*ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,86, 389 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంథంగా భావించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని తెలిపారు. బుగ్గన, ఆర్థిక మంత్రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్ర సమస్యల్ని పాత, మూసపద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంభించామని ఆయన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వ చర్యలు తీసుకుందన్నారు. పాలనా విభాగాలను పునర్వవస్థీకరించి అన్ని వర్గాల వారికీ సాధికారిత అందించామన్నారు. విద్యార్ధులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాద్యమ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. 1000 పాఠశాలల్లోని 4,39,395 మంది విద్యార్దులను సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతీ విద్యార్ధికి టోఫెల్ ధృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం చేశామన్నారు. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందన్నారు. అసెంబ్లీలో బుగ్గన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసింది. సుపరిపాలన ఆంధ్ర, సామర్ధ్య ఆంధ్ర, మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర ,భూభద్ర ఆంధ్రను సాధించాం. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశాం. అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా రూ.2356 కోట్లతో పనులు చేపట్టాం. సామర్ధ్య ఆంధ్రా ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. మానవ మూలధన అభివృద్ధికి గత ఐదేళ్లుగా ప్రాధాన్యతా క్రమంలో పెట్టుబడి పెట్టాం.” అని తెలిపారు.
2024-25 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ. 2,86,389 కోట్లతో బడ్జెట్.
రూ. 2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం.
రూ.30,530 కోట్ల మూలధన వ్యయం.
రూ.24,758 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు.
రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు అంచనా.
రాష్ట్రస్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు.
రెవెన్యూ లోటు జీఎస్డీపీలో 1.56 శాతం.
*ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 రకాల వ్యాధులకు చికిత్స.. ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు
ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇంటి వద్దకే ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్య భరోసాను అందిస్తున్నామన్నారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధం పెట్టామని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని, ఆరోగ్యశ్రీ ద్వారా 3,257 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ రోగులకు కార్పొరేట్ ప్రమాణాలతో ఉచిత వైద్యం అందిస్తున్నామని మంత్రి వివరించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని… జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నామని.. 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్భంది నియమించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని మంత్రి బుగ్గన చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి రూ.14,129 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న పాలవెల్లువ కింద రూ.2, 697 కోట్లు ఖర్చు చేశామన్నారు. 53.58 లక్షల మంది రైతులకు 33,300 కోట్ల రూపాయల మేర రైతు భరోసా ఆర్ధిక సాయం అందించామని.. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఒన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశామన్నారు. అటవీ భూముల సాగుదారులకు రూ.13, 500 ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. రైతుల కోసం రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37,374 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా.. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. 2 వేలకు పైగా ఫిష్ ఆంధ్రా రీటైల్ దుకాణాలు స్థాపించామన్నారు. తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వాహబ్‌గా తయారైందన్నారు. మత్య్సకార భరోసా పథకం ద్వారా 2 లక్షల 43 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు. చేపల వేట నిషేధ కాలంలో ఆర్థిక సాయం 4 వేల నుంచి 10 వేలకు పెంచామన్నారు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4,363 కోట్లు అందించామని.. 2,356 మంది ఉద్యానవన సహాయకులు నియమించామని మంత్రి బుగ్గన వెల్లడించారు.
*ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.. చాణక్యుడి పాలన అందిస్తున్నాం..
ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామన్నారు. గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్ఛులను మంత్రి వివరించారు. ఈ పథకాల అమలుతో సాధించిన ప్రగతిని వెల్లడించారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మా ప్రభుత్వం చేసిందన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2. 6 లక్షల మంది వాలంటీర్లను నియమించామన్నారు. . రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78 కి పెంచామని మంత్రి చెప్పారు. పాలనా పరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త రెవెన్యూ, పోలీసు డివిజన్లను కుప్పంలో కూడా ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. . భద్రత , మౌళిక సదుపాయాలను కల్పించామన్న మంత్రి బుగ్గన.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామని అని బుగ్గన సభలో వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్న ఆయన.. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. రూ.3,367 కోట్లతో జగనన్న విద్యాకానుక అమలు చేస్తున్నామన్నారు. 47 లక్ష మంది విద్యార్థులకు విద్యాకానుక ఇచ్చామన్నారు. జగన్నన గోరుముద్ద పథకం కోసం రూ.1910 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 9,52,925 ట్యాబ్స్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశామని మంత్రి చెప్పారు. రూ.11,901 కోట్లతో జగనన్న విద్యాదీవెన పథకానికి ఖర్చు చేశామన్నారు. విదేశీ విద్యాదీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూర్చామన్నారు. రూ.4,267 కోట్లు జగనన్న వసతీ దీవెన ఖర్చు చేశామని మంత్రి బుగ్గన వెల్లడించారు. 20.37 శాతం నుంచి 6.62 శాతానికి డ్రాప్ అవుట్ తగ్గించామన్నారు.
*అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా నిన్నటి సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లారు. వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. స్పీకర్‌పై కాగితాలు చించి విసిరారు. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు చర్చకుపట్టుబట్టింది. రైతులను, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మూడోరోజు సమావేశాలు ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ నుంచి ఒకరోజు పాటు స్పీకర్ వారిని సప్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా సభ్యులు సభలోనే కొనసాగుతూ నినాదాలు చేస్తుండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆఫీస్ ముందుసస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
*తహశీల్దార్ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం
ఏపీలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి చొరబడి రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య మరణించాడు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
*తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయి..!!
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ ఉంది. ఇతర రైళ్ల కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పటి వరకు వందే భారత్‌లో కుర్చీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సదుపాయాలతో కోచ్‌లను సిద్ధం చేశారు. వాటిని నమోదు చేసేందుకు అధికారులు తేదీని ఖరారు చేశారు. వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు ఉదయం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇతర రైళ్ల కంటే వేగంగా మరియు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో ప్రయాణికులు వీటిని ఇష్టపడతారు. దీంతో సుదూర మార్గాల్లో స్లీపర్ కోచ్‌లతో కూడిన కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశం యొక్క స్లీపర్ రైళ్లు మార్చి-ఏప్రిల్ నుండి ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ-ముంబై మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలిదశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. వీటిని ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. రాత్రి వేళల్లో సుదూర మార్గాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని నిర్ణయించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లలో 16 నుంచి 20 (ఏసీ, నాన్-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించారు. భారతీయ రైల్వేలో ఇప్పటివరకు ఉన్న సర్వీసుల కంటే ఇవి వేగంగా ఉంటాయి. దీని వల్ల రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. త్వరలో వందే మెట్రో రైలును తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో, మంత్రి నిర్మలా సీతారామన్ సుమారు 40,000 సాధారణ కోచ్‌లను అధునాతన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని అధికారులు ఆలోచిస్తున్నారు. సికింద్రాబాద్ – పూణే మార్గంలో ఒక సర్వీస్ ప్రతిపాదించబడింది. అదేవిధంగా రెండో వందేభారత్ స్లీపర్‌ను విశాఖ-భువనేశ్వర్ మధ్య తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపుపై అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది.
*రాష్ట్రంలో ‘హెల్త్ కార్డు – డిజిటల్ రికార్డు’! కానీ.. ఏజ్ లిమిట్ ఉందండోయ్..
కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్య రంగంలో మార్పు దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ డిజిటల్ మయం అవుతున్న తరుణంలో వైద్యారోగ్య శాఖ ద్వారా అందజేసే హెల్త్ కార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు అందించాలని, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక నంబర్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. డిజిటల్ రికార్డుల తయారీ కార్యకలాపాల్లో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ రికార్డు ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని అందించి మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య, ఆరోగ్య శాఖకు ప్రాధాన్యత తదితర అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. వారు డిజిటల్ హెల్త్ కార్డ్‌లను రూపొందించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలపై పని చేస్తున్నారు. హెల్త్ కార్డ్ ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం, వైద్య పరిస్థితులు, గతంలో వైద్యం, చికిత్స, వాడిన మందులు, సమస్య, వైద్యుల అభిప్రాయం తదితర వివరాలు డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా.. ఈ వివరాలన్నీ వెంటనే ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులకు తెలుస్తాయని, తద్వారా మెరుగైన వైద్యం, వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్డును ఆరోగ్యశ్రీ, ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ఎత్తు, పొడవు, బరువు వంటి వివరాలతో పాటు రక్త, మూత్ర పరీక్షలు చేసి వాటి ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి నమోదు చేస్తారు. బీపీ, మధుమేహం వంటి జబ్బులు, ఇతరత్రా ఏవైనా అనారోగ్య సమస్యలున్నా గుర్తిస్తారు. సమస్యలుంటే ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత రికార్డులను నమోదు చేసిన తర్వాత, వారికి అవసరమైన వైద్య సంరక్షణ అందించబడుతుంది. ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా హెల్త్ కార్డులో గుర్తింపు నంబరు నమోదు చేస్తే వెంటనే వివరాలు అందుతాయి. ప్రజల ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. డిజిటల్ డేటాను భద్రపరిచే నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఐటీ శాఖ సమన్వయంతో దీనిపై దృష్టి సారిస్తుంది. త్వరలో 18 ఏళ్లు పైబడిన వారికి హెల్త్ కార్డులు అందుతాయి.
*ఆర్టీసీని కాపాడుకోవాలి..
ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్ లో టిఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రజల సంస్థ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 800 మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్ లకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. గతంలో కరోనా, సమ్మె కారణంగా ఆర్టీసీ కి పలు సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. వాటన్నిటిని అదిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందన్నారు. నూతనంగా మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పద్నాలుగున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. అక్యూపెన్సీ రేషియో బస్ స్టాండ్ లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుండి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఏండి మార్గదర్శకంలో ముందుకు పోతున్నామన్నారు. ప్రజలంతా సహకరించాలి.. దేశ వ్యాప్తంగా రైల్వే ఏ విధంగా ఉపయోగ పడుతుందో.. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకు గమ్యానికి చేర్చే వ్యవస్థ రాష్ట్ర రవాణా లో ఆర్టీసీ పాత్ర కీలకమైందన్నారు. ఆర్టీసి మనందరిది దానిని కాపాడుకోవాలని సూచించారు. ఆర్టీసీ ని ముందుకు తీసుకుపోవడం లో అందరి సలహాలు కోరుతూ ఆర్టీసీ సంస్థను ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
*ఈడీ నోటీసులపై స్పందించని ఢిల్లీ సీఎం.. కోర్టుకు అధికారులు..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ పట్టు బిగిస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన 5 సమన్లపై ఆప్ అధినేత ఇప్పటి వరకు స్పందించలేదు.. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. గత ఏడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3తో పాటు జనవరి 18 తేదీల్లో ఈడీ ముందు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్ కు సమన్లను జారీ చేసిన వాటిని ఆయన పట్టించుకోలేదని పిటిషన్ లో తెలిపింది. అయితే, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు శనివారం నాడు ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా ముందు ఈ ఫిర్యాదు దాఖలు చేయబడింది. ఇక, ఈ కేసును ఈరోజుకి విచారించనుంది. గత నాలుగు నెలల్లో నాలుగుసార్లు సమన్లు పంపినప్పటికీ, ఆయన ఈడీ ముందు హాజరుకావడం లేదని, ఇది చట్టవిరుద్ధమని ఈడీ పేర్కొనింది. ఇక, ఈడీ సమన్లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా తమ ప్రభుత్వంపై వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా కుట్ర చేస్తున్నారన్నాడు. ఢిల్లీలోని ఆప్ సర్కార్ ను పడగొట్టేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొత్త మద్యం పాలసీ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, 2021-22 ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో మద్యం వ్యాపారులకు లైసెన్సుల మంజూరు కోసం కొంత మంది వ్యాపారవేత్తలకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ పదే పదే ఖండించింది.