విశాఖలో కుండపోత వర్షం.. ప్రమాదకర స్థితిలో ఇళ్లు
విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో.. కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపాలపట్నంలో భారీ వర్షాలకు ఇళ్లు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 ఇళ్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్ల కింద మట్టి జారిపోతుండటంతో ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో.. అక్కడి వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోపాలపట్నం, రామకృష్ణ నగర్, కాళీమాత టెంపుల్ వెళ్లే మార్గాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షల కారణంగా కొండ చర్యలు విరిగి పడి డేంజర్ జోన్గా మారింది. దీంతో.. మట్టి కరిగిపోతే 50 అడుగుల లోతులో పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో.. కొంతమంది నివాసితులను అప్రమతం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకి తరలించారు అధికారులు. కొందరేమో.. ప్రమాదమని తెలిసినా ఇంకా ఇళ్లల్లోనే ఉన్నారు. మరోవైపు.. చిన్నారులు, వృద్దులు భయాందోళనకు గురవుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదు..
అమీన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్‌పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో.. ఇవాళ కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మరోవైపు.. మల్లంపేట చెరువులో విల్లాలు నిర్మించిన విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చిన బల్డింగ్కు తనకు సంబంధం లేదన్నారు. అమీన్‌పూర్‌లో తనకు ఎలాంటి స్థలం లేదని చెప్పారు. తన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించానని.. తనకు సంబంధం లేని ఇష్యూలో ఇరికించాలని చూస్తున్నారని కాటసాని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులు తన భూమి ఎఫ్టీఏ (FTA) పరిధిలో లేదని చెప్పారని ఆయన చెప్పారు. అధికారులు ఎఫ్టీఏ పరిధిలో ఉందని నోటీసు కూడా ఇవ్వలేదని అన్నారు.
హైడ్రా కీలక నిర్ణయం.. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోం
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని హైడ్రా ప్రకటించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామని హైడ్రా పేర్కొంది. ఇప్పటికే నిర్మించి నివాసం ఉండే ఇళ్లను కూల్చమని హైడ్రా వెల్లడించింది. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అయితే.. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు , లేఅవుట్లు హైడ్రా తొలగించింది. హైదరాబాద్ ట్రైసిటీలోని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు, పాటు లేఅవుట్లను హైడ్రా విభాగం ఆదివారం కూల్చివేసారు. హైదరాబాద్ ట్రై సిటీ పరిధిలో ని చెరువుల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలపై హైడ్రా విభాగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హైడ్రా విభాగం అధికారులు స్థానిక రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్ లోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నటువంటి నాలుగు అంతస్తులు , రెండు అంతస్తుల భవనాలు , ముప్పైకిపైగా షెడ్ లను అధికారులు కూల్చివేసి పది ఎకరాల చెరువు భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనాని తమకు అప్పగించాలని పలువురు బంగ్లా నేతలు భారత్‌కి అల్టిమేటం విధిస్తున్నారు. స్థాయి మరిచి భారత్‌ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరుతున్నాయి.
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది చేతకాని ప్రభుత్వం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వదిలి చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు. బాధితుల్లో రోజులు గడుస్తున్న కొద్దీ భయం పెరుగుతోందని కన్నబాబు పేర్కొన్నారు. 45 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ ఫెయిల్యూర్ అని అన్నారు. వెలగలేరు దగ్గర DE గేట్లు ఎత్తుతామని రెవెన్యూ అధికారులకు చెప్పామని అంటుంటే కలెక్టర్ సమాచారం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. వరదలపై ప్రభుత్వం ఒక్క రివ్యూ అయినా సీఎం చేశారా..? అని ప్రశ్నించారు. సినీ నటి గురించి ఆరా తీసిన సీఎంఓ వరదల గురించి ఆరా తీయలేదా అని విమర్శించారు. వరదలు, భారీ వర్షాలను ప్రభుత్వం తేలికగా తీసుకున్నట్టు అర్ధం అవుతుందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
బీజేపీకి మిగతా పార్టీలకు తేడా ఉంది
హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మభ్యపెట్టి, ఆశపెట్టి సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీ మిగతా పార్టీలకు తేడా ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ కన్నా.. దేశమే గొప్పదని చెప్పే పార్టీ కేవలం బీజేపీ మాత్రమే అని, దేశ హితం కోసం ఆన్నాడన్నారు. భారతీయ జనసంఘ్ ను జనతా పార్టీలో మెర్జ్ చేశామని, రెండు ఎంపీ స్థానాలు గెలిచిన రోజు అవహేళన చేశారు.. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఏలేరు వరదపై డిప్యూటీ సీఎం సమీక్ష.. కాకినాడ కలెక్టర్కు కీలక ఆదేశం
ఏలేరు వరదపై డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్కి ఇప్పటికే 21 టీఎంసీలకు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయిన సహాయక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కొల్లు రవీంద్ర
కనీవిని ఎరుగని రీతిలో బుడమేరుకు వచ్చిన వరద.. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలను అతలాకుతలం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 7రోజులుగా అనేక ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయన్నారు. వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల ఆక్రమణలు , మట్టి దోపిడీతో.. బలపరచాల్సిన బుడమేరు గట్లను బలహీనపరిచారని ఆరోపించారు. విపత్తుల వేళ ప్రజల వద్దకు వచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. వరద ప్రభావంలో నష్టపోయిన అందరిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను సాధారణ స్థితికి తేవడానికి 7రోజులుగా సీఎం విజయవాడలోనే ఉన్నారని తెలిపారు. కూటమి నేతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి…సేవలు అందించడం అభినందనీయమన్నారు.
ఏపీకి పొంచి ఉన్న మరో గండం.. 24 గంటల్లో తీవ్ర వాయుగుండం..!
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని.. రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒడిశాలోని పూరీ, పశ్చిమ బెంగాల్ లోని దిఘా మధ్య ఇది తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా వేసింది. కాగా.. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదుపుతప్పి కారు బోల్తా.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం హులేబీడు సమీపంలో జైలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆదోని ఆసుపత్రికి తరలించారు. బళ్లారి నుంచి ఆదోని వెళ్తుండగా టైరు పంచర్ కావడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఆదోనికి చెందినవారు కాగా.. గౌస్(మెస్త్రీ), శమీరా, నస్రీన్ గా గుర్తించారు. అయితే.. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.