రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోంది..
కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ నెల 19న ప్రారంభమైన కుల గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదరికం అనే రోగానికి సీఎం జగన్ సరైన చికిత్సను అందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు.
రాముడు సీతపై సీపీఐ ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలు.. దుమారం రేపిన ఫేస్‌బుక్ పోస్ట్..
కేరళలో సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రాముడు, సీత, లక్ష్మణుడిని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టు పెట్టాడు. దీంతో ఇది వివాదాస్పదం కావడంతో ఆ పోస్టును డిలీట్ చేశాడు. త్రిసూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న పి బాలచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ రాముడు, లక్ష్మణుడికి సీతా పరోటా, మాంసం వడ్డించింది’’ అంటూ రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలచంద్రన్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడం, విమర్శలు రావడంతో రామ భక్తులకు క్షమాపణలు చెప్పాడు, తన పోస్టును గురించి చింతిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘ ఎవరినీ కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు. నిమిషాల వ్యవధిలో నేను దానిని ఉపసంహరించుకున్నాను, కాబట్టి ఎవరూ దాని గురించి ఆందోళన చెందవద్దు. నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని కమ్యూనిస్టులు దెబ్బతీస్తున్నారని, బాలచంద్రన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురలో శ్రీకృష్ణుడు మందిరంలోకి వస్తారు
నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు దినేష్. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. హిందూ మతానికి చేసిన పాపాల వల్లే.. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురలో శ్రీకృష్ణుడు మందిరంలోకి వస్తారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా గెలుస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో గాంధీ నోటు అవసరం లేదు, మోడీ పేరుతో గెలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది, ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
కోవర్టు నాని.. ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు
కోవర్టు నాని ఊసరవెల్లి.. లాగా బిహేవ్ చేస్తున్నాడని కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్బా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయారం… గాయారం టైప్ అని.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కట్టిన ప్రతి ఫ్లై ఓవర్ చంద్రబాబు కట్టించిందేనని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఫ్లై ఓవర్ కట్టడానికి తనకు సంబంధించిన సోమా కంపెనీకి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టాడని.. చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇస్తే అప్పుడు సైలెంట్ అయ్యాడని పేర్కొన్నారు. కోవర్ట్ భవన్ లో కూర్చుని ఎంపీ నిధుల్లోంచి కమిషన్లు తీసుకున్నావు.. తాను నిరూపిస్తానని అన్నారు.
ఏబీవీపీ ఝాన్సీపై పోలీసుల దుశ్చర్య.. పరామర్శించిన బండారు విజయలక్ష్మీ
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషమన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మీ. ఇవాళ ఝాన్సీని బండారు విజయలక్ష్మీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు మహిళలకు కావాల్సింది బస్సులో ఉచిత ప్రయాణం కాదు, మహిళలకు కావాల్సింది ఫ్రీడం ఆఫ్ ప్రోటెస్ట్– ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అని ఆమె వ్యాఖ్యానించారు.
గిరిజన ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. 300 సెల్ టవర్స్ ప్రారంభం
మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4-జీ సెల్‌టవర్స్‌ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్ధవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 4, కాకినాడలో ఒక ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. దాదాపు రూ.400 కోట్లు ఖర్చుతో టవర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈరోజు 300 టవర్లు, అంతకుముందు జూన్‌లో 100 టవర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ టవర్ల ఏర్పాటు ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరంగా ఉండబోతోంది. ఇవాళ ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగం కలగనుందని సీఎం పేర్కొన్నారు. కాగా.. మొత్తంగా కలిపి 2887 టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా రూ.3,119 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. టవర్ల నిర్మాణానికి అవసరమైన భూములను వెంటనే టెలికాం సంస్థలకు కేటాయించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా 5,549 గ్రామాలకు పూర్తి స్థాయిలో మొబైల్ టెలికాం సేవలు అందుతాయన్నారు. ఇప్పటి వరకు సీగ్నల్ లేని అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయని సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.
పారిశ్రామికాభివృద్ధి కోసం సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్
హైదరాబాద్: తెలంగాణను 2050 నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి గానూ సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అందులో భాగంగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. ప్రతిపాదిత రివర్ ఫ్రంట్ లో అమ్యూజ్ మెంట్ పార్కులు, జతపాతాలు, వాటర్ స్పోర్ట్స్, వీధి విక్రేత స్థలాలు, వ్యాపార కేంద్రాల వంటి వాటితో పాటు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో షాపింగ్ మాల్స్ కూడా వస్తాయని వివరించారు. ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిద్దాలన్న లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని చేపడుతున్నామని వివరించారు. దీని వల్ల స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
జమ్మికుంట గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేశాం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుపై అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. జమ్మికుంట గడ్డపై మళ్లీ గులాభి జెండా ఎగురవేశామని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఇకనైన మారి బుద్ది తెచ్చుకోవాలని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 200యూనిట్స్ వరకు కరెంట్ బిల్లులు కట్టద్దని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పేరును చెరిపివేయాలని చూస్తుందని ఆయన పేర్కొన్నారు. చెరిపి వేయడానికి కేసీఆర్ పేరు గోడలపై లేదు, ప్రజల గుండెల్లో ఉన్నదనే విషయం మరిచిపోవద్దని ఆయన అన్నారు. రుణమాఫీ చేయాలని అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి హోదాలో ఉండి కోమటిరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
లోక్‌సభ ఎన్నికల లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించిన ఎలక్షన్ కమిషన్
లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది. ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించాల్సి ఉంది.
మోడీని ఓడించి.. రాహుల్‌ని ప్రధాని చేయాలి
కార్యకర్తలు రక్తం చెమటగా మార్చడం తోనే నేను సీఎం గా గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయ్యాకా.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్.. మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాగానే ఆరు నెలలు కాకముందే మంత్రి కాలేదని అనుకునే రోజులు ఇవి అని, 2004లో ఎంపీ గా ఎన్నికైన రాహుల్ గాంధీ.. రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేసింది రాహుల్ గాంధీ అని ఆయన కొనియాడారు. త్యాగం అంటే రాహుల్ గాంధీది అని, దేశ భక్తి అంటే గాంధీ కుటుంబంది అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు. మూడు తరాలు ప్రధాని అయిన కుటుంబం కి ఇల్లు కూడా లేదని, అలాంటి కుటుంబం పై అక్రమ కేసులు పెడుతున్నాడు మోడీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిళ్ళా రంగడు ఇద్దరు ఊరు ఊరు తిరుగుతున్నారని, చార్లెస్ శోభ రాజ్ ఇంట్లో పడుకున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
మరికొన్ని గంటల్లో వైన్ షాప్ లు బంద్..
రేపు జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారు.. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26 వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో ఈరోజు సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు.. కాగా.. సోమవారం గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు మూడేళ్ల కిందట తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత రాజీనామాను ఆమోదించారు స్పీకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. అయితే, ఈనెల 22న ఆ రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు.