గుంటూరులో భారీగా బంగారం దోపిడీ:
గుంటూరు జిల్లా మంగళగిరి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. దాదాపుగా ఐదు కిలోల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. శనివారం రాత్రి మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగు కేజీల 900 బంగారం దోచుకెళ్లారని భాదితుడు ఫిర్యాదు చేశాడు. సుమారు రూ.4 కోట్ల విలువైన బంగారం ఉంటుందని పోలీసులకు తెలిపాడు. విజయవాడ డీవీఆర్ జ్యూవెలరీ షాపు నుంచి మంగళగిరికి యజమాని రాము బంగారం తీసుకు వస్తున్న క్రమంలో మరో బైక్‌పై వచ్చిన దుండగులు అడ్డుకున్నారు. యజమాని రాముని బెదిరించి బంగారం బ్యాగ్‌ను అపహరించారు. యజమాని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అర్ధరాత్రి పోలీసులు రంగంలోకి దిగి ఘటనాస్థలితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే చోరీ ఆనవాళ్లు కనబడలేదు. కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు.
సర్వే పూర్తి చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఫిబ్రవరి 16) నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు సర్వే పూర్తిగా చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆసక్తి లేని కుటుంబాలు వంటి కారణాలతో సర్వే జరగని ఇళ్ల సంఖ్య 3,56,323గా నమోదైంది. ఈ గృహాలు తమ గణనను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ బడ్జెట్ సమీక్ష సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించండని అధికారులకు తెలిపారు. మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండని భట్టి విక్రమార్క అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే.. శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి ఇండ్ల నిర్మాణంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం అవుతుందని వెల్లడించారు. డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి.. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.
కేంద్రంపై కాంగ్రెస్ దాడి:
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు. మరణాలు, గాయాల సంఖ్యను వెంటనే వెల్లడించాలని.. తప్పిపోయిన వ్యక్తుల గురించి కేంద్రం సమాచారం అందించాలని ఆయన కోరారు. ఖర్గే ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ‘మృతుల, గాయపడిన వారి సంఖ్యను వీలైనంత త్వరగా ప్రకటించాలని, తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపును కూడా నిర్ధారించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట:
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 నంబర్ ప్లాట్‌ఫామ్‌లపై తొక్కిసలాట జరిగింది. కుంభమేళాకు వెళ్లడానికి భారీ సంఖ్యలో జనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. భారీ జనసమూహం కారణంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి వేచి ఉన్న ప్రయాణికులతో నిండిపోయాయని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట కేసును దర్యాప్తు చేయడానికి, సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే బోర్డులో సమాచార, ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు.
అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం:
అమెరికా నుండి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్రమ వలసలను అరికట్టేందుకు ఇచ్చిన హామీలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన భారతీయులను బహిష్కరిస్తున్న రెండవ బ్యాచ్ ఇది. విమానం రాత్రి 10 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందని అంచనా వేయగా, రాత్రి 11:30 గంటలకు ల్యాండ్ అయిందని ఆయన అన్నారు. బహిష్కరించబడినవారు సంకెళ్ళు ధరించారా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. ఫిబ్రవరి 5న మొదటి బ్యాచ్ అక్రమ వలసదారులను బహిష్కరించిన తర్వాత, పంజాబ్ నుండి బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది తమ కుటుంబాలకు మెరుగైన జీవితం కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు.
తన కొడుకుకు ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టిన ఎలాన్ మాస్క్:
టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తన కుమారుల్లో ఒకరికి ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టారు. తన కొడుకు పేరులో భారతీయ శాస్ర్తవేత్త ‘చంద్రశేఖర్’ను చేర్చారట. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 2023లో వెల్లడించారు. కెనడాకు చెందిన శివోన్ అలీసా జిలిస్‌తో కలిగిన కవలల్లోని ఒక కుమారుడి మధ్య పేరు ‘చంద్రశేఖర్’గా పెట్టినట్లు ఎలాన్ మస్క్ తనతో చెప్పినట్లు రాజీవ్ వెల్లడించారు. భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ప్రొ.సుబ్రమణ్యం చంద్రశేఖర్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఆయన సీవీ రామన్‌కి స్వయానా మేనల్లుడు. చంద్రశేఖర్1910 అక్టోబర్ 19న లాహోర్‌లో జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. 1933లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ఖగోళ శాస్త్రంలో చంద్రశేఖర్ పరిశోధనలు చేశారు. నక్షత్రం పుట్టుక, అభివృద్ధి, వినాశనం అయ్యే క్రమాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ పరిశోధన వివరాలు, 1939లో ఆయన రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ స్టెల్లార్ స్ల్రక్చర్’ అనే పుస్తకంలో ప్రచురించారు. అదే సమయంలో ఆయన పేరు, నోబెల్ పురస్కారం చర్చల్లో నిలిచింది. కానీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడిన్బర్గ్ ఆయన పరిశోధనపై అభ్యంతరం తెలిపారు.
ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు:
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీని ఫలితంగా ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత 165 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయినా.. చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ముంబై కెప్టెన్ ఈ కీలక ఓవర్‌ను ఎస్ సంజనకు అప్పగించగా.. మొదటి బంతికి నిక్కీ ప్రసాద్ ఫోర్ కొట్టింది. ఆపై రెండో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడు, నాలుగు బంతులకు ఒక్కో పరుగు రావడంతో మ్యాచ్ మరింతగా ఉత్కంఠభరితంగా మారింది. ఐదో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నిక్కీ ప్రసాద్ వికెట్ కోల్పోయింది. దానితో ఒక బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో ఆఖరి బంతికి అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడి రెండు పరుగులు పూర్తి చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. దీనితో ముంబై ఇండియన్స్ అనూహ్యమైన ఓటమిని మూటగట్టుకుంది.
మస్తాన్ సాయి కేసులో మరో ట్విస్ట్:
రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగా గుంటూరు కు చెందిన మస్తాన్ సాయిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ సాయి తో కలిసి పార్టీల్లో పాల్గొన్నప్పుడు మత్తుమందు కలిపి పలువురు మహిళలపై అత్యాచారం చేశాడని, ఆ వీడియోలను చూపించి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి వాటిని కూడా సీక్రెట్ గారికార్డు చేసాడని అందుకు సంబందించిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది లావణ్య. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను రాబట్టేందుకు మస్తాన్ సాయిని తమ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు:
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే మోహన్ బాబు తనయుడు కనుక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బిగినింగ్ లోనే తనేంటో నిరూపించుకున్నాడు. కానీ అతన్ని ఈ మధ్య కాలంలో తెరమీద చూసి చాలా కాలం అయ్యింది. కాగా ఇప్పుడు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మల్టీస్టారర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. దీంతో ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీస్.. కెరీర్ పరంగా మనోజ్‌కి బాగా కలిసిరావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రజంట్ మంచు ఫ్యామిలిలో జరిగిన గొడవలు మనకు తెలిసిందే. దీంతో మనోజ్‌కు ఫ్యామిలీ సపోర్ట్ పూర్తిస్థాయిలో లేదనే చెప్పాలి. మరి ఈ సెకండ్ ఇన్నింగ్ లో ఏ మాత్రం విజయం సాదిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ:
ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోతుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగమ్మాయి అయినప్పటికీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి అటు నుండి టాలీవుడ్ లోకి బ్యాగ్ సర్దేసింది. క్రేజీ ప్రాజెక్టులు ఒడిసి పట్టి యంగ్ భామలకు కాంపీటీటర్ అయ్యింది. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఫస్ట్ ఛాయిస్ కావడంతో కో యాక్ట్రెస్ లు కుళ్లుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రెజెంట్ తెలుగులో అమ్మడి క్రేజ్ ఎవరెస్ట్ కు చేరింది. ఆమె చేతిలో రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తుంది. ఇవే కాదు తమిళంలో సుధాకొంగర దర్శకత్వంలో వస్తోన్న పరాశక్తిలో నటిస్తోంది. రీసెంట్లీ మేడమ్ లుక్ రివీల్ చేసింది యూనిట్. ఇదే కాదు ఫుష్ప 2తో బీటౌన్ లో క్రేజ్ పెరగడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తోన్నట్లు కనిపిస్తోంది శ్రీలీల. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న మిట్టిలో కమిటయ్యింది. ఈ మధ్య కాలంలో సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తో ఫోటోలకు ఫోజులిస్తూ అక్కడ మీడియాకు అటెన్షన్ ఇచ్చింది. అతడితో సినిమా సెట్ అయ్యినట్లు టాక్ వచ్చింది. అలాగే భూల్ భూలయ్యా 3తో హిట్టు అందుకున్న క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ప్రకటించనప్పటికీ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారకంగా ప్రకటించారు. శ్రీలీల డెబ్యూ చేస్తున్న ఈ సినిమాను టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.