వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకోవాలని పంట నష్టం అంచనా వేయడం కోసం కేంద్ర బృందం పర్యటిస్తోందని తెలిపారు. వరదల వల్ల చాలా కాలనీల్లో ఇళ్లు కూడా నీట మునిగాయన్నారు. ఇంటిలోని సామాన్లు వారం రోజులు నీళ్లతో నాని పనికిరాకుండా పోయాయని కేంద్ర బృందానికి బాధితులు విన్నవించుకున్నారు. రైతు సమస్యలు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు పది రోజులు ఇంటికి కూడా వెళ్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో, వారికి ఆహారం అందుతుందా లేదా అని దగ్గరుండి పర్యవేక్షించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. వరద తగ్గాక ప్రజలను సురక్షితంగా ఇళ్లకు పంపడం ఫైర్ ఇంజన్లతో బురదను శుభ్రం చేయడం అన్ని సమీక్షించి ఇంటికి వెళ్లారన్నారు. కేంద్ర బృందానికి ఇక్కడ జరిగిన నష్టం మొత్తం వివరించడం జరిగిందన్నారు. త్వరలోనే కేంద్రం నుంచి మంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుండి బయట పడలేదు
రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుండి బయట పడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని కాలేదన్న బాధతో మోడీ మీద అక్కసు తో దేశం మీద విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు రద్దు చేస్తామని అసలు రంగు బయట పెట్టారన్నారు ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్ లు పొందు పర్చిన అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని, సామాజిక పరమైన రిజర్వేషన్ లని నెహ్రూ, రాజీవ్ గాంధీ వ్యతిరేకించారన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడారని, బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్ లు రద్దు కావని అమిత్ షా స్పష్టం చేశారని, భారత వ్యతిరేకి అయిన సెనెటర్ ను రాహుల్ గాంధీ కలిశారన్నారు ఎంపీ లక్ష్మణ్.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసిన ప్రభుత్వం
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెబ్ సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సెబ్‌కు చెందిన ఫర్నిచర్, వాహనాలు, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం ఉద్యోగులను.. సిబ్బందిని సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించింది. ఇన్నాళ్లూ ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా సెబ్ పని చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా పేర్కొంటూ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండో యూనిట్‌లో ఆయిల్ సింక్రానైజేషన్ చేసామని, త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, గత ప్రభుత్వానికి యాదాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. NGT కి సకాలంలో సమాచారం ఇచ్చి ఉంటే పర్యావరణ అనుమతుల ఇబ్బంది ఉండేది కాదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే పనుల్లో వేగం పెరిగిందన్నారు భట్టి విక్రమార్క. 31 మార్చ్ 2025 లోగా అన్ని యూనిట్ లలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా పని చేస్తున్నామని, 3 యూనిట్ లలో ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు భట్టి విక్రమార్క. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తి. త్వరలో జాతికి అంకితం చేస్తామని, స్థానికులు పవర్ ప్లాంట్ కోసం తమ భూములను త్యాగం చేసారు.. వారందరికీ పరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు భట్టి విక్రమార్క.
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టెట్ వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం
డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు ఎలాంటి ఛాన్స్ లేదని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. తెలంగాణ టెట్ 2024 ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50, 491 మంది మంది అభ్యర్థులు హాజరయ్యారు. రిజల్ట్‌లో పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టీజీ డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే తాజాగా డీఎస్సీ ఫైనల్ కీ వెలువడిన విషయం విదితమే. ఇదిలా ఉండగా.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తే, తర్వాత టెట్ వివరాల అప్‌డేట్‌లో దొర్లిన తప్పులను సవరించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.
అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంతో సమానమని, సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. BRS శాసనసభ్యులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారితో సమావేశమై అసెంబ్లీ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఒత్తిడి చేశారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇకపై తమ పదవులకు రాజీనామా చేయాలని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సూచించిన వారు ఉప ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యమన్నారు. టర్న్‌కోట్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందర్ , కడియం శ్రీహరి కొత్త పతనాలకు దిగారు , వారి రాజకీయ జీవితం దాదాపు ముగిసింది. నాయకులు పేదలకు సహాయం చేసి ఆదుకోవడం కాకుండా తమ స్వలాభం కోసం పార్టీలు మారారని అన్నారు.
అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం
గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుందన్నారు. నాటి మద్యం పాలసీ వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందన్నారు. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగిందన్న ఆయన.. మంచి మద్యం పాలసీని త్వరలోనే తీసుకొస్తామన్నారు. అక్టోబర్ -1 నుంచి కొత్త పాలసీని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా పాలసీ తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రజలే రెడ్ బుక్ ఇచ్చారన్నారు. చేసిన తప్పుల నుంచి జగన్ తప్పించుకోలేరని.. కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు.చంద్రబాబు పది రోజులు కలెక్టరేట్లో ఉండి.. ఇప్పుడు మళ్లీ వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారని మంత్రి తెలిపారు.
పవన్ కల్యాణ్ ఇంటి స్థలానికి ఏలేరు ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం భారీ వర్షాలు కురవడంతో విజయవాడ వంటి పలు నగరాల్లో తీవ్రంగా వరదలు ఏర్పడ్డాయి. కొంతమంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇంట్లో ఉన్న సామాన్లతో సహా అన్నింటిని కోల్పోయారు. దీంతో కొంతమంది వరద బాధితులకు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితుడిగా మారారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వరదకు ఎఫెక్ట్ అయ్యారు. పవన్ ఇంటి స్థలం ఏలేరు వరద ముంపుకు గురైంది. పిఠాపురం వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ ఇంటి స్థలం నీట మునిగింది. ప్రస్తుతం ఆయన ఇంటి స్థలం వరద నీటితో మునిగిపోయి చెరువును తలపిస్తోంది. పవన్ ఇంటి స్థలానికి కూత వేటు దూరంలో ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చడంతో పవన్ ఇంటి స్థలం పరిసరాలు చెరువును తలపిస్తు్న్నాయి. పిఠాపురం శివారు 216 జాతీయ రహదారి పక్కన వై.జంక్షన్ వద్ద పవన్ కల్యాణ్ 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురంలో సొంత ఇల్లు కట్టుకుంటానని పవన్ గత ఎన్నికల్లో ప్రకటించారు. తాజాగా ఏలేరు వరద ప్రభావంతో ఇంటి స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.
మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభా రాణి మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి…చీరలు.. గాజులు వేసుకునే వాళ్ళు ఎవరూ చేతకాని వాళ్ళు కాదని విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని, గాజులు పెట్టుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటే నీ ఇంట్లో బిడ్డా.. భార్య ఉందని ఆమె అన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డి ది అని ఆమె మండిపడ్డారు. మహిళలను అవమానిస్తే.. చెప్పు దెబ్బలు తింటావని ఆమె ధ్వజమెత్తారు. చీర.. గాజులు ముందు కేసీఆర్..కేటీఆర్ కి పంపు అని, బీఆర్‌ఎస్ పుట్టుకనే.. ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏ లను లాక్కుని పుట్టిందని ఆమె అన్నారు. కేసీఆర్ ఏ పార్టీలో పుట్టాడు.. నీ పక్కన కూర్చున్న ఎంఎల్ఏ లు ఏ పార్టీలో పుట్టాడో తెలుసుకో అని ఆమె వ్యాఖ్యానించారు. చరిత్ర తెలవకుండ మాట్లాడకు అని, అసభ్యంగా మాట్లాడిన కౌశిక్ మీద పోలీసు లు ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళా కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేయాలని, బరితెగించి రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ కి లేదు మీలాగా అని, 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన మీకు సిగ్గు తెప్పించాలని ఎమ్మెల్యేలు బయటకు వచ్చారన్నారు.