నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్చి 5,6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లి.. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను ఏపీ సీఎం కలవనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు ఓ వివాహ వేడుకకు చంద్రబాబు హాజరుకానున్నారు.
నియామకాల అక్రమాలపై స్పందించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ:
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ ఆఫీసర్ల నియామకాల్లో జరిగిన అక్రమలపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. పీహెచ్‌సీలో డెంటల్ వైద్యులు.. మెడికల్ ఆఫీసర్స్‌గా పనిచేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గ్రూప్- 1 అధికారి ప్రేమ్‌కుమార్‌కి విచారణ బాధ్యతలు అప్పగించారు. పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న దంత వైద్యులను పిలిచి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న దంత వైద్యులు ఎప్పుడు విధుల్లో చేరారు?, వారి నియామకాలు ఎలా జరిగాయి అనే అంశాలను ప్రేమ్ కుమార్ సేకరిస్తు్న్నారు. వారు ఉద్యోగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో చేరారా?, ఎవరు రిక్రూట్ చేసుకున్నారు. ఏ ప్రాతిపాదికన బీడీఎస్ చేసిన వారిని మెడికల్ ఆఫీసర్లుగా నియామకం జరిగింది?. వీరిలో ఎవరెవరూ పర్మినెంట్ అయ్యారు. నియామక సమయంలో వారి విద్యార్హతలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇలాంటి పలు అంశాల పైన ప్రేమ్ కుమార్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ప్రేమ్ కుమార్ సమర్పించనున్నారు.
పక్కింటి కోళ్లు ఇంట్లోకి వచ్చాయని ఓ వ్యక్తి రెండు కాళ్లు నరికివేత:
మహబూబాబాద్ జిల్లాలో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. పక్కింటి కోళ్లు.. ఇంట్లోకి వచ్చాయంటూ ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. ఏకంగా ఓ వృద్ధుడి రెండు కాళ్లను గొడ్డలితో నరికేశాడు. దీంతో బాధితుడు తీవ్ర రక్తస్రావంతో విలవిలాడిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సిరోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూధనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండ సోమయ్య (60) అనే వృద్ధుడు సూధనపల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతడు నాటుకోళ్లు పెంచుకుంటున్నాడు. అయితే కోళ్లు మేత కోసం రోడ్లపై తిరుగుతున్నాయి. తరచుగా కోళ్లు ఇంట్లోకి వస్తున్నాయని పక్కనే ఉన్న మేకల లింగన్న ఇంటి వారు గొడవ పెట్టుకున్నారు. ఈ విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. పదే పదే కోళ్లు ఇంట్లోకి రావడంతో మళ్లీ ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన లింగన్న… సోమయ్యకు చెందిన పిల్లల కోడిని చంపి.. గొడ్డలితో అతడి రెండు కాళ్లు నరికేశాడు. ఒక కాలు పూర్తిగా తెగిపోగా.. మరో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేకల లింగన్నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు:
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేటి నుంచి మొదలుకానున్నాయి. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.
మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ:
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని డీకే తెలిపారు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు.. ప్రోటోకాల్ ప్రకారం అతడ్ని నేను రిసీవ్ చేసుకోవాల్సి ఉందన్నారు. అందుకే ఖర్గేను కలిశాను.. బెంగళూరులో పార్టీ కొత్త ఆఫీసు శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం.. ఈ సందర్భంగా ఆయనతో చాలా విషయాలపై చర్చించాను అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ చెప్పుకొచ్చారు.
యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత మహిళకు ఉరిశిక్ష అమలైంది. చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్‌ను ఉరితీసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణపై అబుదాబిలో మరణ శిక్షను ఎదుర్కొన్నది. యుఎఇ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15, 2025న షహజాదీ ఖాన్‌ను ఉరితీశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు. కూతురు కోసం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. షహజాది ఖాన్ ఉరిశిక్ష గురించి ఫిబ్రవరి 28న యుఎఇలోని భారత రాయబార కార్యాలయానికి అధికారిక సమాచారం అందిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) చేతన్ శర్మ తెలిపారు.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ:
భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆస్ట్రేలియాపై సిక్స్‌తో ఐసీసీ వన్డే టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక సిక్సర్‌లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ 48 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ (45), డేవిడ్ వార్నర్ (42), సౌరవ్ గంగూలీ (42)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కళ్యాణ్ రామ్.. ‘సన్నాఫ్ వైజయంతి’:
నందమూరి కళ్యాణ్ రామ్ 2023 లో ఆయన చివరి సినిమా డెవిల్ మంచి పేరు తీసుకు వచ్చింది కానీ కమర్షియల్ గా మెప్పించలేదు. గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించింది. అలాగే ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు. అయితే ఆ రెండు కాకుండా ఈ సినిమాకు లేటెస్ట్ గా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. వైజయంతిపవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతుంది. చిత్ర కథ నేపధ్యానికి అనుగుణంగా ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే అధికారంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
కల్పన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం:
తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీ లో నివాసముంటున్న కల్పన, గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, సెక్యూరిటీ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసోసియేషన్ సభ్యులు ఆమె ఫోన్‌కు కాల్ చేయగా, ఎలాంటి రెస్పాన్స్ లభించలేదు. దీంతో వారు కల్పన భర్తకు ఈ విషయాన్ని ఫోన్ చేసి వివరించగా, ఆయన ఫోన్‌కు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా కల్పన స్పృహ తప్పి బెడ్ పై పడుకుని ఉంది. వారు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం నిజాంపేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్, ఎం ఐసీయూలో వెంటిలేటర్ పై కల్పన కు చికిత్స జరుగుతుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సీక్రెట్‌గా ఉంచుతుంది హాస్పిటల్ సిబ్బంది. ఎందుకంటే ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక రోజు తీసుకునే మెడిసిన్ డోస్ పెరిగిందా? అనేది క్లారిటీగా తెలియదు. కల్పన ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె నోరు విప్పితే కానీ అసలు విషయం బయటపడుతుంది. అందిన సమాచారం ప్రకారం కల్పన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం ఇందుకు కారణం అని తెలిసింది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన హీరోయిన్:
కన్నడ నటి రాన్యా రావు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయింది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ కింద గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది సదరు రాన్యా రావు. రోజుకి ఎంతో మంది ఎయిర్పోర్ట్స్ లోడ్రగ్స్, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికి కటకటాల వెనక ఊసలు లెక్కేన్నారు. తాను హీరోయిన్ కదా చెకింగ్స్ ఏమి ఉండవ్ అనుకుందో ఏమో ఏకంగా 15 కేజీల బంగారం అయి ఉండి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసారు పోలీసులు. చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్నిబట్టబయలు చేసారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI). వివరాల్లోకెళితే రాన్యా రావు 15 రోజుల్లో 4 సార్లు బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్ళొచ్చింది. ఇక్కడే డిఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏంటంటే దుబాయ్ నుండి వచ్చిన ప్రతిసారి చెకింగ్ కూడా లేకుండా పోలీసులు ఈమెను ఎయిర్పోర్ట్ దాటించేవారు, చెకింగ్స్ లేవా అంటే ఉన్నాయ్ కానీ అవి ఆమెకు ఉండవ్. ఎందుకంటే ఆమె స్వయానా డీజీపీ కూతరు. దాన్నీ అలుసుగా తీసుకుని గోల్డ్ స్మగ్లింగ్ కు తెరలేపింది రాన్యా రావు. పక్కా సమాచారంతో నటి రాన్యా రావుపై నిఘా పెట్టిన డిఆర్ఐ అధికారులు ఈ దఫా బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో దిగగానే అదుపులోకి తీసుకుని చెక్ చేయగా రూ. 12.56 కోట్లు విలువైన 15 కేజీల బంగారం, రూ. 4.73 కోట్ల విలువైన నగలు, కరెన్సీ దొరకడంతో ఖంగుతిన్నారు సదరు అధికారులు. అన్నిటిని సీజ్ చేసి ఆమెని అరెస్ట్ చేసారు. ఏదేమైనా ఇన్ని రోజులు పోలీసులను భలే బురిడీ కొట్టించి బాగా నటించింది కదా మహానటి అంటి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.