స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు కానీ.. రైతుల్ని పట్టించుకోరా?
డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో (Delhi) నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంపై స్పందించారు.
రైతులు (Farmers Protest) కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్‌కు (MS Swaminathan) భారతరత్న ప్రకటించారు కానీ ఆయన చెప్పిన దానిని అమలు చేయడానికి మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. రైతుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని పేర్కొన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం (BJP) మాత్రం దానిని అమలు చేయడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు స్వామినాథన్ చెప్పినట్లుగా అమలు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.
“బలాన్ని ఉపయోగించడం..” రైతుల ఆందోళనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి పలు డిమాండ్లు చేస్తూ రైతులు “ఢిల్లీ ఛలో” మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రైతుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారించింది.
సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, బలప్రయోగం చివరి అస్త్రం కావాలని చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. నిరసనకారులు ఢిల్లీలోకి రాకుండా రోడ్లను దిగ్భందించాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక పిటిషన్‌లో తప్పుబట్టింది. రైతులు జాతీయ రహదారులను దిగ్భందించడం వల్ల ప్రజలు, ఇతర రోజూవారీ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని మరో పిటిషన్ ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోంది
తెలంగాణ భవన్ నుంచి ‘చలో నల్గొండ’ బహిరంగ సభకు బయల్దేరి వెళ్లే ముందు బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడలేకపోతోందన్నారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా తెలంగాణ నదీ జలాలపై కేంద్రం ఆక్రమణలకు పాల్పడుతుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే నదుల నిర్వహణను కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులకు అప్పగించింది. తెలంగాణ రైతుల భవిష్యత్తును అంధకారంలో పడేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ గళం విప్పిందని అన్నారు.
జయా బచ్చన్ మరోసారి ఛాన్స్ కొట్టేశారు
సినీ నటి జయా బచ్చన్‌కు (Jaya Bachchan) మరోసారి రాజ్యసభ సీటు దక్కింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఆమె పేరును ప్రకటించింది. జయా బచ్చన్ (75 )తో పాటు మరో ఇద్దరి పేర్లను ఎస్పీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్ (Alok Ranjan), దళిత నేత రామ్‌జీ లాల్ సుమన్‌లను (Ramji Lal Suman) ప్రకటించింది
రంజన్(67) ఐఐఎం పూర్వ విద్యార్థి.. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. కాగా సుమన్ నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఈసారి మాత్రం రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే ఈనెల 9న రాజ్యసభలో జరిగిన వీడ్కోలు ప్రసంగంలో జయా బచ్చన్ (Jaya Bachchan) కీలక ప్రసంగం చేశారు. తనకు కోపం ఎక్కువని.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. అయినా తనకు ఎవరినీ గాయపరిచే ఉద్దేశం ఏ మాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఇకపోతే బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై ఆమె ఫైరయ్యారు.
భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఒక పవిత్ర కార్యానికి #TSRTC శ్రీకారం చుట్టింది. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే సేవను అందిస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.
మేడారం మహా జాతర ఈ నెల 21 నుంచి 24వ తేది వరకు జరుగుతుండగా.. ఈ నెల 14 నుంచి 25వ తేది వరకు ఆన్‌లైన్/ఆఫ్ లైన్ లో అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ కల్పించింది. భక్తులు రూ.299 చెల్లించి సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్(కార్గో) కౌంటర్లలో, పీసీసీ ఏజెంట్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వద్ద మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. https://rb.gy/q5rj68 లింక్ పై క్లిక్ చేసిగానీ లేదా పేటీఎం ఇన్ సైడర్ యాప్ లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని ఆర్డర్ ఇవ్వొచ్చు.
కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం
మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది.. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని, రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం కరెంటు బిల్లులే ప్రతీ ఏటా రూ.10, 500 కోట్లు ఖర్చవుతోందని, ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారన్నారు రేవంత్ రెడ్డి. 2020లోనే ఈ బ్యారేజీకి ముప్పు ఉందని అధికారులు ఎల్&టీ కి లేఖ రాశారని, సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తిందన్నారు రేవంత్ రెడ్డి.
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య.. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో నేనేం తక్కువ చేయలేదని, ఎక్కడినుంచో కరెంట్ తెప్పించి విద్యుత్ కోతలు లేకుండా చేశామన్నారు కేసీఆర్. నా గడ్డ, నా ప్రజలు, నా ప్రాంతం అనుకుంటే ఏమైనా సాధించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా కలిపి మంచిగా నీళ్లు తెచ్చుకున్నామని, బస్వాపూర్ పూర్తైందని, దిండి ప్రాజెక్ట్ పూర్తి కాబోతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తైతే పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
కాలు విరిగినది అని సభకు రాలేదు.. కానీ నల్గొండకు పోయాడు
మేడిగడ్డ ప్రాజక్ట్‌ను పరిశీలించేందుకు నేడు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు విరిగినది అని సభకు రాలేదని, కానీ నల్గొండకు పోయాడంటూ విమర్శలు గుప్పించారు. కాలు విరిగిన కేసీఆర్ కి అసెంబ్లీ దగ్గరా… నల్గొండ దగ్గరా..? అని ఆయన అన్నారు. నల్గొండ దాకా పోయిన నువ్వు.. అసెంబ్లీ కి ఎందుకు రావు అని ఆయన ప్రశ్నించారు. నాలుగు పిల్లర్లు కూలితే తప్పా అంటున్నాడు కేసీఆర్ అని, నీ తప్పులకు నువ్వు శిక్ష వేసుకునే అంతటి వాడివి కాదు అని తెలుసు అని అన్నారు. కేసీఆర్ మేడిగడ్డని చులకన చేస్తున్నాడని, శాసన సభలోనే krmb మీద సలహాలు ఇవ్వండి అనే సభ పెట్టినమన్నారు. నువ్వు కూడా వచ్చి ఇవ్వాల్సిందన్నారు. మా తీర్మానం సక్కగా లేకుంటే.. మీ స్వాతిముత్యం అల్లుడు ఎందుకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. సభలో నేను అప్పుడే చెప్పిన..హరీష్ మాటకు విలువ లేదు అని, సరిగ్గా కేసీఆర్ కూడా అదే అన్నాడన్నారు. హరీష్ లాంటోళ్లకు brs లో విలువ లేదు అని నిరూపితం అయ్యిందని, సభకు వచ్చి అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోంది అని ప్రతిపాదన పెట్టు అని ఆయన అన్నారు. మేము సలహా తీసుకుంటామన్నారు. కేసీఆర్.. బెదిరించి బతకాలని చూస్తున్నాడని, నువ్వు వెంటాడితే.. మేము అల్లాటప్పగా కుర్చీ ఎక్కలేదు.. మంది పిల్లల ప్రాణాల మీద అధికారంలోకి నీలగా రాలేదన్నారు.
మాల్‌ప్రాక్టీస్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా ఇటీవల మోడీ సర్కార్ లోక్‌సభలో బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయింది. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేపర్ లీకేజీ బిల్లుకు (Malpractices Bill) ఆమోద ముద్ర వేశారు (President Droupadi Murmu ). పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు ప్రకారం.. ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారికి లేదా జవాబు పత్రాలను తారుమారు చేసిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.కోటి జరిమానా విధించబడుతుంది.
చిత్తశుద్ధితో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకోలేదని లోక్‌సభలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అక్రమార్కుల ఆట కట్టించడమే ఈ బిల్లు ఉద్దేశమని పేర్కొన్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ బిల్లు ద్వారా పోలీసులకు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. వారెంట్ లేకుండానే అనుమానుతుల్ని అరెస్ట్ చేయొచ్చు. నిందితుడికి బెయిల్‌కు అర్హత ఉండదు. అలాగే ఆరోపణలు రాజీ ద్వారా పరిష్కరించబడవు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీకేజీల కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడిన తరుణంలో.. కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.