శ్రీవారి భక్తుల అలర్ట్:
శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేస్తుంది. వర్చువల్ సేవా టికెట్స్ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
నేడు ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము:
మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజుజరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్‌లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందిస్తారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎయిమ్స్‌ను మంజూరు చేయగా.. ఎయిమ్స్ ప్రాంగణంలో 2020 నుంచి 125 సీట్లకు పర్మిషన్ పొంది ఆ మేరకు విద్యా బోధన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, నారా లోకేశ్ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో విషాదం:
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఇవాళ మరో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది. హయత్ నగర్ పరిధిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. లోహిత్ అనే విద్యార్థి హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుకుంటున్నారు. అక్కడే హాస్టల్లో వుండి చదువు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే సోమవారం రాత్రి హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్ వెళ్లి లోహిత్ వున్న గది తలుపులు కొట్టిన ఎంతకూ తీయక పోవడంతో పాఠశాల సిబ్బందికి తెలిపారు. దీంతో లోహిత్ గది వద్దకు వచ్చిన సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా లోహిత్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది లోహిత్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మళ్లీ ములుగులోకి ప్రవేశించిన పెద్దపులి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించ పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగు పెద్దపులి అడుగు జాడలు గుర్తించారు. చౌలేడు, కేశవపురం గ్రామల వైపు పెద్దపులి వెళ్ళి వుంటుందని ఎఫ్అర్ఓ సత్తయ్య తెలిపారు. వారం రోజులుగా మంగపేట,తాడ్వాయి, కరకగుడేం,గుండాల అడవుల్లో పెద్దపులి మకాం వేసినట్లు గుర్తించారు. అడవి ఉత్పత్తుల సేకరణ, పశువుల మేత కోసం గ్రామస్తులు అడవులకు వెల్లకుండా ఫారెస్ట్ అధికారులు నియంత్రిస్తున్నారు. పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. పెద్ద పులికి ఆపద రాకుండా చూసుకోవాలని అటవీ గ్రామస్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ పెద్దపులి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి, ఇటు ములుగు జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు.
నేడు లోక్‌సభకు ‘జమిలి ఎన్నికల’ బిల్లు:
వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి. సభలోకి వెళ్లే ముందే జమిలి ఎన్నికల బిల్లుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇక, సభలోకి రెండు బిల్లులు రానున్నాయి. అందులో ఒకటి జమిలి ఎన్నికల 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024 కాగా.. మరోకటి, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం నేడు లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది.
జార్జియాలో తీవ్ర విషాదం:
జార్జియాలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్‌గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని రెస్టరెంట్‌లో 12 మంది అనుమానాస్పదంగా మరణించారు. అందులో 11 మంది ఇండియన్స్ ఉన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు నిర్ధారించారు. అయితే, గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో వారంతా అక్కడ సిబ్బందిగా కొనసాగుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి ఇండియన్ ఎంబసీ కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మరణించినట్లు మా దృష్టికి వచ్చిందని పేర్కొనింది. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం.. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మరణించిన వారి ఫ్యామిలీస్ తో మాట్లాడుతున్నాం.. వారికి సాధ్యమైనంతగా సహాయం చేసేందుకు ట్రై చేస్తున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.
రోహిత్ ఆడటం నాకు ఇష్టం లేదు:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడడం తనకు ఇష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. రోహిత్ తన సోదరుడు అని.. అతను గొప్ప శక్తి, సంకల్పంతో ఆడాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్ ఆడని రోహిత్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన హిట్‌మ్యాన్.. ఆరో స్థానంలో రాణించడం లేదు. నిజానికి అతడు ఆరో స్థానంలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు.
అవన్నీ నకిలీ వార్తలు:
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించారు. కొందరు సోషల్ మీడియాలో తన ఫొటోను ఉపయోగించి.. నచ్చినట్టుగా వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చినవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దని కుంబ్లే తెలిపారు. ‘కొందరు కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో నా ఫొటోని ఉపయోగించి అసత్య వార్తలను ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. ఆ ఎక్స్ ఖాతాలు, వాటిలో వచ్చిన వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్నిఅస్సలు నమ్మొద్దు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు అది సరైనదో కాదో ధ్రువీకరించుకోండి. నా అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి’ అని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఎక్స్‌లో పేర్కొన్నారు.
మహేశ్ బాబు ‘ముఫాసా’ క్రేజ్ మాములుగా లేదు:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో జల్సా, బాద్ షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబు ఈ సారి ఓ ఇంగ్లీష్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించాడు. హాలీవుడ్ లో తెరకెక్కిన ముఫాసా ది లయన్ కింగ్ లో సింహానికి మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తమ హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమా కావడంతో అటు మహేశ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను తమ సొంత సినిమాగా భావించి ముఫాసా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
మరోసారి రెస్పాన్సిబుల్ ఫాదర్ రోల్:
ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలో మెప్పించిన ప్రకాష్ రాజ్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై బాధ్యతయుతమైన నాన్నగా కనిపించబోతున్నాడు. కన్నడలో ఫాదర్ అనే మూవీలో టైటిల్ రోల్ చేస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్. లవ్ మాక్ టైల్ సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ కృష్ణ ఇందులో హీరో. కబ్జా డైరెక్టర్ ఆర్ చంద్రు తన కొత్త బ్యానర్ ఆర్ సి స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫాదర్ మూవీ మోషన్ పోస్టర్ ను స్టార్ హీరో సుదీప్ లాంచ్ చేశాడు. నీ కోసం ప్రతిదీ త్యాగం చేసే ఒకే వ్యక్తి నాన్న ఇట్స్ ఎమోషన్ జర్నీ అంటూ బెంచ్‌పై కూర్చున్న ప్రకాష్ రాజ్‌ను చూపించారు. చూస్తే ఇది ఫక్తు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ బాండింగ్ సినిమాలా కనిపించబోతుంది. డార్లింగ్ కృష్ణ, అమృత గతంలో లవ్ మాక్ టైల్‌తో హిట్టు అందుకున్నారు. ఈ నాన్న రోల్ ప్రకాష్ రాజ్‌కు బొమ్మరిల్లు, ఆకాశమంతలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందా చూడాలి.