ఏపీలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇదే మొదటిసారి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31తో పదవీవిరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా విజయానంద్ బాధ్యతలు చేపడతారు. బీసీ అధికారి విజయానంద్‌కు సీఎస్‌గా అవకాశం ఇవ్వడంతో టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
రియల్ టైం గవర్నెన్స్‌పై సీఎం సమీక్ష:
అమరావతిలో ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం కోసం ఉదయం 11 గంటలకు సీఎం సచివాలయంకు చేరుకుంటారు. మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ రాజ్ అధికారులు, ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం కానున్నారు. ఇటీవల ఎంపీడీఓపై జరిగిన దాడి నేపథ్యంలో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వరిస్తున్నారు.
రంగారెడ్డిలో దారుణం:
రంగారెడ్డి జిల్లా అర్థరాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్వేల్‌లో ఓ వ్యక్తి హత్య సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా బద్వేల్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గుత్తేదారు సాయికి రూ.500 అప్పుగా ఇచ్చాడు. నిన్న ఇద్దరూ కలిసి ఫుల్ గా మద్యం సేవించారు. సరదాగా మాట్లాడుకుంటూ అప్పుల వరకు మాటలు వెళ్లాయి. సాయికి అప్పు ఇచ్చానని తిరిగి ఇచ్చేయాలని శ్రీనివాస్ తెలిపాడు. దీంతో సాయి తన దగ్గర లేవని మళ్లీ ఇస్తానంటూ వాదించాడు. అనంతరం రూ.500 కోసం ఇద్దరు మధ్య పెద్ద గొడవే అయ్యింది. శ్రీనివాస్, సాయి ఒకరినొకరు వాదించుకున్నారు. ఇప్పుడే తన డబ్బులు ఇచ్చేయాలని శ్రీనివాస్ పట్టుపడటంతో.. సాయి ఆగ్రహంతో రగిలిపోయాడు. తన పక్కనే వున్న డ్రైనేజ్ మూత తీసుకుని శ్రీనివాస్ తలపై ఒక్కసారిగా కొట్టాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం:
నేడు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తూ ప్రసంగిస్తారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మన్మోహన్‌సింగ్ సేవల గురించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. కాగా, సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఆదివారం పరిశీలించారు. సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సిబ్బందిని స్పీకర్ ఆదేశించారు.
భారీగా కురుస్తున్న మంచు:
జమ్మూ కశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తుంది. దీని ప్రభావం జనవరి 2 వరకు ఉంటుందని, కొన్ని కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే, జనవరి 3, 6 తేదీల మధ్య కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ హిమపాతం కురిసే ఛాన్స్ ఉందన్నారు. దీంతో జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాలపై ప్రభావితం చూపిస్తుంది. కాగా, ఆదివారం నాడు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురిసింది. ఆ క్రమంలో హిమపాతం తొలగింపుతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే, నిలిచిన వాహనాలను గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. బనిహాల్, ఖాజిగుండ్ మధ్య రోడ్లు జారడంతో డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఖతార్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి:
భారత విదేశాంగ శాఖ మంత్రి S. జైశంకర్ నేటి నుంచి మూడు రోజుల పాటు ఖతార్ లో పర్యటించడానికి వెళ్తున్నారు. ఇక, తన పర్యటనలో ఖతార్ ప్రధాన మంత్రితో పాటు విదేశాంగ మంత్రి, హెచ్ఈ షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాజకీయ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, సాంస్కృతిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో సహా రెండు దేశాల ప్రజలకు పరస్పర ప్రయోజనాలపై సమీక్షిస్తారు.
డిసెంబర్ నెలలో 6 విమాన ప్రమాదాలు:
డిసెంబర్ 2024 విమాన ప్రయాణీకులకు ‘బ్లాక్ నెల’గా మారింది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 6 విమాన ప్రమాదాలు జరిగాయి. 233 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయానకంగా మారాయి. ఈ ప్రమాదాలు విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలోని . ముయాన్ విమానాశ్రయంలో ఆదివారం విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది. అక్కడే ఉన్న గోడకు ఢీకొనగా.. విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మరణించారు. వీరిలో 83 మంది మహిళలు, 82 మంది పురుషులు ఉన్నారు. అయితే మరో 11 మందిని ఇంకా గుర్తించలేదు. విమానంలో మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న 15 ఏళ్ల నాటి బోయింగ్ 737-800 జెట్ విమానం ప్రమాదానికి గురైనట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:03 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
33 పరుగులకే ముగ్గురు కీలక ప్లేయర్స్ ఔట్:
మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి భారత్ రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (5) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, 17వ ఓవర్లలో పాట్ కమిన్స్ ఓవర్ తొలి బంతిని రోహిత్ శర్మను.. అదే ఓవర్లలోని చివరి బంతికి కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
డిజాస్టర్ దిశగా ‘బేబీ జాన్’:
బేబీ జాన్’ డిసెంబర్ 25న రిలీజ్ కాగా తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా బేబీ జాన్ మొదటి రోజు కేవలం రూ. 12 కోట్లు వసూలు చేయగా రెండోవ రోజు రూ. 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక రిలీజ్ అయిన మొదటి రోజులకు గాను కేవలం రూ. 25 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ రూ. 80 కోట్లకు పైగా చేసుకుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఇంకా రూ. 55 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు లేవని ట్రేడ్ అంచనా వేస్తుంది.
క్లైమాక్స్ చిత్రీకరణలో ‘ఘాటీ’:
ఘాటీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్ రెడీ స్టార్ట్ అయింది. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు డైరెక్టర్ క్రిష్. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయిన తర్వాత అనుష్క తన పాత్రకు డబ్బింగ్ ను కూడా పూర్తి చేయనున్నారట. ఈ క్లైమాక్స్ షూట్ ను జనవరి చివరలో తీసే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు ఘాటీ సినిమాలో మాత్రమే అనుష్క నటిస్తోంది. ఇక ఈ చిత్రం థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ లోకి రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మేకర్స్ రూపొందించారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.