విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..
విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం చేస్తామన్నారు.
కేటీఆర్ కామెంట్స్‌కి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్
వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక వీలువ లేకుండ మాట్లాడుతున్నాడని, ఉద్యమ కాలం లో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, పోనీ చనిపోయిన వారికీ ఏమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలని మోసం చేసి ఇప్పడూ సుద్దపూసలాగా మాట్లాడుతున్నావ్ అని ఆయన మండిపడ్డారు. మీరు 10 ఏళ్ళ లో ఏం చేసారు, కేజీ టూ పీజీ ఏమైందని, గొర్ల దాంట్లో దోచుకున్నారు కదా అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. దళిత బంధు మీ చుట్టాలకే ఇచ్చు కున్నారని, మీరు చేసిన పాపాలు వరంగల్ ప్రజలు మరిచిపోలేదన్నారు.
క్రోని క్యాపిటల్స్ నుంచి జార్ఖండ్ ను రక్షించండి
అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి… ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాంఘర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. చిత్తార్పూర్ సీ,డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఝార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఝార్ఖండ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
నాపై తప్పుడు రాతలు రాస్తే పోలీసులు పట్టించుకోలేదు..
పోలీస్ బాస్‌లు పొలిటికల్ బాస్‌ల కోసం, పనిచేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజనీ విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలని మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఆ లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని నిర్బంధించి వేధించారన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా పెద్దిరెడ్డి సుధారాణిని నిర్బంధించి తీసుకువచ్చారని.. పోలీస్ స్టేషన్‌లు మార్చి తిప్పి కొట్టారని పేర్కొన్నారు.
ప్రతీ క్రిమినల్, రేపిస్ట్ ఎస్పీలోనే పుడుతాడు.. సీఈఓ అఖిలేష్ యాదవ్..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), దాని అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ చెప్పే ‘‘పీడీపీ’’కి కొత్త అర్థాన్ని యోగి చెప్పారు. పీడీపీ అంటే వెనకబడిని, దళిత, అల్పా సంఖ్యాకులు కాదని ‘‘ప్రొడక్షన్ హౌజ్ ఆఫ్ దంగై, అపరాధి’’( అల్లర్లు, అపరాధాలు చేసే వ్యక్తుల ప్రొడక్షన్ హౌజ్)అని యోగి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లాలోని కతేహరి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎస్పీ ఎమ్మెల్యే లాల్జీ వర్మ ఎంపీ ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. “ప్రతి క్రిమినల్, మాఫియా, రేపిస్ట్ ఈ ప్రొడక్షన్ హౌస్‌లో పుడతాడు.అఖిలేష్ యాదవ్ దాని CEO” అని అన్నారు. అయోధ్య మరియు కన్నౌజ్‌లలో అత్యాచారం కేసులలో సమాజ్‌వాదీ పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ నాయకుల్ని చూస్తే ఆడపిల్లలు భయపడుతున్నారని అన్నారు.
ఉగ్రవాదులతో పోరాడి జవాన్ వీరమరణం..
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చాస్, కొత్వాడా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2 పారా (SF)కి చెందిన ఎన్‌బీ సబ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ వీరమరణ పొందారు. సబ్-ఇన్‌స్పెక్టర్ రాకేష్ 09 నవంబర్ 2024న భారత్ రిడ్జ్ కిష్త్వార్ సాధారణ ప్రాంతంలో ప్రారంభించిన జాయింట్ సీఐ ఆపరేషన్‌లో భాగమని సైన్యం తెలిపింది. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనలో మరో ముగ్గురు కమాండోలు గాయపడినట్లు పేర్కొంది.
రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రేపటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
త్వరలోనే పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా పంపిణీ చేస్తాం….
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు. జగిత్యాల జిల్లాకు గత ప్రభుత్వ హయంలో ఏం మేలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుండి 2023 వరకు గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజలకు ఏం చేశారో జవాబు చెప్పి పాదయాత్రను మొదలుపెట్టండని, మీ ప్రభుత్వ హయంలో మిల్లర్లు కటింగ్ పేరిట రైతులను దోచుకుంటుంటే కనీసం స్పందించని మీరు, రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటే వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించని మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానం
నెల్లూరులో రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నామని వెల్లడించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు ప్లాన్ సమర్పిస్తే చాలు అని పేర్కొన్నారు. ఆ ప్లాన్ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ ప్రక్రియను సంబంధిత మున్సిపల్ అధికారులు పరిశీలిస్తుంటారని.. ప్లాన్ ప్రకారం భవనాన్ని నిర్మించకుంటే.. సంబంధిత లైసెన్స్ డ్ సర్వేయర్ లేదా ఇంజనీర్లు బాధ్యత వహించాలన్నారు.
సర్వే వల్ల సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఉండవు
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన , సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని ఆయన స్పష్టం చేశారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ఆ సమాచారాన్ని మరొకరకంగా ఉపయోగించబడదని ఆయన భరోసా ఇచ్చారు. సర్వే ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశ్యం కులాల జనాభా వివరాలను సేకరించడం, అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ అసమానతలను తొలగించడం అని తెలిపారు. ఈ సర్వే 6వ తేదీ నుండి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగనున్నది. సర్వేలో 150 నుండి 175 ఇళ్ల వరకు ప్రతి ఎన్యూమరేటరుకు కేటాయించబడ్డాయి. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు.