యువకుల మృతి బాధాకరం:
ఇటీవల రాజమహేంద్రవరంలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. గత ఐదేళ్లలో కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఏడీబీ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని, ఇక నుంచి పిఠాపురం పర్యటనకు గోతులతో కూడిన ఏడీబీ రోడ్డు గుండా తాను వెళ్లాలని నిర్ణయించుకున్నా అని డిప్యూటీ సీఎం ట్వీట్ చేశారు.
ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ:
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి వచ్చారు. కాకినాడ పోర్టు సెజ్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఎదుట ఆయన విచారణకు ఆయన హాజరయ్యారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలపై వైసీపీ ఎంపీని ఈడీ అధికారులు ఎంత సేపు విచారణ చేస్తారో చూడాలి. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్), కాకినాడ సెజ్ (కేసెజ్)ల్లోని రూ.3,600 కోట్ల విలువైన షేర్లను కేవీ రావు (కర్నాటి వెంకటేశ్వరరావు) నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాకినాడ సీ పోర్టు, కాకినాడ సెజ్‌లోని మేజర్ వాటాను బలవంతంగా తీసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. రూ.2,500 కోట్ల విలువ చేసే 41 శాతం షేర్లను రూ.494 కోట్లకు, సెజ్‌లో రూ.1100 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.12 కోట్లకు బలవంతంగా తీసుకున్నారని కేసు నమోదయింది.
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు:
ఎలక్టోరల్ బాండ్లపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో.. ఫార్ములా ఈ- రేస్ జరిగింది 2023లోనని తెలిపారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ- కార్ రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం అవినీతి ఎలా అంటారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధం అని కేటీఆర్ అన్నారు. మరోవైపు.. కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లి, మళ్లీ రావడంపై అడ్వకేట్ సోమ భరత్ మాట్లాడారు. లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్‌ను ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది.. ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఓపిక పట్టి తమకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చామని తెలిపారు. ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాం.. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్ అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చి హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకు రావద్దు అనడం ఏంటి అని ప్రశ్నించారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొత్త ట్విస్ట్:
ఫార్ములా-ఈ రేస్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన అంశాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో నుంచి భారీగా ఎన్నికల బాండ్లు అందినట్లు తెలిపింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్థల నుంచి 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లు అందాయని.. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లు కొనుగోలు చేశారని వెల్లడించింది. ప్రతిసారి రూ. కోటి విలువ చేసే బాండ్ల కొనుగోలు చేసినట్లు చెప్పింది. మొత్తంమీద రూ.41 కోట్లను బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు చెల్లింపులు జరిగాయని ప్రభుత్వం తెలిపింది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులు కర్ణాటక హైకోర్టుకు బదిలీ:
పలు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కేసులను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని ఈరోజు ( జనవరి 6) సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా చేసిన ఆరోపణలను సవాల్ చేస్తూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు పలు న్యాయస్థానాల్లో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, సీసీఐ వేసిన పిటీషన్ ఆధారంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ-కామర్స్ సంస్థల కేసులను కర్ణాటకకు పంపింది. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అయిన పిటీషన్ల కేసుల్లో విచారణ పూర్తి కాకపోతే, వాళ్లకు తగినంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.
బెంగళూరులోనే రెండు కేసులు:
చైనాలో కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు భారత్‌లో రెండు నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన ఓ ఆస్పత్రిలో మూడు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దృవీకరించింది. అయితే, వీరిలో ఒక చిన్నారికి వైరస్ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో చైనా వైరస్ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్నారు. అయితే, హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హస్టరీ లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది. అయినప్పటికీ వ్యాది రావడం అందరినీ కలవర పెడుతుందని తెలిపింది. కాగా, చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ సహా పలు శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తుండటంతో భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వహించింది.
ఉద్యోగులకు 400 శాతం జీతాల పెంపు:
సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. అనంతరం సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఈ నూతన సర్కార్ లో గవర్నమెంట్ ఉద్యోగులకు 400 శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ వెల్లడించారు. 1.65 ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయబోతున్నామని మహమ్మద్ అబ్జాద్ వెల్లడించారు.
‘హానీ రోజ్’పై లైంగిక వేధింపులు:
మలయాళ ముద్దుగుమ్మ హానిరోజ్ నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది హాని. ప్రస్తతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది హాని రోజ్. నిత్యం ఫోటో షూట్స్, ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసే హాని రోజ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తనను కేరళకు చెందిన ఓ బిజినెస్ మెన్ కొద్దీ నెలలుగా నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెంబడిస్తూ, తనను వేధిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టింది హాని రోజ్. గతంలో ఓ సారి సదరు వ్యక్తి నిర్వహించిన ఓ ఈవెంట్ కు తనను పిలిస్తే తానూ వేరే కారణాల వలన హాజరు కాలేదు. ఆ సంఘటను మనసులో పెట్టుకుని అప్పటి నుంచి అతడు నాపై ప్రతీకారం తీసుకునేందుకు తన వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ తన పరువుకు భంగం కలిగిలించి, తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తెలుపుతూ, తాను ఎక్కడికి వెళ్తే అక్కడకి వస్తున్నడని, అతడిపై చట్టపరంగా పోరాడుతానని ఓ పోస్ట్ పెట్టింది.
టికెట్ రేట్స్ పై దిల్ రాజు ప్రెస్ మీట్
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్దత నెలకొంది. ఈ సందర్భగా ప్రముఖ నిర్మాత దిల్ రాజుప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ” టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలి. అలాగే ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారు. తెలంగాణా సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారు ఆ ఆశతో మళ్లీ సీఎం ని కలుస్తాను. ఆయన నిర్ణయమే ఫైనల్. తెలుగు సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్నాయి అందుకే ప్రపంచ ఖ్యాతి వచ్చింది. గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి కి మధ్య ఎఫ్డీసీ చైర్మెన్ పదవి కీలకం మాకు ఒక విజన్ వుంది. ఇండస్ట్రీ కి ఉన్న చాలా సమస్యల ను పరిష్కరించే విధంగా ప్లాన్ చేస్తున్నాంకాల క్రమేణా హీరోలు విలన్ లు అయిపోతున్నారు. అవే జనాలు కూడా చూస్తున్నారు ‘ అని అన్నారు.
ఈ దేశానికి ధోనీ హీరో:
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి వరల్డ్ వైడ్ గా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తికి భారత జట్టులో ఆయనతో కలిసి ఆడినవారు మరింత గౌరవం ఇస్తారు. ధోనీ తమ మార్గదర్శి అని గర్వంగా చెప్పే క్రికెటర్లలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ మొదటి స్థానంలో ఉంటాడు. ఇండియా టీమ్ కు రెండుసార్లు ప్రపంచ కప్‌ను అందించిన గొప్ప కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసించారు. ధోనీని రీప్లేస్ చేయడం చాలా కష్టం.. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నాను అని తెలిపాడు. ఇక, ధోనీ ఈ దేశానికి హీరో.. వ్యక్తిగతంగా, క్రికెటర్‌గా ఆయన నుంచి ఎన్నో అంశాలను నేర్చుకున్నాను.. మిస్టర్ కూల్ ఉన్నాడంటే.. జట్టులో ఎంతో నమ్మకం పెరుగుతుందని రిషభ్ పంత్ వెల్లడించారు.