తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు..
తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును వీరు మూసివేయించారు.
34 వేల దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్ కార్డులు ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఈసీ చర్యలు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే అన్నమయ్య కలెక్టర్ గిరీషా, అప్పటి తిరుపతి అడిషనల్ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుంది
అయోధ్య రామాలయాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కే కేశవరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాముడిని రాజకీయం చేశారని, ప్రజా సమస్యలు పక్కన పెట్టి అయోధ్య గురించి పార్లమెంట్ లో చర్చ పెట్టి తీర్మానం చేశారన్నారు. అయోధ్య రామాలయంపై పార్లమెంట్ లో తీర్మనం చేయడం తప్పు.. వ్యతిరేకిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ సభాపతి అధికారం ఉంటుంది కాబట్టి చేశారని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రామలయాన్ని రాజకీయం చేస్తున్నారని, అయోధ్య గుడికి వెళ్ళని వారు దేశ వ్యతిరేకులు కాదన్నారు కేశవరావు. అయోధ్య గుడి గురించి మట్లాడుతున్నారు..యాదాద్రి తెలంగాణ లో అతిపెద్ద దేవాలయం కానీ ఒక్క సారి కూడా ప్రధాని యాదాద్రి గురించి మాట్లాడలేదని, నేను రావణుడి గుడికి వెళ్తున్నానన్నారు.
రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు..
రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపనుంది. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి.
ఈ సందర్భంగా.. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేపు ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయని.. అవి సఫలం కాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆ చర్చల్లో ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈనెల 14న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు ఇస్తామని తెలిపారు. 15, 16వ తేదీలలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామని చెప్పారు. 17న తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహణ..
20న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 21నుండి 24 వరకు అన్ని జిల్లాల పర్యటన చేస్తామని.. 27న జరిగే చలో విజయవాడ చేస్తామని తెలిపారు.
పోలీసులు సజీవ దహనానికి ప్రయత్నించారు.. వారిని వదిలిపెట్టేది లేదు..
ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా అక్రమ మదర్సా కూల్చివేత తీవ్రమైన అల్లర్లకు కారణమైంది. కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని వ్యక్తులు అల్లర్లకు పాల్పడటమే కాకుండా, పోలీసులపై, జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. 100కు పైగా మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లకు కారణమైన ప్రధాన నిందితుల కోసం పోలీసులు, నిఘా వర్గాలు వేట కొనసాగిస్తున్నాయి.
హల్ద్వానీ ఘర్షణల్లో పాల్గొన్న నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం అన్నారు. చంపావత్ జిల్లాలోని లోహాఘాట్‌కు వెళ్లిన రెండో రోజున, మిస్టర్ ధామీ విద్యార్థులు, యువతను కలుసుకుని, సంజు-2024 కార్యక్రమానికి ముందు వారిని ప్రోత్సహించారు. ఆయన మాట్లాడుతూ.. హల్ద్వానీ అల్లర్లలో మహిళా పోలీస్ అధికారులు, మీడియా సిబ్బందితో దుర్మార్గులు అనుచితంగా ప్రవర్తించారని, వారిని సజీవ దహనం చేయడానికి యత్నించారని, దేవభూమి(ఉత్తరాఖండ్) ప్రతిష్టను దిగజార్చేందుకు తాను అనుమతించనని, దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఐసీయూలో ఉన్న రోగిని కొరికిన ఎలుకలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన సంచలనం రేపింది. రోగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స పొందుతున్నాడు. కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచిన షేక్ ముజీబ్ చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికాయి. రక్తపోటు సంబంధిత సమస్యలతో వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఎలుకలు కుట్టడంతో చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతున్నట్లు బంధువులు గుర్తించారు. వారు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయడంతో చికిత్స అందించారు. ఇతర రోగుల అటెండెంట్లు కూడా ఆసుపత్రిలో ఎలుకల బెడద గురించి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని రోగి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నేను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి చేస్తా..
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారని అన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని తెలిపారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి పాలు త్రాగి మోసం చేసినట్లేనని చెప్పాడన్నారు.
పార్టీలో ఉండి ఎవరు తప్పు చేయకూడదు.. రాజశేఖర్ రెడ్డి నేర్పిన రాజకీయమే నేను చేస్తానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో మంత్రి సురేష్ ని గెలిపించాలని ఆయన కోరారు. తాను బయట ఒకటి.. లోపల ఒకటి మాట్లాడనని అన్నారు. తన గుండెల నుంచి వచ్చే మాటలే మాట్లాడుతానని చెప్పారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలి.. సీఎం జగన్ నాయకత్వంలో అన్నీ నియోజకవర్గాల్లో గెలవాలని ఆయన కోరారు. రెండు నెలలు కష్టపడితే ఆ తర్వాత మీకోసం మేము చేయాల్సిన పనులు చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు.
బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కేటాయింపులపై హరీష్ రావు విమర్శలు
రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కేటాయింపులు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2024-25 బడ్జెట్‌లో రూ.4,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బడ్జెట్‌లో కేవలం రూ.2,200 కోట్లు కేటాయించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఆదివారం సిద్దిపేట నుంచి ఉమ్రా యాత్రకు వెళ్తున్న ముస్లింలకు హరీష్ రావు పంపిణీ చేస్తూ.. తన సొంత ఖర్చులతో ఏటా 10 మంది పేద ముస్లింలను ఉమ్రా యాత్రకు పంపిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహాలో సిద్దిపేటలో ఆధునిక హజ్ హౌస్ ఉందని హరీష్ రావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ తర్వాత హజ్ హౌస్ ఉన్న తొలి జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో హజ్ హౌస్ నిర్మించేందుకు తనకున్న మంచి కార్యాలయాలను ఉపయోగించుకున్నానని చెప్పారు.
మైనారిటీలకు ఏమైనా సహాయం కావాలంటే ఆదుకుంటామని హామీ ఇచ్చారు హరీష్ రావు.. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు తగ్గట్లుగా నిధుల కేటాయింపులు లేవని విమర్శించారు. జనవరి, ఫిబ్రవరి పింఛన్లు ఇంకా ఇవ్వలేదని హరీశ్ అన్నారు. రూ.4000 పింఛన్ అని చెప్పి.. రూ.2000 పింఛన్ కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. ‘ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీ అమలు కావాలంటే రూ.23 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో పెట్టింది 7 వేల కోట్లే. నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావన లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, కొండా సంపత్‌రెడ్డి, మచ్చా వేణుగోపాల్‌రెడ్డి, ఎండీ మోయిజ్, ఎండి జావేద్, ఎండి ఫక్రుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
మరోసారి రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ..
రేపు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించే అవకాశం ఉంది. కాగా.. ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. రేపు అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈనెల 9న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు.. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు.
దసరా నాటికి కంకోల్ పీహెచ్‌సీ ప్రారంభం
సంగారెడ్డి జిల్లాలోని కంకోల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని దసరా నాటికి పూర్తి చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మునిపల్లి మండలం కంకోల్‌లో పిహెచ్‌సికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ.. 8నెలల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించి పిహెచ్‌సిని నిర్వహిస్తామన్నారు. అందోలు నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలంలో పర్యటించిన మంత్రి పెద్ద చెల్మడ గ్రామంలో రూ.4.35 కోట్లతో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. బాలికల వసతి గృహానికి రూ.60 లక్షలు మంజూరు చేయడమే కాకుండా మోడల్ స్కూల్ మునిపల్లిలో రూ.65 లక్షలతో పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మారుమూల గ్రామాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కావాల్సిన వసతులపై వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక పాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు 1800 వ్యాధుల చికిత్స కోసం రూ.487 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, డీఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.