దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోరిన కొరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని, గత ప్రభుత్వం హయంలో దేవాదాయ శాఖలో మితిమీరిమ అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. దేవుడిమాన్యాలు కుడా ఖబ్జాకు పెట్టారని, దేవాలయాలలో దేవుడి మాన్యం భూములు ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నామన్నారు కొండా సురేఖ. సర్వే చేసి హద్దులు ఎర్పాటు చేసి దేవుడి పేరు మీదే పట్టాపాసు బుక్కులు ఇస్తామని, తిరుమల తిరుపతి దేవస్తానం నుండి నిధులు తీసుకువచ్చి,దాతల సహాకారంతో దేవాలయాలు అభివృద్ధి చేస్తామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాలులు, వేడితీవ్రతకు జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇంకా రెండు మూడు రోజుల్లో ఎండలు మండిపోవచ్చని అంటున్నారు వాతావరణ నిపుణులు. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మార్చి చివరి నాటికే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఇది సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికం. కొన్ని చోట్ల ఏకంగా 43 డిగ్రీలు నమోదవుతోంది. రాత్రి పొద్దుపోయాకా కూడా చల్లబడడం లేదు. ఫలితంగా ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీని కలిసిన వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్‌తో సహా బీజేపీ ప్రతినిధి బృందం ఉన్నారు.
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్యను మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కడియం కావ్య పేరును కొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. ఇవాళ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. పొలం భాట కార్యక్రమం పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె మండిపడ్డారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని ఆమె ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకునెందుకు కేసీఆర్ ప్రయత్నమని ఆమె విమర్శించారు.
నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం
ఏపీ ఎన్నికల హడావుడిలో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ఏపీ పొలిటికల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ఒక జనసేన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొందరు తనను బ్లేడ్‌తో కట్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కిరాయి మూకలు ఏం చేస్తున్నారంటే ఎక్కువమంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి సెక్యూరిటీ వాళ్ళని నన్ను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, కొన్ని విషయాలలో మనం ప్రొటోకాల్ పాటించాలి అని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. జనసేన- టీడీపీ- బీజేపీ- కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
మంచి ఎండకాలంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వైపు భానుడు భగభగమండిపోతున్నాడు.. ఇంకోవైపు నేతల మాటలు కూడా హీట్ పెంచేస్తున్నాయి. అధికార-ప్రతిపక్ష నాయకులు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. కొందరు హాట్.. హాట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీకి 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని పువ్వు పార్టీ నేతలు కోరారు.
ప్రజల తిరుగుబాటుతో మాట మార్చారు.. పెన్షన్ల పంపిణీని ఎవరూ ఆపలేరు..
టీడీపీ అధినేత చంద్రబాబు మాట మార్చి మాట్లాడే నేర్పరి అని, దిగజారి మాట్లాడతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పెన్షర్ల పొట్ట కొట్టారని చంద్రబాబు సిగ్గులేకుండా అంటున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాలంటరీలు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. వాలంటరీలు వద్దు అని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. దగ్గుబాటి పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేష్ ఎవరో ప్రజలకు తెలియదా అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి నిమ్మగడ్డ రమేష్ చేసిన వేషాలు ప్రజలు చూడలేదా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ మాకు ఏమి సంబంధం లేదని బుకాయిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రైతుల దగ్గరకు వచ్చాడు
కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రైతుల దగ్గరకు వచ్చాడని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రైతులను ఎప్పుడు అదుకోలేదన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరలకు కరెంట్ కొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, వై ఎస్ పాలన లో రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉండేవి పట్నన్నిటిని తొలగించి కేవలం రైతుబంధును పెట్టి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమన్నారు. మేడిగడ్డ పొంగిపోయిన సమయంలో బి ఆర్ఎస్ అధికారంలో ఉందని ఆమె అన్నారు.
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్.. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్ బాషా.. టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చాంద్ బాషా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అయిన అత్తార్ చాంద్ బాషా.. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం చాంద్ బాషాకు మొండి చేయి చూపింది. మరో అభ్యర్థి వెంకటప్రసాద్ టికెట్ కేటాయించడంతో.. అసంతృప్తితో ఉన్న చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు.
అధిక ఉష్ణోగ్రతలపై సీఎస్ సమీక్ష
ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్రాగు నీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ఈ రెండు మాసాల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లలో 45 డిగ్రీలకు ఉష్టోగ్రతలు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు.