Maoist Key Leader Hidma Encounter: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.. కీలక నేతలు సైతం హతం అయ్యారు.. మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు కూడా.. ఈ సమయంలో కీలక నేతగా ఉన్న హిడ్మా ఎక్కడ? హిడ్మా కూడా లొంగిపోతారా? అనే చర్చ జరిగింది.. అయితే, అల్లూరి సీతారామ రాజు జిల్లా రంపచోడవరం దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు.. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ప్రాణాలు విడిచారు.. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య హేమతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు..
ఎవరు ఈ హిడ్మా..?
దేశంలోని అత్యంత ప్రమాదకర మావోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించేవారిలో మడావి హిడుమాయ్ అలియాస్ హిడ్మా అలియాస్ సంతోష్ కీలకంగా ఉన్నారు.. ఆయుధాలు అప్పగించి ఆయన త్వరోనే లొంగిపోతారన్న ప్రచారం వేగంగా సాగుతూ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హిడ్మా ప్రాణాలు కోల్పోయారు.. ఆయన భార్య హేమతో పాటు.. ఆయనకు సెక్యూరిటీ ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు విడిచారని సమాచారం.. అయితే, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు హిడ్మా.. మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడుగా కూడా సేవలు అందించారు.. పీఎల్‌జీఏ (PLGA) ప్లాటూన్-1 కమాండర్ గా పనిచేశారు.. గెరిల్లా దాడులకు వ్యూహకర్త ఆయనకు పేరు ఉంది..
హిడ్మా నాయకత్వంలోనే గతంలో భద్రతా బలగాలపై ఎన్నో దాడులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా స్థానిక మళ్లా, నిషాద్ వర్గాలకు చెందిన వందలాది మందిని మావోయిస్టు విభాగంలో చేర్పించి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి PLGAలో నియమించారని చెబుతారు.. చాలా సార్లు పోలీసులు ముట్టడించినా కూడా హిడ్మా తప్పించుకుని అడవుల్లో మాయమవడం అతని ప్రత్యేకత. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడుల వ్యూహకర్తగా హిడ్మాకు పేరు ఉంది.. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు హిడ్మా.. హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో ఆయనకు పట్టు ఉంది.. అంతేకాదు హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరు ఉంది.. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు.. ఎన్నోసార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు హిడ్మా.. ఇప్పటికైనా ఇంటికిరా బిడ్డా అంటూ ఇటీవలే హిడ్మాను వేడుకుంది ఆయన తల్లి.. వారం క్రితం హిడ్మా తల్లిని కలిశారు ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి.. అయితే, ఇప్పుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా.. ఆయన మృతి మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని దెబ్బగా అంచనా వేస్తున్నారు..
అయితే, ఇప్పటికే మావోయిస్టు కీలక నాయకులు సోనూ, ఆశన్న లొంగిపోయారు. హిడ్మాపై పెద్ద బహుమతి, ఆపరేషన్ ఒత్తిడి పెరుగుతోంది. అడవుల్లో మావోయిస్టుల సంఖ్య బలహీనమవుతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో హిడ్మా కుమార్తె వంజెం కేషా అలియాస్ జిన్నీ వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయింది. చిన్నప్పటి నుంచే మావోయిస్టు సాంస్కృతిక విభాగంలో పని.. మావోయిస్టు కమిటీ సభ్యుడు రమేష్ను వివాహం చేసుకోగా.. 2020లో మహారాష్ట్ర పోలీసులు రమేష్‌ను అరెస్ట్ చేశారు.. ఆపరేషన్ ‘కగార్’ తీవ్రత పెరిగిన తర్వాత కేషా పార్టీని వీడి లొంగిపోయింది.. ఈ పరిణామం హిడ్మా నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు భావించాయి..
కానీ, తాను మాత్రం ఉద్యమాన్ని వీడేది లేదని.. తుపాకీ వదిలేది లేదని హిడ్మా స్పష్టం చేసినట్టు చెబుతారు.. అయితే, ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో సమావేశం కోసం మావోయిస్టులు వచ్చినట్టుగా సమాచారం అందుకున్నాయట భద్రతా దళాలు.. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు.. ఈ నేపథ్ంయలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద భద్రతాబలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగగా.. హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది..