగారు పళ్లెమే అయితే ఫస్ట్ నాడే జీతాలెందుకివ్వలేకపోయారు? 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం ఎందుకు చేశారు? ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముకున్నారు? నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకియ్యలేదు? నిరుద్యోగ భ్రుతి ఎందుకివ్వలేదు.’’అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. దేశమంతా మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ గాలి వీస్తోంది. 350 ఎంపీ స్థానాలతో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ మోదీగాలి వీస్తోంది. మనకు పోటీ కాంగ్రెస్ మాత్రమే. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదు. మనం చేయాల్సిందల్లా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇంటింటికీ తీసుకెళ్లడమే. ఈ విషయంలో కొంత వెనుకబడ్డాం.. ఇకపై ప్రతి ఒక్కరూ బీజేపీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలి.’’అని కోరారు
*శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ
పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని కనులారా దర్శించుకొసే అదృష్టం.. ప్రార్థించే అవకాశం కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం.. టీటీడీ అనేక రకాల చర్యలు చేపడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాట్లు చేస్తుంది. ఇక వేసవికాలకంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం.. గంటల కొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది.
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2024 మార్చి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు ఇలా ఉన్నాయి.
– డిసెంబరు 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.
– డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
– డిసెంబరు 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
– డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.
– డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.
– డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు.
– డిసెంబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు.
– డిసెంబరు 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు.
– డిసెంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.
– డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరింది.
*చంద్రబాబు, లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేయగలరా?.. అంబటి సవాల్
చంద్రబాబు మతిస్థిమితం లేకుండా కామెంట్స్ చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు చంద్రబాబు సింగిల్‌గా పోటీ చేయలేక పోతున్నారని.. చంద్రబాబు, లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనేదే మా వ్యూహమని మంత్రి చెప్పారు. చంద్రబాబు రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీలో… అప్పుడు చంద్రగిరిలో ఓడిపోయాడు.. కుప్పంలో ఇప్పుడు ఓడిపోతాడని పోటీ చేయడేమో అని ఆయన అన్నారు. రిమాండ్ తరువాత చంద్రబాబు మతి భ్రమించిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో నీకు ఎన్టీఆర్… మంగళగిరిలో లోకేష్ కు జగన్.. దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు. జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే 30 లక్షల మందికి ఇళ్ళిచ్చారని.. మూడుసార్లు మీరు ఏం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా అంతర్గత మార్పుల మీద మీ మాటలు బాధాకరమన్నారు. యువగళం.. నడిచిన లోకేష్ ఏమైనా ఎదిగాడా.. బరుగు తగ్గాడనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు. యువగళం అట్టర్ ఫ్లాప్.. లోకేష్ అంగుళం కూడా ఎదగలేదన్నారు. రెడ్ బుక్‌తో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పవన్‌కి చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్ఠి వేస్తారని ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు.. మీది కలహాల కాపురం అని ఎప్పుడో తెలిసిందన్నారు. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం.. అక్కడే గెలుస్తారన్నారు. పదేళ్ళ పొత్తు ఏమిటో… కాంట్రాక్టు ప్యాకేజీ పదేళ్ళకు మాట్లాడుకున్నారేమో అంటూ ఆయన విమర్శించారు.
*రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మళ్లీ వేస్తారా?
రెండు ఓట్ల వివాదంలో జనసేన నేత నాగబాబు చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటీవల నాగబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఏపీలో ఓటు కోసం నాగబాబు కుటుంబం దరఖాస్తు చేసింది. ప్రస్తుతం నాగబాబు ఓటర్ అప్లికేషన్ సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ శ్రేణులు జనసేనపై విమర్శలు సంధిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ఓటు కోసం నాగబాబు ఫ్యామిలీ దరఖాస్తు చేయగా.. ఒక ఓటు ఉండగా రెండో ఓటు కోసం దరఖాస్తు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగబాబు రెండో ఓటు అంశంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. తెలంగాణలో ఓటు వినియోగించుకున్న నాగబాబు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఓటు వేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఓటు హక్కు అనేది ఒకే చోట ఉంటుంది. జనసేన నేత నాగబాబుకు కూడా ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. అయితే, తెలంగాణలో లేదంటే.. ఏపీలో ఈ హక్కు ఉండాలి. రెండు చోట్ల ఉండే అవకాశం లేదు. అందుకే ఓటు మార్చుకున్నప్పుడు కొత్త చోట అవకాశం కల్పిస్తూ.. గతంలో ఉన్న చోట ఆ హక్కును తొలగిస్తారు. నాగబాబు ఏపీలో ఓటు హక్కుకు దరఖాస్తు చేయగానే.. బూత్ లెవల్ ఆఫీసర్ విచారణ చేశారు. నాగబాబు దరఖాస్తులో పేర్కొన్న చిరునామాకు అధికారులు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో పక్కింటి వారికి సమాచారం ఇచ్చారు. నాగబాబు తమ ముందు హాజరు కావాలని పేర్కొన్నారు.
*రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ కోర్టు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై 2018లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 18 ఈ కేసును విచారించిన న్యాయమూర్తి యోగేష్ యాదవ్, వాదనలు విన్న తర్వాత విచారణలు నవంబర్ 27కి వాయిదా వేశారు. అయితే ఈ సమయంలోనే డిసెంబర్ 16న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు సమన్లను జారీ చేసింది. జనవర్ 6న హాజరుకావాలని అందులో పేర్కొంది. రాహుల్ గాంధీ అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా 2018 ఆగస్టు 4న కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ హాజరుకావల్సి ఉన్నా రాలేదని మిశ్రా తరుపు న్యాయవాది పాండే తెలిపారు.