ప్రజావసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు….
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్‌డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో విశాల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని సీఎం అన్నారు. అనుసంధాన రహదారుల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
అమానుషం.. 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
చెట్టుకు చీరకట్టినా వదలన్నట్టున్నరు కామాంధులు. ఇటీవల దేశవ్యాప్తంగా లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు, చివరికి వృద్ధ మహిళలను కూడా వదలడం లేదు. మరికొందరు మృగాలు మైనర్ బాలుడిపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లిలో ఈనెల 27న ఇంటి ముందు సైకిల్ తోక్కుకుంటున్న 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వంశీని మూడు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు..
కంకిపాడు పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారణ సాగింది. వంశీని మూడు గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో స్థల ఆక్రమణ, బెదిరింపులకు సంబంధించిన పలు ప్రశ్నలు వంశీని పోలీసులు అడిగారు. కేసుతో సంబంధమున్న ఇతరుల వివరాలు కూడా ఆరా తీసిన పోలీసులు. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం పోలీసులు గన్నవరం కోర్టులో వంశీని హాజరు పర్చారు. పోలీసుల విచారణ తీరుపై జడ్జి వంశీని ప్రశ్నించారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించారా అని వంశీని జడ్జి అడిగారు. లాయర్ సమక్షంలో విచారణ సక్రమంగా జరిగిందని వంశీ జడ్జికి సమాధానం ఇచ్చారు. కోర్ట్ విచారణ అనంతరం విజయవాడ సబ్ జైల్‌కు వంశీని పోలీసులు తరలించారు.
తెలంగాణలో రైతులకు శుభవార్త..
మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈరోజు మంత్రి ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. కొత్తగూడెం పట్టణంలో ఎయిర్ పోర్టు నిర్మించాలని కేంద్రమంత్రిని కలిసి కోరటం జరిగిందని, ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే దక్షిణ అయోధ్య గా భాసిల్లుతున్న భద్రాచలం దివ్య క్షేత్రం మరింత ప్రాచుర్యం పెరుగుతుందన్నారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్ మీదుగా జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. యాదాద్రి భద్రాద్రి జాతీయ రహదారి వల్ల గోదావరి పరివాహక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
సంతానం కోసం నరబలి.. వ్యక్తి తల నరికి, హోలీ మంటల్లో మొండం దహనం..
బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతబడి, తంత్ర విద్యకు ఓ వ్యక్తి బలయ్యాడు. అత్యంత దారుణంగా అతడి తల నరికి, మొండాన్ని అగ్నిలో కాల్చేశారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 65 ఏళ్ల యుగుల్ యాదవ్‌గా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో తాంత్రికుడి బంధువు కూడా ఉన్నాడు.
ఔరంగాబాద్ ఎస్పీ అమ్రిష్ రాహుల్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్ బిఘా గ్రామ నివాసి అయిన యుగుల్ యాదవ్ కనిపించడం లేదని మార్చి 13న ఫిర్యాదు అందిందని, దీనిపై కేసు నమోదు చేసి, ప్రత్యేక టీం ద్వారా దర్యాప్తు జరిపించామని, దర్యాప్తులో పొరుగున ఉన్న బంకర్ గ్రామంలోని ‘‘హోలికా దహన్’’ కార్యక్రమంలో బూడిద నుంచి మానవ ఎముకలు దొరికినట్లు చెప్పారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా గమనించగా కాలిపోయిన మానన ఎముకలు, యుగువల్ చెప్పులు కనిపించాయని వెల్లడించారు.
జగన్, అవినాష్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు..
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతు.. జగనన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డురంగా ఉంది.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వాళ్ళు దిట్ట.. సీబీఐ విచారణ జరిగింది.. జగన్, అవినాష్ లకు అంతా తెలుసు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా.. పాడా నిధులు 800కొట్లు పాడు చేశారు.. చిత్రావతి నీళ్లు పులివెందులకే చేరలేదు.. వై నాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయాడు.. మళ్ళీ పోటీ చేస్తాం అంటున్నారు.. ఆ ఉన్న 11సీట్లు కూడా రావు.
బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల హక్కులు, రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏమి చేస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు.
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ-కేవైసీ ప్రక్రియ 2025 మార్చి 31తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువు పొడిగించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2025 ఏప్రిల్ 30 వరకూ e-KYC ప్రక్రియ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా చట్టం క్రింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయింపు కొరకు e-KYC ప్రక్రియ తప్పనిసరి. లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని గడువు తేదీ లోగా e-KYC ప్రక్రియను పూర్తిచేయవచ్చని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్… మెట్రో రైలు సమయం పొడిగింపు
హైదరాబాద్ మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రివేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి.
15 అడుగుల గిరినాగు.. హడలిపోయిన ప్రజలు
పాములను చూస్తే దాదాపు అందరికీ భయం పుడుతుంది. పాము కనిపిస్తే చాలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు. అలాంటిది 15 అడుగుల భారీ గిరినాగు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. భారీ గిరినాగు జనావాసాల్లో ప్రత్యక్షమవగా ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దేవరాపల్లిలో ఒడ్డు చింతల కల్లాల వద్ద 15 అడుగుల గిరినాగు శుక్రవారం సాయంత్రం హడలెత్తించింది. తారు రోడ్డు దాటుతున్న పామును కుక్కలు అటకాయించాయి. పాము బుసలు కొడుతుండగా రైతులు చూసి పరుగులు తీశారు.