నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు:
నేడు దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30కు విజయవాడ నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 6.30కి సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుమారుడి రిసెప్షన్‌కు హాజరవుతారు. ఈరోజు రాత్రికి ఇద్దరు ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని సీఎం ఆహ్వానించనున్నారు. రాజధాని నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం రాత్రి తిరిగి సీఎం, డిప్యూటీ సీఎం అమరావతి చేరుకోనున్నారు.
శ్రీవారి భక్తులకు అలర్ట్:
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. లక్కీడిప్ ద్వారా టికెట్లను పొందిన భక్తులు మార్చి 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బు చెల్లించి టికెట్లు తీసుకోవచ్చు.
25వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్:
ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. రెస్క్యూకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టన్నెల్ లో రోబోలతో తవ్వకాలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), SDRF, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్‌కు బురద, నీటి ఊట, టిబియం అవశేషాలు ఆటంకంగా మారాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టిబియం మిషన్ కటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమ వాళ్ల ఆచూకి ఇంకా లభించకపోవడంతో బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు.
షేక్‌పేట్ డైమండ్ హిల్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ:
ఇటీవల దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఇళ్లలోకి చొరబడి భారీగా దోచుకెళ్తున్నారు. మాటలతో మభ్యపెట్టి మెడలో బంగారు గొలుసులను కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ఫిలీం నగర్ లో భారీ చోరికి పాల్పడ్డారు. ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ డైమండ్ హిల్స్ లో ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షల నగదు, 550 కేనేడియన్ డాలర్స్ అపహరణకు గురయ్యాయి. చోరీ జరిగిన ఇంటిని మొజాహిత్ అనే వ్యక్తికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. మొజాహిత్ కుటుంబం రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. గత కొన్ని రోజుల క్రిందటనే మొజాహిత్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. చోరీకి పాల్పడడమే కాకుండా.. సీసీ కెమెరాల్లో తమ వీడియోస్ కనిపించకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. మోజాహిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడు:
టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సినిమా షూటింగ్ నుండి రాజకీయ చేస్తారా.. నాటకాలు ఎవరు ఆడుతున్నారని అన్నామలై ప్రశ్నించారు. విజయ్‌కు 50 ఏళ్ళు వచ్చాక రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా..? అని అడిగారు. 30 ఏళ్ళ వయసులో విజయ్ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడన్నారు.
మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్:
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తులసి గబ్బర్డ్ పేర్కొన్నారు.
సుదీక్ష మిస్సింగ్‌లో కీలక ట్విస్:
భారత సంతతి విద్యార్థిని కోనంకి సుదీక్ష చౌదరి (20) మిస్సింగ్ మిస్టరీగా మారింది. అమెరికాలోని వర్జీనియా నివాసి అయిన సుదీక్ష.. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. మార్చి 6న బీచ్‌లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా మాయం అయింది. అయితే ఈ విషయాన్ని స్నేహితులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డ్రోన్లు, హెలికాప్టర్లు, పడవలతో జల్లెడ పట్టారు. కానీ నేటికి ఆమె అడ్రస్ దొరకలేదు. దీంతో రియు రిపబ్లికా రిసార్ట్‌లో ఉన్న వీడియోలను పరిశీలించగా.. ఆమె రిసార్ట్ నుంచి ఒక యువకుడు జాషువా రీబేతో బయటకు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని చెప్పుకొచ్చాడు. బీచ్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని.. అయితే ఒక అల రావడంతో పడిపోయామని.. తాను బయటకు వచ్చేశాను.. ఆమె కూడా వచ్చేసిందని పేర్కొ్న్నాడు. అనంతరం ఆమె నీళ్లు మింగడంతో వాంతు చేసుకున్నట్లు జాషువా రీబే చెప్పాడు. అనంతరం బీచ్ ఒడ్డున నిద్రపోయినట్లు తెలిపాడు. అనంతరం ఆమె ఏమైందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో అతడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేయకుండా అబ్జర్వేషన్‌లో ఉంచారు.
గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు:
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 121 మంది చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమ్మ కాదు అంటే ఈ సినిమా చేసేవాడిని కాదు:
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు.తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్నీ AAA లో గ్రాండ్ గా నిర్వచించారు. ఈ ఈవెంట్ లో హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘ ఈవెంట్ కు విచ్చేసిన నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. కర్తవ్యం సినిమాలో అమ్మ చేసిన ఫైట్స్, ఎమోషన్స్ మనకి బాగా గుర్తుంటాయి. వైజయంతి పాత్రకి కొడుకు ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అదే ఈ సినిమా అని దర్శకుడు ప్రదీప్ చెప్పాడు. అయితే అమ్మ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేస్తానని చెప్పా. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఈ వయసులో కూడా ఎలాంటి డూప్ సహాయం లేకుండా ఫైట్స్ చేయడం మాములు విషయం కాదు నిజంగా అద్భుతం. యాక్టర్ పృద్వికి యానిమల్ ఎంత పేరు తెచ్చిందో మా సినిమా కూడా అంత పేరు తెస్తుంది. అమ్మ తన బిడ్డకి జన్మనిచ్చేందుకు ప్రాణాన్ని పణంగా పెడుతుంది. అలాంటి తల్లిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు అదే ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. బలమైన భావోద్వేగాలున్న కథ ఇది. అమ్మ విజయశాంతితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభవం. ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది ఈ నిర్మాతలు నా సొంత వాళ్ళు’ అని అన్నారు.
మహదేవ శాస్త్రి గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?:
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ఆయన ‘మహదేవ శాస్త్రి’ అనే పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా. సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ నుండి ‘మహదేవ శాస్త్రి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
శార్దూల్ ఠాకూర్‌కు గోల్డెన్ ఛాన్స్:
నవంబరులో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే.. ఇప్పుడు శార్దూల్‌కు ఐపీఎల్ 2025లో ఆడే అవకాశం లభించనుంది. దేశీయ క్రికెట్‌లో బ్యాట్, బంతితో బాగా రాణిస్తున్న శార్దూల్.. ఐపీఎల్‌లో తన ప్రతిభను చూపించే అవకాశం రానుంది. అయితే.. ఈ సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గాయాలతో సతమతమవుతోంది. జట్టులోని ముగ్గురు పేసర్లు గాయపడటంతో శార్దూల్ ఠాకూర్‌కు LSGలో అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ వంటి ప్రధాన పేసర్లు గాయపడ్డారు. దీంతో.. శార్దూల్‌కు జట్టు తరుఫున ఆడే అవకాశం లభించనుంది. ఈ నేపథ్యంలో శార్దూల్ ఇటీవల LSG శిక్షణా శిబిరంలో కనిపించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. అతను LSG ప్రాక్టీస్ జెర్సీని ధరించి శిక్షణ తీసుకుంటున్నట్లు రిపోర్టులు ఉన్నాయి.