*బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమస్ఫూర్తిని నింపిన అందెశ్రీ కవితని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు.. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు.. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచారు.. బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబపాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు ఇలానే ఉంటే వారిని ఎక్కడికి పంపించాలో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. గడీలు బద్దలుకొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రగతిభవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను బద్దలుకొట్టామన్నారు. ప్రగతిభవన్‌లోకి 4 కోట్ల మందికి అవకాశం కల్పించాం.. తమది ప్రజా ప్రభుత్వం అని అన్నారు. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతిభవన్‌లోకి రానిచ్చారా అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. నిండు సభలో ప్రజా స్వామ్యం కుని చేశారు. కోమటిరెడ్డి, సంపత్ లాంటి వాళ్ళను బయటకు గెంటిసిన ప్రభుత్వం మీదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. నిరసన తెలిపినందుకు సభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజు కూడా ఈ సభలోనే జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు.
*డీఎస్సీ నోటిఫికేషన్ పై అసెంబ్లీలో చర్చ.. ఉర్దూని చేర్చాలని ఎంఐఎం డిమాండ్
డీఎస్సీ నోటిఫికేషన్ పై అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఉర్దూని డీఎస్సీలో చేర్చాలని ఎంఐఎం అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ ను నేను ఎప్పుడు తలచుకుంటాను ఎందుకంటే ఆయన అందరిని ఆదరించే మనస్తత్వం కాలవారన్నారు. మేము కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని ఎవరైనా అంటే.. అవును మేము రాజశేఖర్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని స్పష్టం చేశారు. ఆయన ఆదరణ, ప్రేమ వల్ల మేము కాంగ్రెస్ కు దగ్గరగా వున్నామని తెలిపారు. మేము ఎమైన బాధలు చెప్పుకున్నా దానిని ఆయన ఆదరించి నిర్వర్తించే వారు కాబట్టే మేము రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా వున్నామన్నారు. అందుకే కాంగ్రెస్ పాలనను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. డీఎస్సీలో ముస్లిం లకు చేర్చండి అని అన్నారు. డీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఉర్దూని కూడా చేర్చాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉర్దూ రాదన్నారు. చట్టం ఎస్సీ, ఎస్టీ లకు పోస్ట్‌లు ఇవ్వమంటే డీఎస్సీని రెండు సార్లు ఇవ్వాలని కోరారు. డీఎస్సీ నోటిఫికేషన్ రెండు సార్లు ఇస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉర్దూకు సంబంధించినవి భర్తీకానివి భర్తీ అవుతాయని అన్నారు. ఇది చాలా ముఖ్యమైనది అన్నారు. ఎన్ని కాంపిటేటువ్ పరీక్షలు వున్నాయో, ప్రమోషన్ ఎగ్జామ్స్‌లో డిపార్ట్ మెంటల్ అన్నింటిలోనూ ఉర్దూను చేర్చాలని అసెంబ్లీలో కోరారు. ఇది చాలా అవసరమని.. కానీ ఈ పని జరగడం లేదని అన్నారు. ఇప్పటివరకు ఎన్ని అయితే రిక్రూట్ మెంట్ పరీక్షలు వున్నాయో వాటన్నింటిని ఉర్దూలో పెట్టండి అన్నారు. కాంగ్రెస్- హామీలు చాలా ఇచ్చారని అన్నారు. ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలు తీర్పు ఇచ్చారు…ఎవరి బాధ్యతలు వారికి ప్రజలు అప్పగించారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్టీ హామీలను అమలు చేయాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని కామెంట్స్ సరిగా లేవన్నారు. బీఆర్ఎస్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇస్తుందా అని అడుగుతున్న? అని ప్రశ్నించారు. మైనార్టీలు, బీసీలకు ప్రత్యేక సభ్ ప్లాన్ కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నంను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలకులకుగా చాలా అనుభవం ఉంది…వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు అనుకుంటా అన్నారు. 3 లక్షల 10 వేల కోట్ల రూపాయలు కావాలి …కాంగ్రెస్ ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు కాంగ్రెస్ అన్ని చూసే మ్యానిఫెస్ట్ తయారు చేశారు అనుకుంటా అని అక్బరుద్దీన్ తెలిపారు.
*కమిట్మెంట్తో ఇచ్చిన హామీలు అమలు చేయండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది.. భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు ఉండకుండా చూడాలి.. మార్షల్ కి పని చెప్పకుండా పని చేద్దామని కూనంనేని తెలిపారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచిది కాదు అని తన ఉద్దేశమన్నారు. తక్కువ రోజులు కాకుండా.. ఎక్కువ రోజులు సభ జరపండి.. ఆరు గ్యారంటీల అమలు చేయండని తెలిపారు.వైఎస్ చాలా హామీలు ఇచ్చి.. అమలు చేశారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. మీరు కూడా అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయండని పేర్కొన్నారు. కమిట్ మెంట్ తో ప్లానింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయండని అన్నారు. లక్ష కోట్లతో ప్రాజెక్టు కడితే.. 10 వేల కోట్లే ఉపయోగంలోకి వస్తున్నాయని తెలిపారు. మిగిలినవి ఎటు వెళ్తున్నాయో అర్థం కాలేదు.. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అలా కాకుండా చూడాలని తెలిపారు. మీ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు అంటున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు.. మళ్ళీ కొనడం మొదలు పెడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి అతి ఉత్సాహం మాటలుపనికి రాదని అన్నారు. ప్రజల ఆలోచన పక్కదారి పెట్టె అంశం గత పదేళ్ళలో చేశారని కూనంనేని ఆరోపించారు. కొనుగోలు.. అమ్మకాలు చాలా చూశాం.. అమ్ముడు పోయిన వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారు.. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి తప్పు చేసింది టీఆర్ఎస్సేనన్నారు. దాంతో నెగిటివ్ వచ్చింది.. స్వేచ్ఛ లేకుండా పోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి.. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది ఎన్ని రోజులు హౌస్ అరెస్ట్ అయ్యారో లెక్క బయట పెట్టండని తెలిపారు. ప్రజలు పంజరం నుండి బయట పడ్డట్టు ఫీల్ అవుతున్నారని అన్నారు. ధర్నాలు చేసే అవకాశం లేదు.. సమ్మెలు చేస్తే ఉద్యోగాలు తీసేశారని కూనంనేని తెలిపారు.
*కూనంనేని వ్యాఖ్యలకు హరీష్ రావు అభ్యంతరం..
సీపీఎం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ‘కూనంనేని సాంబశివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగ్రెస్‌కు మిత్ర పక్షం. ఇద్దరు కలిసి పోటీ చేశారు. మేం ఇంటికి ఒక ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. తాము అలా చెప్పినట్లు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. గవర్నర్ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే బాగుంటుంది’అని హరీశ్‌రావు అన్నారు. అనంతరం కూనంనేని మళ్లీ మాట్లడడం ప్రారంభించిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాగా.. కూనంనేని వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ మద్ధతుగా ఉన్నారు. ఇది పద్దతి కాదు.. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడుతున్నారు.. మాట్లాడనివ్వండని పొన్నం తెలిపారు.
*175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు..
ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గతంలో 29 ఎస్సీ నియోజకవర్గాలకు 28 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది.. ఈసారి 29 స్దానాల్లో గెలుస్తాం.. చంద్రబాబు కొన్ని మీడియాలను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారు అని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు వైసీపీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేల స్థానాలే చివరకు వారికి ఎన్నికల్లో లభించాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరక్క పోటీ కూడా చేయలేని చంద్రబాబు ఈరోజు ఏదో ప్రచారం చేసి గెలవాలని చూస్తున్నారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అక్కడి చెల్లని వాళ్లకు మరోక చోట సీట్లు అని చంద్రబాబు అంటున్నారు.. ఆయన పోటీ చేసే స్థానాన్ని చంద్రగిరి నుంచి కుప్పంకు ఎందుకు మారారు అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి జైలుకు కూడా వెళ్లిన చంద్రబాబు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మైండ్ గేమ్ ఆడుతున్నారు.. కాంగ్రెస్ కోసం హైదరాబాద్ ను అభివృద్ది చేశానని చెప్పుకుని తన వర్గీయుల ద్వారా ప్రచారం చేసిన చంద్రబాబు ఆ సమీప ప్రాంతాల్లో ఎన్ని సీట్లు గెలిపించారో చెప్పాలి.. చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన లేదు.. ఆయనది వృదా ప్రయాసే తప్ప మరోకటి కాదు అంటూ మంత్రి మండిపడ్డారు. చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీలో నిలిపేందుకు అభ్యర్దులు లేరు.. కొండేపి నియోజకవర్గాంలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
*2025లో అందుబాటులోకి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్!
విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు జరుగుతున్న తీరును మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనుల కోసం రూ. 5వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 36 నెలల్లో జీఎంఆర్ వారు ఎయిర్ పోర్టును పూర్తి చేసి అందిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇంకా ముందే పూర్తి చెస్తారని అనిపిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేసిందన్నారు. విశాఖను అభివృద్ధి చెయ్యకుండా అమరావతిపైనే పెట్టుబడులు పెట్టారన్నారు. గతంలో శిలాపలకం వేసి కనీసం పనులు ప్రారంభించ లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని వైవీ సుబ్బా రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు భోగాపురం ఎయిర్ పోర్టు పరిధిలో ఉన్న వివాదాలను పరిష్కరించి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. అలాగే జీఎంఆర్ పనులు ప్రారంభించిందన్నారు. 36నెలల్లో 2025లో ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నామన్నారు. ఈ ఎయిర్‌పోర్టు పూర్తైతే లక్ష ఉద్యోగాలు వస్తాయని… అలాగే పరోక్షంగా మరెందరో ఉపాధి పొందుతారన్నారు. దత్త పుత్రుడు మళ్లీ ఇవ్వన్నీ మేమే చేశామని చెబుతారని ఆయన విమర్శించారు. కానీ, పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పేందుకే ఇప్పుడు విజిట్ చేశామన్నారు. జీఎంఆర్ సంస్థ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులను చేపట్టిందని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. అలాగే జీఎంఆర్ ప్రతిష్టాత్మకమైన ఎల్ అండ్ టీతో ఒప్పందం కుదుర్చుకొని పనులు చేపట్టారన్నారు. 3.8 కిలో మీటర్ల రన్ వే పనులు ఇప్పుడు చేస్తున్నారని మంత్రి తెలిపారు. నాలుగు వేల ఏడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. రన్ వే, టెర్మినల్ పనులు జరుగుతున్నాయన్న ఆయన.. శంషాబాద్‌లాగే భోగాపురం చుట్టు ప్రక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పది వేల మందికి ప్రత్యక్షంగా, యాభై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. 2203 ఎకరాలు తీసుకొని జీఎంఆర్‌కు అప్పగించామన్నారు. 23లో 16 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తైందన్నారు. 404 కుటుంబాలను షిఫ్ట్ చేశామని మంత్రి వెల్లడించారు.
*కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్..
దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని తొలిసారిగా కేరళలో గుర్తించారు. JN.1 సబ్‌వేరియంట్, BA.2.86 వేరియంట్‌గా కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది కనుగొనబడింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసు డిసెంబర్ 8న కేరళలో కనుగొనబడింది. 79 ఏళ్ల మహిళ శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మానవుడి రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకముందు సింగపూర్ దేశంలో ఒక భారతీయ టూరిస్ట్‌కి కూడా JN.1 సబ్-వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిలో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దేశంలో మరెక్కడా కూడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా కేరళలో వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్-19 వేరియంట్ BA.2.86కి JN.1 సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ద్వారా ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని INSACOG చీఫ్, NK అరోరా చెప్పారు. దాదాపుగా ఏడు నెలల అనంతరం భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా్యి. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో JN.1 వ్యాప్తి పెరుగుతోంది.
*నిర్భయ తరహా ఘటన.. కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.
మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా కనిపిస్తే కామాంధుల చేతిలో బలైపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, ఇతర కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. 2012లో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశాన్ని కదిపేసిన నిర్భయ తరహా సంఘటన మరోసారి రిపీట్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి జైపూర్ వెళ్తున్న బస్సులో 20 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 9-10వ తేదీ మధ్య రాత్రి యూపీ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. కాన్పూర్ నుంచి జైపూర్ బస్సులో బాధితురాలు క్యాబిన్‌లో కూర్చున్నట్లు పోలీసులు చెప్పారు. క్యాబిన్‌లో ఉన్న ఆరిఫ్, లలిత్ అనే ఇద్దరు డ్రైవర్‌లు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ కేసులో ఆరిఫ్‌ని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని కనోటా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ భగవాన్ సహాయ్ మీనా తెలిపారు. మరో నిందితుతు లలిత్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. క్యాబిన్ లోపల బాధితురాలు ఉండగా.. బస్సులో మరికొందరు ప్రయాణికులు ఉన్నారని, క్యాబిన్ లోపలి నుంచి మూసేసి ఉందని, అయితే ఘటన సమయంలో మహిళ కాపాడాలని కోరడంతో ప్రయాణికలు అప్రమత్తమయ్యారు. దీంతో వారు బస్సును ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆరిఫ్ ప్రయాణికులకు చిక్కగా.. లలిత్ తప్పించుకున్నాడు.
*ఓడను హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగల యత్నం.. తిప్పికొట్టిన భారత నావికాదళం
అరేబియా సముద్రంలో కార్గో షిప్‌ను హైజాక్ చేసే ప్రయత్నాన్ని తిప్పికొట్టినట్లు భారత నావికాదళం శనివారం వెల్లడించింది. 18 మంది సిబ్బందితో మాల్టా ఫ్లాగ్‌తో కూడిన కార్గో షిప్ ఎంవీ రూవెన్‌ను ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారని, అయితే ఇది తెలిసిన వెంటనే భారత నేవీ బృందం వెంటనే స్పందించినట్లు తెలిపింది. ఐరోపా ద్వీప దేశమైన మాల్టాకు చెందిన కార్గో షిప్ అరేబియా సముద్రంలో హైజాక్ చేయబడింది. సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే(అత్యవసర పరిస్థితి) కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. దానిని కాపాడేందుకు విమానాలు, యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. ఈ విషయాన్ని భారత నౌకాదళం శనివారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. “డిసెంబర్ 14 రాత్రి సమయంలో, ఓడ MV Ruen UK మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) పోర్టల్‌లో మేడే సందేశాన్ని పంపింది. ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓడలోకి ఎక్కినట్లు సందేశం పేర్కొంది. దీనిపై భారత నావికాదళం వేగంగా స్పందించింది. నావల్ మారిటైమ్ అరేబియా సముద్రంలో గస్తీ తిరుగుతున్న పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో విధులు నిర్వహిస్తున్న యాంటీ పైరసీ పెట్రోలింగ్ యుద్ధనౌకను అప్రమత్తం చేసినట్లు నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఓడలో 18 మంది సిబ్బంది ఉన్నారు. యుకె మెరైన్ ట్రేడ్ ఆపరేషన్స్ వారు నౌకపై నియంత్రణ కోల్పోయారని వెల్లడించారు. భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం మరియు ఒక యుద్ధనౌక రూయెన్ నౌకకు సహాయంగా అక్కడికి చేరుకుంది. ప్రస్తుతం సోమాలియా తీరం వైపు పయనిస్తోంది. దాని పైన నావికాదళ విమానం ఎగురుతోంది. మరోవైపు, ఈ ఉదయం రోవెన్ నౌకను భారత యుద్ధ నౌక విజయవంతంగా అడ్డుకున్నట్లు నేవీ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 2017 తర్వాత ఓడలపై సోమాలియా సముద్రపు దొంగలు జరిపిన భారీ దాడి ఇదే.. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ప్రయాణించే నౌకలకు యూకే నేవీ హెచ్చరికలు పంపింది. సోమాలియా తీరం సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పరిస్థితులు అనుమానాస్పదంగా ఉంటే తక్షణమే రిపోర్ట్ చేయాలని తెలిపింది.
*ఇజ్రాయిల్ “మొసాద్ ఏజెంట్”ని ఉరితీసిన ఇరాన్..
ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలు ఉప్పూనిప్పుగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరుగుతూనే ఉంది. ఇరాన్ అణుకార్యక్రమాలు చేపడుతుందని ఆ దేశ కీలక సైంటిస్టులను ఇజ్రాయిల్ లేపిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇరాన్ దేశ కీలక కమాండర్ ఖాసిం సులేమానీని కూడా బాంబు దాడిలో హతమర్చారు. ఈ ఘటనకు ఇజ్రాయిల్ కారణమని పలు వేదికలపై ఇరాన్ ఆరోపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాజా యుద్ధంలో హమాస్ నేతలకు ఇరాన్ సాయపడుతుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ వెనక ఇరాన్ హస్తముందని ఇజ్రాయిల్ ప్రధాన ఆరోపణ. ఇక హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇరాన్ మద్దతు ఉందని పాశ్చాత్యదేశాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్ ఉరితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో మొసాద్ ఏజెంట్‌ని శనివారం ఉరితీసింది. ఉరితీయబడిన వ్యక్తి విదేశాలకు సాయపడుతున్నాడని, ప్రత్యేకం మొసాద్ తో సంబంధాలు ఉన్నాయని, రహస్య సమాచారాన్ని సేకరించి, మొసాద్‌తో పాటు ఇతర విదేశీ సంస్థలకు అందిస్తు్న్నాడంటూ ఇరాన్ ఆరోపించింది. అయితే ఉరితీయబడిన వ్యక్తి పేరును బయటపెట్టలేదు. ఇస్లామిక్ రిపబ్లిక్‌కి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులకు, సంస్థలకు నిందితుడు రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే సదరు వ్యక్తి వివరాలు, ఎప్పుడు, ఎక్కడ అరెస్ట్ చేయబడ్డాడన్న వివరాలపై స్పష్టత లేదు. సిస్తాన్-బలూచిస్తాన్ లోని జహెదాన్ జైలులో ఉరిశిక్షను అమలు చేశారు. బలూచ్ లోని ఉగ్రవాదులు ఒక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని చంపేసిన తర్వాతి రోజే ఈ ఉరి అమలు చేయబడింది. ఆఫ్ఘన్-పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రావిన్సుల్లో తరుచుగా భద్రతా బలగాలకు, సున్నీ తీవ్రవాదులకు ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రాంతంలో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, ఇరాన్ వ్యాప్తంగా చూసుకుంటే షియా ముస్లింలు అధికం. వారి చేతిలోనే అధికారం ఉంటుంది.