సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు:
చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు.
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు:
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో ఎలాంటి టార్గెట్ తో పని చేయాలన్న అంశంపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈరోజు (డిసెంబర్ 11) ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమైతుంది. తొలి రోజు రోజు ఆర్టీజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సప్ గవర్నెన్స్, ప్రజల్లో సానుకూల దృక్పథం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం:
ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. మంగపేట మండలం చుంచపెల్లి వద్ద గోదావరి నది దాటి వచ్చిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్టు అధికారులు పులి అడుగులు గుర్తించారు. పులి పాద ముద్రలు అనుసరించి మల్లూరు లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రం వైపు వెళ్లి ఉంటుందని అంచనాకి వచ్చారు. చుంచుపల్లి, పాలయిగూడెం, ఓడగుడెం, మల్లూరు, నిలాధ్రిపేట, బాలన్నగూడెం పరిసర ప్రాంతాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. పులి ఎలాంటి హాని తలపెట్టదని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి గ్రామంలో రైతు దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసిన దూడపై పులి దాడి చేసింది. అటవీ అధికారులు అక్కడి పాదముద్రలను పులివేనని నిర్ధారించారు. అదే పులిని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, సాయంత్రం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు మాకిడి రైల్వే క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా గుర్తించారు.
ఆమె కాంగ్రెస్ తల్లి.. తెలంగాణ తల్లి కాదు:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. తలరాత మార్చమని ప్రజలు అధికారం ఇచ్చారు కానీ.. తల్లిని మార్చమని కాదు అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉందని, బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు, కాంగ్రెస్ తల్లిది అని విమర్శించారు.
ఫెయిర్‌నెస్ క్రీమ్ కంపెనీకి రూ.15 లక్షల ఫైన్:
ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామి లిమిటెడ్‌పై వినియోగం ఫోరమ్ 15 లక్షల రూపాయల ఫైన్ వేసింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా.. అలాగే, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి కంప్లైంట్ చేశాడు. దీని ఆధారంగా, సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసును విచారణ చేసింది. అయితే, తాను 2013లో 79 రూపాయలకి క్రీమ్‌ను కొనుగోలు చేశా.. కాగా, ఆ ప్రోడక్ట్ తనకు ఫెయిర్ స్కిన్‌కు సంబంధించిన హామీని ఇచ్చింది అయినప్పటికీ.. అది ఫెయిల్ అయిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు.
ఆర్బీఐ నూతన గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్‌గా ఈరోజు (డిసెంబర్ 11) సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం నాడు శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా దాస్ అందరికీ వీడ్కోలు చెబుతూ వెళ్లిపోయారు. ఇక, ఆర్బీఐ తదుపరి గవర్నర్‌గా సోమవారం సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. కాగా, సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్నారు. నేటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ప్రకటించింది.
దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపై దాడి:
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం మేరకు దక్షిణ కొరియా పోలీసులు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అనూహ్యంగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించి గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మార్షల్ లా విధించడం ద్వారా ఆయన ఒక వారంలోపే దేశాన్ని గందరగోళంలోకి నెట్టాడని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూన్‌ను అధికారం నుంచి తప్పించేందుకు ప్రతిపక్షం మరోసారి ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పదవిలో ఉండగానే.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధం ఎదుర్కొన్న మొదటి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ అని న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల ధృవీకరించింది.
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పుష్ప రాజ్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి అయిదు రోజులు పూర్తి కాకుండానే రూ.1000 కోట్ల వసూళ్లు నమోదు చేసి అత్యంత వేగంగా ఈ ఫీట్ సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు, సినిమా కోసం వినియోగించిన సెట్ ప్రాపర్టీస్ సైతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ విభిన్నమైన డ్రెస్‌లను ధరించాడు. ఆయన ధరించిన డ్రెస్‌ల్లో ఎక్కువ శాతం పోచంపల్లి చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. కంఫర్ట్‌తో పాటు నేచురల్‌గా ఉంటాయనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కోసం ఇక్కత్ సికో పట్టును పుష్ప రాజ్ డ్రెస్‌ల కోసం వినియోగించారు. అల్లు అర్జున్ పర్సనల్ డిజైనర్ ఈ ఫ్యాబ్రిక్‌ను సెలెక్ట్ చేశారు. పుష్ప 2 సినిమా కొన్ని సన్నివేశాలను పోచంపల్లి ప్రాంతాల్లో చేశారు. అల్లు అర్జున్ ఒకటి రెండు సార్లు వచ్చాడంటూ స్థానికులు చెబుతుంటారు.
మీడియా ప్రతినిధులపై బౌన్సర్ల దాడి:
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్‌బాబుకు పోలీసు శాఖ సూచించింది.