స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్‌ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆసియా ఛాంపియన్‌షిప్ 2024 ఫైనల్‌లో, నాల్గవ క్వార్టర్‌లో మొదటి గోల్ చేయడం ద్వారా భారత హాకీ జట్టు చైనాపై 1-0 ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ భారత్ తరఫున ఈ గోల్ చేశాడు. ఈ విధంగా మూడు క్వార్టర్ల తర్వాత ఒక గోల్ చేసి భారత్ ఫైనల్‌లో ముందంజ వేసింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, చైనాల మధ్య మూడు క్వార్టర్ల పాటు టై అయినప్పటికీ, నాలుగో క్వార్టర్ 7వ నిమిషంలో జుగ్రాజ్ సింగ్ అద్భుతమైన పాస్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. దీని తర్వాత నాలుగో క్వార్టర్ మిగిలి ఉన్న సమయంలో టీమిండియా ఆటగాళ్లు చైనాకు పునరాగమనానికి అవకాశం ఇవ్వలేదు. తద్వారా భారత హాకీ జట్టు ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చైనాకు రజత పతకం దక్కనుంది. 2024 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కడియం కావ్య
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య రోగిని తీసుకుని నేరుగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఫార్మసీ కేంద్రానికి చెరుకుని పేషెంట్లకు ఇస్తున్న మందులను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలను రిజిస్టర్ ను పరిశీలించారు. ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయో ఎంపీ స్వయంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల వివరాలను సేకరించారు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వలన క్షుణంగా మెడిసిన్స్ గురించి, సీడిఎస్ నుండి రావలసిన మందుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం ఆదేశం
నీరు-చెట్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీరు-చెట్టు పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌లు కలిశారు. ఈ క్రమంలో దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లుల విడుదలపై కీలక నిర్ణయం వెలువడింది. పెండింగులో ఉన్న నీరు-చెట్టు నిధుల దఫాల వారీ విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో రూ. 259 కోట్ల మేర పెండింగులో ఉన్న నీరు-చెట్టు బిల్లులను విడుదల చేయాలని సీఎం సూచించారు. పెండింగులో ఉన్న మరిన్ని బిల్లులును కూడా త్వరితగతిన దశలవారీగా విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.
విశ్వకర్మ రూపంలో మోడీ.. కార్యకర్తలు పూజలు
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా పండుగలా నిర్వహించారు. అన్నదానాలు, రోగులకు పండ్లు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా ఒకెత్తు అయితే బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ శ్రేణులు.. విశ్వకర్మ రూపంలో ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మగా మోడీ ఫొటోను రూపొందించి వేద పాఠశాలలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాని మోడీ భారతదేశానికి మోడరన్ విశ్వకర్మగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆయా విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్‌పై రేపు చర్చలు
పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ విషయానికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో బుధవారం నాడు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ సంఘం ప్రతినిధులకు మంగళవారం సాయంత్రం సమాచారాన్ని అందించారు. ఈ సమావేశానికి ముందు ఈ విద్యా సంవత్సరంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్వహించిన పీజీ నీట్ పరీక్షలో అర్హత పొందిన ప్రభుత్వ ఎంబీబీఎస్ డాక్టర్ల వివరాల్ని కూడా తెలియజేయాలని సంఘం ప్రతినిధుల్ని కమిషనర్ కోరారు. ఈ ఏడాది ఇన్‌సర్వీస్ రిజర్వేషన్ కింద పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొంది పీజీ పూర్తి చేసుకుని, 2027లో వీరంతా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆ సమయానికి వివిధ స్పెషలిస్ట్ విభాగాల్లో లభ్యం కానున్న ఖాళీలపై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మదింపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పీజీ నీట్ పరీక్షలో అర్హత పొందినవారి సమాచారం మేరకు పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లను పరిశీలించి పరిష్కరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ఆరంభించడం హర్షనీయం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్స్ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి అర్హతకు అనుగుణంగా కల్పించాలని భావనతో సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం గా ఆరంభించడం హర్షనీయమన్నారు. గల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం కొరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు జీవన్ రెడ్డి. దశబ్దకాలం బీఆర్ఎస్ ప్రభుత్వమీదే ఉండే అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భిన్న అభిప్రాయం లేదన్నారు జీవన్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆలోచన విధానాన్ని రాజకీయాలకు అతీతంగా సమర్థించాలి కానీ విమర్శలు చేయకూడదన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీలకు నిధులు మంజూరయ్యాయి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు జీవన్ రెడ్డి.
మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు
ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నామని, ఈ మేరకు బీసీ ప్రొటెక్షన్ చట్టం రూపకల్పనపై సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి సవిత వెల్లడించారు. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారన్నారు. వంద మందితో ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు విడుదలకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదల నిర్ణయం తీసుకున్నామన్నారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు.. వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్ మెటిరీయిల్ కోసం రూ.25 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హాస్టల్‌లో డిజిటిల్ కంటెంట్‌తో విద్యా ప్రమాణాల పెంపుదలకు ఎస్‌ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పుల నిమిత్తం కేంద్రం వాటా రూ. 133.78 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా రూ. 89.18 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాపథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మనో కూమారులు దాడి వెనుక కుట్ర.. బయటకు షాకింగ్ వీడియోలు
గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ అలపాక్కంలోని మధురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేయబడి జైలులో ఉన్నారు. మనో ఇద్దరు కుమారులు సహా ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో మనో కుమారులకు, ఫిర్యాదు చేసిన ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడం కలకలం రేపింది. ఫుటేజీలో, గాయకుడు మనో కుమారులు సాహిర్, రఫీక్‌లపై 4 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 16 ఏళ్ల బాలుడు సహా 10 మందికి పైగా వ్యక్తులు రాళ్లు మరియు కర్రలతో గుడ్డిగా దాడి చేశారు.
వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.. నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు
బుడమేరు వరద బెజవాడను అతలాకుతలం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన విపత్తులాంటి విపత్తును గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఊహించని స్థాయిలో వరద రావడం.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. బుడమేరు కబ్జాల వల్ల విపత్తు సంభవించిందని ఆయన అన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాక ముందే అతి పెద్ద విపత్తు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొనేలా వైసీపీ నేతలు బోట్లను వదిలారని ఆయన విమర్శించారు. కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి.. విరిగిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేసిందని.. రాజధానికి నిధులే అవసరం లేదని ప్రపంచ బ్యాంక్‌కు లేఖలు రాశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకివ్వాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను పక్క దారి పట్టించారని.. ఇలాంటివి ఎన్నో అరాచకాలను గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు. వీటిని గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. ఇవన్నీ ఉన్నా.. వరద బాధితులకు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరద బాధితులు పడిన ఇబ్బందులను.. కష్టాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. మానవ ప్రయత్నంగా ఎంత వరకు సాయం అందించగలిగామో.. అంతా చేస్తున్నామన్నారు. సహాయక చర్యలు చేపట్టిన విధానాంపై జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. దాతలు కూడా పెద్ద ఎత్తున వరద సాయం అందించేందుకు ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.
అమెరికా వెళ్లనున్న మోడీ.. క్వాడ్ సమావేశానికి హాజరు
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈసారి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మోడీ యూఎస్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21-23 మధ్య అమెరికాలో ప్రధాని మోడీ ఉండనున్నారు. క్వాడ్ మీట్‌లో మోడీ పాల్గొంటారు. సెప్టెంబర్ 21న డెలావేర్‌లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు. క్యాడ్ మీట్‌లో మోడీ పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో కూడా ప్రసంగిస్తారని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. డెలావేర్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. క్వాడ్ నాయకులు.. క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి, భవిష్యత్తు ఎజెండాను సెట్ చేయనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయం చేయడానికి రాబోయే సంవత్సరానికి ఎజెండాను నిర్దేశిస్తారు. తదుపరి క్వాడ్ సమ్మిట్‌ను భారత్ నిర్వహించనుంది.