సీఎం జగన్ సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్ధానం పంచాంగంను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. వింజామర వీస్తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకున్నారు సీఎం జగన్.. గత ఆరు రోజులుగా దసరా ఉత్సవాలు ప్రశాతంగా జరిగాయన్నారు.
ఎక్కడా ఏ చిన్న అవాంతరం కలుగకుండా ఆ అమ్మవారు చూస్తున్నారు అంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మొత్తం ఐదు రోజుల్లో 4 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.. ఇవాళ ఒక్కరోజు 1.70 వేల వరకూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు అని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై సీఎం కచ్చితమైన అవగాహనతో ఉన్నారు.. 55 కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి.. ఇది కాక 145 కోట్ల రూపాయల ఆలయం నిధుల నుంచీ వినియోగిస్తాం అని మంత్రి చెప్పారు.
డ్రగ్స్ మత్తులో హమాస్ ఉగ్రవాదుల అరాచకం.. ఇజ్రాయిల్‌పై దాడిలో కొత్త విషయాలు..
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై భీకరదాడులు చేశారు. అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు అనే కనికరం లేకుండా దారుణంగా మారణహోమానికి పాల్పడ్డారు. చిన్న పిల్లల్ని కనికరం లేకుండా తలలు నరికి హత్యలకు పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 3000 మంది మరణించారు.
ఇదిలా ఉంటే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేసే సమయంలో హమాస్ ఉగ్రవాదులు ‘సైకోయాక్టివ్’ డ్రగ్స్ ప్రభావంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు సింథటిక్ యాఫెటమైన్ స్టిమ్యులేటర్ అయిన కాప్టాగన్ అనే డ్రగ్ ప్రభావంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని ‘పేదవాళ్ల కొకైన్’ అని పిలుస్తుంటారు. ‘
‘బీజేపీతో పొత్తుకు పినరయి విజయన్ గ్రీన్‌సిగ్నల్’.. మాజీ ప్రధాని ప్రకటనపై దుమారం
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, సత్యానికి మించినవని విజయన్ అన్నారు. జేడీఎస్ ప్రయోజనాలను కాపాడేందుకే కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు సీఎం పినరయి విజయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాజీ ప్రధాని దేవెగౌడ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది. మాజీ ప్రధాని తన ప్రకటనను సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు.
ప్రకాశం జిల్లా భూకబ్జాలపై సీఐడీకి రిఫర్ చేయనున్న ఏపీ ప్రభుత్వం
ప్రకాశం జిల్లాలో భూ కబ్జాల వ్యవహారం సీఐడీకి ఏపీ ప్రభుత్వం రిఫర్ చేయనుంది అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గన్ మ్యాన్ లను సరెండర్ చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను.. వారు డ్యూటీలో చేరారు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో కొన్ని భూకబ్జాలు అయిన విషయంపై విచారణ చేయమని చెప్పాను.. దీని పై సిట్ వేశారు.. గత పదేళ్ళ నుంచి ఈ భూకబ్జాలు జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతాయా అని నాపై విమర్శలు వచ్చాయి.. విచారణ వేగంగా చేసి అనుమానితుల పేర్లు బయట పెట్టమని ఎస్పీ, కలెక్టర్ ను అడిగాను అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్న రేఖా నాయక్
కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సమక్షంలో అధికార బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల విజయవంతమైన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ఆర్మూర్ సభతో ముగిసింది. అక్టోబర్ 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాహుల్, ప్రియాంక గాంధీ తమ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే .
ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగ్త్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగింది. ఆర్మూర్ నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనున్న రాహుల్ , శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తారు. అంతకుముందు రాహుల్ గాంధీ అనేక రంగాల్లో బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు చేశారు. తనకు దేశంలో ఇల్లు అవసరం లేదన్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఆయనకు స్థానం ఉంది. కేసీఆర్ ఆస్తులపై ఈడీ, ఐటీ విచారణలు ఎందుకు లేవని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు భారత రాష్ట్ర సమితి మద్దతు తెలిపిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని రాహుల్ గాంధీ సూచించారు.
తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధం
తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. తెలంగాణలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. తెలంగాణతో కాంగ్రెస్‌కు ఎన్నికల బంధమే.. బీఆర్‌ఎస్‌ది పేగు బంధమన్నారు. ఇవాళ ఆమె నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ.. పేగుబంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆధరిస్తారని, తెలంగాణను వెనుకబడేయడంలో ఆ పార్టీకి అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది నెహ్రూ అని, 1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిగింది ఇందిరా గాంధీ హాయంలో అని ఆమె వ్యాఖ్యానించారు.
గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి జననీరాజనం
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గంలోని ఉప్పలపాడులో గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ (సచివాలయం)పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి లబ్ది దారులకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వారికి సంక్షేమ పథకాల కర పత్రాలను అందజేశారు. ప్రతి గడపన మహిళలు తమ అభిమాన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి బొట్టుపెట్టి హారతులు పట్టారు.
ఇక, ప్రతి గడపకు వెళ్లి.. స్థానికులను పలకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ముందుకు సాగారు. అయితే, ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డికి స్వాగతం పలుకుతూ ఊరినిండా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
విద్యాశాఖలో స్కాంలు జరిగాయి.. త్వరలో బయటపెడతాం..!
పేదలకు నాణ్యమైన విద్య పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారే ఒప్పందాలు జగన్ ప్రభుత్వం చేసుకుంటోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. టీచర్లకు జీతాలివ్వడంలో విఫలమవుతోన్న ప్రభుత్వం ఇతర దేశాలకు చెందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.. ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి.. విద్యా రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెడుతోంది.. టోఫెల్ శిక్షణ కోసం 54 పేజీల ఒప్పందం.. ఆ ఒప్పందాన్ని మంత్రి బొత్స చదివాలి అని ఆయన అన్నారు. ఇక ఐబీ సంస్థతో మరో ఒప్పందం కుదుర్చుకుంది.. భారత దేశ చట్టాలు ఐబీ సంస్థకు వర్తించవట.. ఏమైనా తేడా వస్తే జెనీవా కోర్టులో తేల్చుకోవాలంట.. టీచర్ల ట్రైనింగ్ నిమిత్తం రూ. 1200 కోట్ల నుంచి రూ. 1500 కోట్లు ఖర్చు పెట్టేలా ఒప్పందం చేసుకున్నారని నాదెండ్ల మనోహార్ అన్నారు.
జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ ఆమోదం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన భద్రత కల్పిస్తూ జగన్ సర్కార్ చట్టం చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ చట్టానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా జీపీఎస్ అమలు చేయనున్నారు. అయితే, పదవి విరమణ సమయంలో మూల వేతనంలో 50 శాతం పెన్షన్ భద్రత కల్పించేలా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది.
కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. రేపు(శనివారం) డీఏ విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడనున్నాయి. 3.64 శాతం డీఏ రిలీజ్ చేయనున్నారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు.