ఈ ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోంది..
రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని తెలిపారు.
వేరే రాష్ట్రాల్లో ఉంటూ.. అప్పుడప్పుడు మోసం చేసేందుకు ‘నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్’ మన రాష్ట్రానికి వస్తుంటారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు.. అటువంటి నాన్ రెసిడెన్సీ ఆంధ్రాస్ కు, ఈ గడ్డ మీద పుట్టి, ఇక్కడే మీ మధ్య ఉంటూ మనకు మధ్య ఈ యుద్ధం జరగబోతుందని తెలిపారు. మరోవైపు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన రైతులకు ఏమైనా చేశారా అంటూ దుయ్యబట్టారు. అక్కాచెల్లెమ్మలకు కనీసం ఒక్క పథకమైనా పెట్టారా.. బడికి వెళ్లే విద్యార్థులకు ఏమైనా చేశారా అంటూ మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు పాత ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే జరిపారు
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో పాత ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే జరిపారన్నారు. ప్రభుత్వం ఏమి చేయదల్చుకుందో నిర్దిష్టంగా చెప్పలేదని, మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు 100 రోజుల్లో కాదు..72 రోజుల్లోనే అమలు చేయలేమని చేతులు ఎత్తేసిందన్నారు నిరంజన్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడు తుంటే ఆరుగురు మంత్రులు కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి..
రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
57 నెల్లలో కనివినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ పథకాలను ప్రజలకు చెప్పాలని వాలంటీర్లకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు చెప్పారు. ఐదేళ్ల కిందట టీడీపీ పాలన, ప్రస్తుత వైసీపీ పాలన గురించి ప్రతి ఇంటికి వివరించాలని కార్యకర్తలకు సీఎం సూచించారు. 125 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో జగన్ మార్క్ కనపడుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆశీర్వదిస్తేనే ఇంత మంచి చేయగలిగామన్నారు. రెండు, మూడు, నాలుగో సారీ గెలిపిస్తే ఎంత మంచి జరుగుతుందో అందరికీ వివరించాలని కోరారు.
“గృహిణి విలువ ఎంతో ఉన్నతం”.. ఆమె జీతం తెచ్చే ఉద్యోగి కన్నా తక్కువేం కాదు..
ఒక కుటుంబంలో జీతం తీసుకువచ్చే ఉద్యోగి ఎంత ముఖ్యమో, గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కుటుంబాన్ని చూసుకునే స్త్రీ విలువ చాలా ఉన్నతమైందని, ఆమె పని అమూల్యమైనదని పేర్కొంటూ.. ఆమె సేవల్ని డబ్బుతో లెక్కించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక మోటార్ ప్రమాదం కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచింది.
వాహన ప్రమాద కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు నష్టపరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఇంట్లో గృహిణి విధులు చాలా ముఖ్యమైనవి, ఆమె చేసే కార్యకలాపాలను ఒక్కొక్కటిగా లెక్కించినట్లైతే వాటి విలువ అమూల్యమైందిగా ఉంటుంది, ఆమె ఇచ్చి సహకారం చాలా ఉన్నతమైందని, అందులో ఎలాంటి సందేహం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. 2006 ప్రమాదంలో మరణించిన మహిళకు మెరుగైన పరిహారాన్ని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఏఎఫ్ జవాన్‌ని గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు..
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) 4వ బెటాలియన్‌కి చెందిన తిజౌ రామ్ భూర్యను కిరాతకంగా చంపారు. ఇతను కంపెనీ కమాండర్‌గా పనిచేస్తు్న్నాడు. నక్సలైట్లు భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన బీజాపూర్‌లో చోటు చేసుకుంది.
జిల్లాలోని మార్కెట్‌లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో నక్సలైట్లు దాడి చేయడంతో శనివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఉదయం 9:30 గంటలకు ఈ దాడి జరిగింది. ఘటన తర్వాత సీఏఎఫ్ బృందం భద్రత కోసం గ్రామ మార్కెట్‌లో మోహరించి గస్తీ నిర్వహిస్తోంది. ఘటన అనంతరం అధికారులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. గత నెల, రాష్ట్రంలోని సుక్మా ప్రాంతంలో నక్సలైట్లు జరిపిన దాడిలో ముగ్గురు CRPF జవాన్లు మరణించారు మరియు 14 మంది గాయపడ్డారు. టేకుల గూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఎన్నికలయ్యాక టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు..
ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా ఒకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
పొత్తులపై చర్చలకు అధిష్టానం పిలిస్తే కలుస్తాం..
ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.
ఈ సమావేశాల్లో పార్టీ 10 సంవత్సరాలు ఏం చేసింది.. ఏం చేయాలన్న దానిపై చర్చ జరిగిందని తెలిపారు. ఈరోజు ప్రధాని మంత్రి సందేశాలు, మార్గదర్శకాలు ఇచ్చారని పేర్కొన్నారు. గత 70 ఏళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయిన పలు సమస్యలను.. గత పదేళ్ళలో చేయగలిగామని ప్రధాని మోడి చేసిన ప్రసంగంలో సవివరంగా ప్రస్తావించారు. లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళి, ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తన రఫున ప్రణామాలు తెలియజేయమని ప్రధాని మోడీ సూచించారు. మోడీ సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్తామన్నారు. మరోవైపు.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల ప్రభావం ఏపీలో కూడా ఖచ్చితంగా, గణనీయంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పురంధేశ్వరీ చెప్పారు.
మేడారం జాతరకు కరీంనగర్ నుంచి 850 ప్రత్యేక బస్సులు
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నిర్ణయించింది. ఆర్టీసీ రీజియన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 850 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మేడారం ప్రత్యేక బస్సు సర్వీసుల శిబిరంలో రీజనల్ మేనేజర్ ఎస్ సుచరిత బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం నుండి ఫిబ్రవరి 25 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు 24 గంటలూ నడపబడతాయి.
మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాల కారణంగా మేడారంకు ఎక్కువ మంది మహిళా భక్తులు వస్తారని వారు ఆశిస్తున్నారని ఆమె చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పెద్దలు మరియు పిల్లలకు వేర్వేరు ధరలను కార్పొరేషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ఆర్టీసీ ప్రత్యేక బస్సు క్యాంపుల వద్ద తాత్కాలిక షెల్టర్లు, క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సహాయం వంటి విస్తృత ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ రీజినల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్ భూపతి రెడ్డి, డిఆర్‌ఎం (మెకానికల్ కె సత్యనారాయణ, మేనేజర్లు ఎల్ మల్లేశం (కరీంనగర్-1 డిపో), వి మల్లయ్య (కరీంనగర్-2 డిపో) తదితరులు పాల్గొన్నారు.