కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది:
గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
జత్వానీ కేసులో ట్విస్ట్:
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, పోలీసులు, న్యాయవాది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అఫిడవిట్‌లో సీఐడీ పేర్కొంది. అయితే, జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేశారని అఫిడవిట్ లో పేర్కొంది సీఐడీ. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలు మేరకు ఇదంతా జరిగింది తెలిపింది సీఐడీ. ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిన వెంటనే అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా ముంబైకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేశారని అఫిడివిట్ లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు. వీళ్లకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తు పక్కదారి పట్టే అవకాశం ఉందన్న అఫిడవిట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఏడుగురు మావోయిస్టులు హతం:
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటన స్థలంలో రెండు ఏకే-47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చర్లపల్లిలో చిన్నారి మృతి:
కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్‌లో జరిగింది. ఘట్కేసర్ మండలం మేడిపల్లికి చెందిన బంటు రమేష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం చర్లపల్లిలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు ఆయన, భార్య, కూతురు ఆధ్యతో కలిసి హాజరు అయ్యారు. సాయంత్రం చిన్నారి ఆద్య ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వేడుకలకు వచ్చిన ఓ బంధువు రివర్స్ చేస్తుండగా కారు ఢీ కొట్టడంతో చిన్నారికి గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఈసీఐఎల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు:
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు. ఈ క్రమంలో.. ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే వారిని పట్టుకుని విచారించారు. విచారణలో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులని తేలింది. వారి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. వీరు ఏదైనా నేరం చేయబోతున్నారా అనే విషయంపై విచారణలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిరాశలో సన్నిలియోన్ ఫాన్స్:
టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న సన్ని లియోన్ ను చూసేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. హైదరాబాదులో ఉన్న పబ్లో సన్నీ స్పెషల్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈవెంట్ కి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమెను చూసి వెళదామని వచ్చిన అభిమానులు అందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఇల్యూషన్ పబ్ కి వచ్చారు. అయితే పబ్ బయట పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. అనుమతి లేదని చెప్పి అక్కడికి వచ్చిన అభిమానులను తిరిగి వెనక్కి పంపారు.
తంతె బూరెల బుట్టలో పడ్డ డైరెక్టర్:
డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి బ్లాక్ బస్టర్ ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’లో పనిచేసిన అజయ్ దేవగన్ మరో హిస్టారికల్ సినిమాచేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. కొత్త సినిమాలో హీరోగా అజయ్ దేవగన్ నటిస్తే, హృతిక్‌ను విలన్‌గా నటింపజేయాలని చూస్తున్నారట. ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది. కథాంశం ఇంకా ఫైనల్ కాలేదు. ఓం రౌత్ ఈ సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. హృతిక్‌కి ఉన్న అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, చరిష్మా సినిమాకు కలిసొస్తుందని అజయ్ భావిస్తున్నాడట.
ఆస్ట్రేలియాకు దెబ్బేసిన దక్షిణాఫ్రికా:
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అద్భుతాలు చేసిందనే చెప్పాలి. ఏకంగా రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఇప్పుడు ఆస్ట్రేలియాతో పాటు టీమిండియాకు పోటీ ఇస్తోంది. దక్షిణాఫ్రికా 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో 64 పాయింట్లతో ఉంది. 59.26 పర్సంటేజ్ తో రెండవ స్థానంలో ఉంది. 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 ఓటములతో 90 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది.