చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి పని చేశారు..
సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది అని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సంక్షేమ పథకాల ఫలాలు మాకు రక్షగా నిలుస్తాయి.. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ లు కూడా ప్రజల కోసం పని చేశారు అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరికి మించి, ప్రతి ఇంటికి చేరువైన ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల మనసు గెలిచారు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు
గాంధీ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో 350 నుంచి 4వందల స్థానాలు కైవసం చేసుకుని మూడోసారి ప్రధాని అవుతారని పంచాంగ కర్తలు స్పష్టం చేశారని, కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా సీట్లను మిత్రపక్షాలను కట్టబెట్టిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లా అవుతారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని, ప్రకృతి కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కష్టాలు, కరువు, ఆత్మహత్యలు అని సుభాష్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా తయారైందన్నారు.
వాలంటీర్లను టీడీపీ ఐదేళ్ల పాటు ఎంతో అవమానించింది..
వాలంటీర్లు అనే వారు లేరు.. ఇప్పుడు వారంతా పార్టీ కార్యకర్తలే అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వాలంటీర్లు అంతా రిజైన్ చేసారు.. గతంలో కూడా పార్టీ ఆశయాలు నమ్మే కుటుంబం నుంచి వచ్చినవారే .. టీడీపీ ఎన్ని అవమానాలు చేసిన ఐదేళ్లు నిలబడి పని చేశారు.. అప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికలయ్యాక.. రిజైన్ చేసిన వారందరిని తిరిగి వాలంటీర్లుగానే నియమిస్తాం.. ఎవరు టెన్షన్ పడొద్దని ఆయన తెలిపారు. వైసీపీ కార్యకర్తలుగానే పని చేయండి.. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ రేట్లను పెంచం అంటున్నారు.. అంటే ఉన్న రేట్లే ఉంటాయిగా ఇక మీకు మాకు తేడా ఏంటి అన్నారు. ఆరు నెలల క్రితం వైసీపీ ఓడిపోద్దన్నారు.. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగినా 110 సీట్లు వస్తాయనే స్థాయికి వచ్చామన్నారు.. ఇంకా 30 రోజుల సమయం ఉంది.. మరిన్ని సీట్లు పెరుగుతాయని మంత్రి ధర్మన ప్రసాద్ రావు వెల్లడించారు.
జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ అది, గెటప్ శ్రీను, 30 ఇయర్స్ పృథ్వి
ఏపీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లు దక్కించుకొని ప్రభుత్వంలో భాగంగా కావాలని భావిస్తోంది జనసేన పార్టీ. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు బిజెపితో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ తన స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేయడమే కాదు మరో 20 ఎమ్మెల్యే సీట్ల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపారు. కొన్ని ఎంపీ సీట్లు నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్లుగా ఎవరు ప్రచారం చేస్తారు అనే విషయం మీద ఈ రోజు అధికారికంగా ప్రకటన చేసింది జనసేన పార్టీ.
సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందన్నారు. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడు అయ్యింది.. ప్రజాగళంకు వారాహి తోడు అయ్యింది.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు.. గ్లాసు జోరుకు అడ్డు లేదు అని పేర్కొన్నారు. సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి పవన్.. ఓటు చీలనివ్వను అన్న మాటను పవన్ నిజం చేశారు.. కూటమిగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తే వైసీపీకి డిపాజిట్లు రావు అని ఆయన చెప్పుకొచ్చారు. మీరు ( ప్రజలు ) కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కి పారిపోతాడు.. ఈ విధ్వంస పాలన కావాలా.. అభివృద్ధి పాలన కావాలా మీరే ఆలోచించుకోండి.. పది ఇచ్చే వంద దోచేసే దొంగలు కావాలా.. సంపద సృష్టించే పాలన కావాలా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
రేగా కాంతారావును కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. రేగా కాంతారావు ను కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా అని ఆమె అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారని అంటున్న రేరా కాంతారావు చేసింది ఏమిటి… నువ్వు ఫిరాయిస్తే అభివృద్ధి కోసం వేరే వాళ్ళ పై విమర్శలు చేసే అర్హత రేగా కాంతారావు కు లేదని ఆమె అన్నారు. గతంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు అభివృద్ధి కోసం వెళ్లినట్లు చెప్పారని, మరి ఇప్పుడు మా వైపు వచ్చే వారు కూడా అందుకే వస్తున్నట్లు కదా అన్నారు. వారు చేస్తే నీతి… ఇతరులు చేస్తే రోత అవుతుందా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
మతం వ్యక్తిగతం.. జనహితమే సమ్మతం.!
భారత రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశం. ఇందులో మొదటిదైన లౌకిక అనే పదానికి విస్తృత అర్థాన్ని ప్రబోధించారు రాజ్యాంగకర్తలు. మతం అనేది వ్యక్తిగతం, ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించొచ్చు, దాన్ని ఆచరించవచ్చు. కానీ ఇతరుల మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వారి మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు. ఇదే రకంగా ప్రభుత్వం కూడా అన్ని మతాలనూ సమ దృష్టితో చూడాలి. అదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు. మతం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రం. ఈ సూత్రాన్ని తూ.చా.తప్పకుండా పాటిస్తున్నారు చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఉగాది పర్వదినాన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో కుటుంబ సభ్యలతో కలిసి పూజలు జరపటం ద్వారా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆయన… అదే రోజు సాయంత్రం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇఫ్తార్ వేడుకల్లోనూ పాల్గొని పరమత సహన సూత్రానికి ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పారు.
గణేష్ గడ్డ బీఆర్ఎస్‌కు కలిసి వచ్చిన అడ్డా..!
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి, పటన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అడ్డ అని ఆయన అన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్ లో ఎగురుతుందని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు లో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు లేసిందో.. అంతగా తుస్సుమనిపించిందన్నారు. వందరోజుల్లో హమీలు నెరవేరుస్తామని చెప్పినా ఇప్పటికీ ఎలాంటి హమీలు నెరవేరలేదని, ఇప్పటికే పేద మహిళలకు ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి 42లక్షల మందికి బాకీపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.
కాకర్ల సురేష్కి అడుగడుగునా నీరాజనాలు పలికిన ప్రజలు..
కలిగిరి పట్టణంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కలిగిరి ప్రధాన రహదారి వెంబడి ప్రచారం నిర్వహించారు. ప్రతి షాపు దగ్గరకు వెళ్లి తెలుగుదేశాన్ని ఆదరించాలని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ప్రచార రథం పై అభివాదం చేస్తూ ప్రధాన రహదారుల వెంబడి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. సాగునీరు లేక బంజర భూముల సైతం బీడు భూములుగా మారాయన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ , మరియు సోమశిల హై లెవెల్ కెనాల్ ద్వారా నీటిని ఉదయగిరి ప్రాంతానికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు డమ్మీలే
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం రాహుల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడని, బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం….. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని, టెట్ పరీక్ష ఫీజ్ ఏంటనే తగ్గించాలనీ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. 1500లకు పై చిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి అని గతంలో మాట్లాడారు…. ఇప్పుడెందుకు 560 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేశారో చెప్పాలన్నారు బాల్కసుమన్.
గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. 92 వేల మంది మెయిన్స్ కు ఎంపిక..!
తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ఆన్లైన్ వేదికగా ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ కు క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో నేడు ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు గాను మొత్తం 92,250 మంది అభ్యర్థులను ఎంపిక చేసారు అధికారులు. ఫిబ్రవరి 25 2024న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్షా కోసం అప్లై చేసుకున్న వారిలో వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను అధికారులు రిజెక్ట్ చేశారు.
చంద్రబాబుకు ఓటేస్తే.. పేదలకు అందే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి..
మేమంత సిద్ధం సభ జనసముద్రంగా మారిందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సిద్ధం సిద్ధం అంటూ ప్రజల నినాదాలు వైసీసీ జైత్రయాత్రకు శంఖారావంలా వినిపిస్తున్నాయి.. ప్రజలు చేస్తున్న సిద్ధం సిద్ధం అనే నినాదం ప్రతిపక్షాలకు యుద్ధం యుద్ధం అన్నట్లు ఉంది.. ప్రజల అభివృద్ధిని చీకటిలోకి తీసుకు వెళ్లాలని ఆలోచనతో జిత్తుల మారి పొత్తులు.. ఎదుర్కోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలి.. మే 13న జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎన్నుకునే ఎన్నికలు కాదు.. మన తల రాతలను మనమే నిర్ణయించుకునే ఎన్నికలు అని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు జరిగే ఎన్నికలు కాదు.. పేద ప్రజలకు చంద్రబాబుకు జరిగే ఎన్నికలు.. పేద ప్రజల పక్షాన జగన్ గా నేను పోటీ చేస్తున్నాను అని సీఎం జగన్ అన్నారు.