బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటి..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టభద్రులు గుండె మీద చేయి పెట్టుకొని ఆలోచించాలని కోరుతూ, బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత పట్టభద్రుల లే కదా. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారు? ఎవ్వరికీ మద్దతు ఇస్తారు?” అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో చేసిన మంతనాలు, వారి వ్యూహాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. “ఎంపీ ఎన్నికల్లో మీ 8 సీట్లలో డిపాజిట్ పోయింది. అదే స్థానాల్లో బీజేపీ 8 మంది గెలిచారు. మీ రాజకీయ వ్యూహం ప్రజలకు అర్థమైంది,” అని మండిపడ్డారు.
అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించటం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం..
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై అందరూ ఆతృతగా ఎదురు చూసారు.. ఆయన ప్రసంగంలో జగన్ ను తిట్టిస్తూ.. చంద్రబాబును పొగిడించుకున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ తో పాటు 144 హామీలు ఇచ్చారు.. ఇవాళ ఏ హామీకి సంబంధించిన స్పష్టత ఇవ్వలేదు.. విజన్- 2047 అంటూ తాతమ్మ కథల్లా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు.. లిక్కర్ రేట్లు కూడా పెంచామని చెప్పించారు.. ఏపీలో టీడీపీ, జనసేన నేతలు సిండికేట్ లా మారి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు అని ఆమె విమర్శలు గుప్పించింది. అబద్ధాలు కూడా పరాకాష్టకు చేరాయి.. అధికారంలోకి వచ్చాక రూ. 15 వేల కోట్ల ఛార్జీలు పెంచి.. ఇక, పెంచమని గవర్నర్ తో చెప్పించారు.. మహిళలకు 1500, ఉచిత బస్సు, తల్లికి వందనం ప్రస్తావన లేదు అని ఆర్కే రోజా అన్నారు.
నిర్మాత కొడుకు పెళ్లిలో చరణ్, ఎన్టీఆర్- మహేష్ మిస్సింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయిలో దర్శనం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి భార్యలతో హాజరయ్యారు. అయితే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన భార్య నమ్రత ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక వీరందరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో తెలుసా? మహేష్ రెడ్డి. ఆయన నాగార్జునతో షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేశారు. ఈ వివాహానికి నాగార్జున, చిరంజీవి, నిరంజన్ రెడ్డి, అనిరుద్ రవిచందర్, సుకుమార్ వంటి వాళ్ళు హాజరయ్యారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు జూపల్లి, ఉత్తమ్, కోమటిరెడ్డి
శ్రీశైలం వద్ద నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టన్నెల్ నిర్మాణ పనుల సమయంలో మధ్యలో ఓ భాగం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటూ, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాయి.
వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసిన భూ అక్రమాలు, అక్రమ మైనింగ్, ఆర్థిక అరాచకాలపై దర్యాప్తు చేయాలని సిట్ కు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ కి సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. ఇక, గత ప్రభుత్వం అండగా వల్లభనేని వంశీ చేసిన అక్రమాలు, అక్రమ మైనింగ్ సహా భూకబ్జాలపై ఈ సెట్ విచారణ చేయనుంది. సుమారు 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా..
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్ధతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజా సేవలో ముందుడాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు.’ అని తెలిపారు.
టన్నెల్‌లో నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ లో చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ పనులు జరుగుతున్న వేళ పైకప్పు కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సంఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన ఎక్కువైపోయింది. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే టన్నెల్ లో ఊట నీరు, బురద ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలికి రెస్క్యూటీమ్ చేరుకోలేకపోతోంది. ఈ క్రమంలో టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. నీరు, మట్టిదిబ్బలు, బోరింగ్ మెషిన్ శిథిలాలు తొలగిస్తేనే సహాయక చర్యలు ముందుకు సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేయలేమని ఎన్బీఆర్ఎఫ్ బృందం తేల్చి చెప్పింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో పరిస్థితిని చూసి నేవీ టీమ్ కూడా వెనుదిరిగింది.
ప్రత్యేక నిధులు కేటాయించండి.. భట్టిని కలిసిన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రైతు కమిషన్.. రైతులతో వ్యవసాయదారులతో కౌలు రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టిందని, కూరగాయలు,పండ్లు పులతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నా, దిగుబడి రావాలన్నా రైతులకు సబ్సీడీ పథకాలు తేవాలన్నారు. అయితే గ్రౌండ్ వాటర్ పై ఆధారపడిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిదంగా చాలావరకు రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారని గుర్తుచేశారు. దీనికి కూడా ప్రభుత్వం ఇంపార్టెంట్ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమల్లో ఉంది.
కేసీఆర్, రేవంత్‌కు ఏమాత్రం తేడా లేదు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలానే, ఈసారి “బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆయన అనుకోకుండా ప్రచారానికి వచ్చారని, “ఎవరి కోసం వచ్చారో, ఎవరి ఒత్తిడితో వచ్చారో తెలియదు” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతేగాక, “బహిరంగ సభలు పెట్టుకున్నారు, శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈ రోజు కూడా అదే చేశారు” అంటూ రేవంత్ రెడ్డి విధానాన్ని విమర్శించారు.