టీటీడీ ఈవో బంగ్లాలో దూరిన నాగుపాము:
తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో గురువారం రాత్రి ఓ భారీ నాగుపాము దూరింది. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా.. రవీందర్ నాయుడు చేతిపై కాటు వేసింది. సిబ్బంది అతడిని హుటాహుటిన స్విమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉంది.
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు:
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భూమనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద భూమనపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖ మేయర్ అవిశ్వాసానికి 24 గంటల సమయం:
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు. ఇక, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భీమిలి శిబిరానికి తెలుగు దేశం పార్టీ తరలించనుంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. GVMC పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు GVMC పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు. జీవీఎంసీ ఆఫీసు పరిధిలో సుమారు 300 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది.
నేడు టోక్యోలో బిజీబిజీగా గడపనున్న సీఎం:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 18 (శుక్రవారం)న టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమై, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టోక్యో పర్యటనను గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తూ ప్రారంభించనున్నారు. అనంతరం టోక్యో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకోనున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడంలో కీలకంగా మారనుంది. తర్వాత, భారత ఎంబసీ ఆధ్వర్యంలో జరగనున్న పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఇందులో టయోటా, తోసిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించనున్నారు.
ములుగు జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుని ప్రారంభించనున్న మంత్రులు:
ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం మంత్రులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాన్ని సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 08:30 గంటలకు మంత్రులు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 09:15 గంటలకు ములుగు జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద హెలిపాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మంత్రులు వెంకటాపూర్ మండలంలోని పివిసి కన్వెన్షన్ హాల్ కు చేరుకొని, 10:00 గంటలకు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ వేడుకలకు మోడీకి ఆహ్వానం:
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ హాజరవుతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
ట్రంప్‌తో మెలోనీ భేటీ:
ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి. అనంతరం 90 రోజుల పాటు సుంకాలను ట్రంప్ వాయిదా వేశారు. అయితే సుంకాలపై ట్రంప్-మెలోనీ మధ్య కీలక చర్చలు జరిగాయి. అయితే సుంకాలపై సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఓవల్ ఆఫీసులో ట్రంప్-మెలోనీ పేర్కొన్నారు. ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. డీల్ విషయంలో తొందరపడడం లేదని తెలిపారు. ఇక పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని.. అందుకోసం కలిసి పని చేస్తామని మెలోనీ చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్‌తో సుంకాల ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను డోనాల్డ్ ట్రంప్-జార్జియా మెలోని చర్చించారని వైట్‌హౌస్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు వెల్లడించింది. సుంకాలు తగ్గించేందుకు యూరోపియన్ దేశం ముందుకొచ్చింది. ఇక ఇద్దరి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. ఇద్దరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడటం కనిపించింది. ఈ సందర్భంగా మెలోనీ తీరును ట్రంప్ ప్రశంసించారు. అద్భుతం అంటూ ఆమెను ట్రంప్ కొనియాడారు.
మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం:
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. మెలోనిలో చాలా ప్రతిభ ఉంది, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఆమె ఒకరంటూ అతడు కొనియాడారు. ఇక, టారిఫ్స్ పెంపుపై అమెరికా వైఖరిని జార్జియా మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ ని కలిసిన తొలి ప్రధాన మంత్రి ఆవిడే.
ఏప్రిల్ 25న లాంచ్ కానున్న రియల్‌మీ 14T 5G:
రియల్‌మీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను ఏప్రిల్ 25న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ 14 సిరీస్ లో భాగంగా విడుదలవుతుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ పలు విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. లాంచ్ 14T 5G ఫోన్ ప్రధాన ఆకర్షణగాv 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే నిలుస్తుంది. ఇది గరిష్ఠంగా 2100 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అలాగే 111% DCI-P3 కలర్ గామట్ ను సపోర్ట్ చేయడం ద్వారా అత్యుత్తమ విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. దీనికి TUV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించిందని సంస్థ తెలిపింది. ఇది తక్కువ బ్లూ లైట్ విడుదలతో కంటికి మేలు చేస్తుందని తెలిపింది.
సన్‌రైజర్స్‌పై ముంబై విజయం:
సొంతగడ్డపై బంతితో, బ్యాటుతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్ రేసులో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపుగా కష్టమే.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓవర్శీస్ రివ్యూ:
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఎలా ఉందొ చూద్దాం. ఆసక్తికరమైన తల్లి-కొడుకుల సెటప్‌తో ప్రారంభమయి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అనుకునేలోపే ఒక రొటీన్ రెగ్యూలర్ టెంప్లేట్ కమర్షియల్ చిత్రంగా మారుతుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. కానీ ఊహించదగిన స్క్రీన్‌ప్లే సినిమా ఫ్లోని అడ్డుకుంటుంది. ఓన్లీ క్లైమాక్స్ నే నమ్ముకున్న దర్శకుడు మిగిలిన సినిమా మొత్తాన్ని రొటీన్ గా తెరకెక్కించాడు. చివరి 20 నిముషాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. అందుకు ఒప్పుకున్నందుకు నందమూరి కల్యాణ రామ్ ను అభినందించాలి. సంగీతంతో పాటు నేపధ్య సంగీతం ఇంకాస్త బాగుంటే బాగుండేది. చాలా సినిమాల్లో మనం చూసిన రొటీన్ ట్రీట్‌మెంట్ తో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించింది. కథ, స్క్రీన్ ప్లే పై ఇంకాస్త వర్క్ చేసి డైరెక్షన్ కొత్తగా చేసి ఉంటే సూపర్ హిట్ గా నిలిచేది.
ఎంపురాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది:
మార్చి 27న ఎంపురాన్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలయి పలు వివాదాలకు కారణమయింది. దాంతో వివాదానికి కారణమయిన సీన్స్ తొలగించి ప్రదర్శించారు. కానీ కేరళలో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులని బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఎంపురాన్. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ నెల 24న హాట్ స్టార్ ఓ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. థియేటర్స్ లో కేవలం 28 రోజుల రన్ మాత్రమే నడిచిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఓటీటీలో ఇటుంవటి హంగామా చేస్తుందో చూడాలి.