పాలకొండకు వైఎస్ జగన్:
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైసీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకోనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగుళూరుకు వెళ్లనున్నారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (81) అనారోగ్యంతో కన్నుమూశారు. రాజశేఖరం మృతి విషయాన్ని విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్, కుమార్తె శాంతిని జగన్ ఫోన్‌లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల అంశంపై చర్చ జరగనుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయం కోరనున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో మిర్చి రైతుల సమస్యలపై చర్చ జరగనుంది. ఇటీవల మిర్చి ధర భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. సీఎం కేంద్రం సాయం కోరనున్నట్లు తెలుస్తోంది.
నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం:
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నేడు మధ్యాహ్నం జరగనుంది. మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మొత్తం 15 కీలక అంశాలపై చర్చించనున్నారు. నగర అభివృద్ధి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణం పనుల కోసం భూసేకరణకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. హెచ్ సిటీ ప్రాజెక్టుల భూసేకరణ సంబంధించి ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూములను సేకరించేందుకు అనుమతిని ఇవ్వనుంది. మిధాని బస్ స్టాండ్, బస్ డిపో నిర్మాణం కోసం 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి NOC జారీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆటో కోసం స్నేహితుడి హత్య:
నిజామాబాద్‌లో ఓ యువకుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చిన ఘోరం వెలుగుచూసింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్ బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఈనెల 15న మిస్సింగ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. దానితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇందల్వాయి అటవీ ప్రాంతంలో సందీప్ హత్యకు గురై మృతదేహం కాలిపోయిన స్థితిలో కనబడింది.
రేఖా గుప్తాతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసేది వీళ్లే:
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈ రోజు (ఫిబ్రవరి 20) రేఖ గుప్తా రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా, ఆమెతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో, పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సిర్సా, పంకజ్ సింగ్, కపిల్ మిశ్రా, రవీంద్ర ఇంద్రజ్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి జాబితాలో ఉన్నట్లు సమాచారం. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం పోటీ చేసి మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మ పేరు మొదటి నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉంది. కానీ, అనుహ్యంగా బీజేపీ అధిష్టానం రేఖా గుప్తాను సీఎంగా ఎంపిక చేయడంతో పర్వేష్ వర్మకు కేబినెట్ లో చోటు కల్పించింది.
నేడే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం:
భారతీయ జనతా పార్టీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు కట్టబెట్టింది. అయితే, హస్తినాలో 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ కూడా మహిళ సీఎం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. శాలీమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29, 595 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవి శంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్‌ల సమక్షంలో సమావేశమైన 48 మంది కమలం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా రేఖా గుప్తా ( ఓబీసీ నేత)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు.
ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ ఓ నియంత:
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఓ నియంత.. అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డాడు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే కీవ్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తెచ్చారని విమర్శించాడు. ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. యుద్ధానికి ఉక్రెయినే ప్రధాన కారణం, అది మొదలు కావడానికి ముందే ఒప్పందం చేసుకుంటే సరిపోయేదన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి.. జెలెన్‌స్కీ అమెరికాతో మాట్లాడి 35,000 కోట్ల డాలర్లను యుద్ధంపై ఖర్చు పెట్టించాడు.. అది మాస్కోపై ఎప్పటికీ గెలవలేదు.. నేను లేకుండా ఆ యుద్ధాన్ని ఎవరు కొలిక్కి తీసుకురాలేరని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
నేడే బంగ్లాతో టీమిండియా తొలి సమరం:
ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ దుబాయ్ వేదికగా తలపడబోతుంది. ఇక, తమ తొలి మ్యాచ్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ఇరు జట్ల బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన బంగ్లా కంటే ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే, ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని సృష్టిస్తుంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ రంగంలోకి దిగుతుండగా… బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. భారత్ తుది జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతుందని సమాచారం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన లాస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఎదురు చూస్తున్నాడు. ఫాంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా ఆడితే టీమిండియాకు తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో కేఎల్ రాహుల్ స్థానం పలుమార్లు మార్చారు. కానీ, ఈ సారి మాత్రం అతనికి ఐదో స్థానంలోనే ఆడించే ఛాన్స్ ఉంది. హర్థిక్ పాండ్యా, జడ్డూ, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం టీమ్ కు అదనపు బలగా చెప్పొచ్చు. మరోవైపు, బౌలింగ్ లో కుల్దీప్ చాలా రోజులుగా మంచి ఆటతీరు కనబరుస్తుంగా.. ఫేస్ విభాగంలో షమీ, అర్ష్ దీప్ ఉన్నారు.
మరోమారు గెలుపుబాట పట్టిన ఢిల్లీ:
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా ఛేదించే జట్లు విజయాన్ని అందుకుంటున్న తరహాను కొనసాగిస్తూ, యూపీ వారియర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వడోదరా వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అనాబెల్ సదర్లాండ్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ జట్టు ఓపెనర్ కిరణ్ నవగిరె మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేసింది. శ్వేత సెహ్రావత్ (37 పరుగులు; 4 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ (15 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 2 వికెట్లు పడగొట్టింది. ఇక ఆ తర్వాత 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ (49 బంతుల్లో 69; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అనాబెల్ సదర్లాండ్ 41 నాటౌట్ తో అదరగొట్టింది. మరిజాన్ కాప్ 29 నాటౌట్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.
అలాంటి పాత్రలు చేయాలని ఉంది:
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన్న రీతూ వర్మ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. రీతూ మాట్లాడుతూ.. ‘ నేను నటి కావాలని ఎప్పుడు అనుకోలేదు. అలాంటిది నేనిక్కడికి దాకా వచ్చి.. ఇన్నేళ్లుగా కొనసాగుతున్న అంటే నమ్మలేకపోతున్న. నా సినీ ప్రయాణం పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నటిగా చాలా మంచి సినిమాల్లో భాగమయ్యా. ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. కానీ నాకు యాక్షన్ ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని ఉంది. కామెడీ చేయడం కూడా నాకు చాలా ఇష్టం. ‘మజాకా’ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. రైటర్ ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. అది విన్నంత సేపు నేను నవ్వుతూనే ఉన్నా. అలాగే ఇందులో బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. నా పాత్రకు ఈ కథలో ఎంతో ప్రాధాన్యముంది. అందుకే స్క్రిప్ట్ వినగానే చేయాలని నిర్ణయించుకున్నాను.ముందు నుంచి పూర్తి స్థాయి పీరియాడిక్ సినిమా చేయాలని ఉంది. ప్రస్తుతం నేను తెలుగులో ఓ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఓకే చెప్పా. అలాగే ‘శ్రీకారం’ కిశోర్ దర్శకత్వంలో ఓ వెబ్సెరీస్ కూడా చేశా. అది త్వరలో విడుదల కానుంది’ అంటూ తెలిపింది రీతూ. మొత్తానికి ఈ ఏడాది బీజి హీరోయిన్ గా మారిపోయింది.
షూట్ లో జాయిన్ అయిన మరో తార:
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లిట్ టాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. అదే జోష్ తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్ డే కానుకగా పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాను ప్రకటించాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయింది. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అయితే ఈ చిత్రంలో మరోక హీరోయిన్ కూడా నటిస్తోంది. చి.ల.సౌ సినిమాలో కథానాయకిగా నటించిన రుహాణి శర్మ ఇప్పుడు ఆకాశంలో ఒక తారలో నటిస్తోంది. ఈ బుధవారం సెట్స్ లో అడుగుపెట్టింది రుహాణి శర్మ. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్నఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ వరుసగా నాలుగవ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.