గుడ్ న్యూస్.. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ డా. బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను https://employment.ap.gov.in/ వెబ్ సైట్‌లో మార్చి 1 నుంచి 24 వరకు అర్హులైన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 6 మే, 2024న రాత పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగ అర్హతలు, వయస్సు, ఖాళీల వివరాలు, పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ సంబంధిత వెబ్ సైట్‌లో పొందుపరచడం జరిగిందని వెల్లడించారు.
గృహజ్యోతి ప్రారంభం.. అర్హులకు జీరో బిల్లులు
200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ‘గృహ జ్యోతి’ పథకం అమల్లోకి రావడంతో తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు శుక్రవారం నుంచి అర్హులైన కుటుంబాలకు ‘జీరో బిల్లులు’ జారీ చేయడం ప్రారంభించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ప్రజల ఇళ్లకు వెళ్లి ‘జీరో బిల్లులు’ జారీ చేయడం కనిపించింది. తెల్ల రేషన్ కార్డులు (బీపీఎల్ కుటుంబాలు) కలిగి ఉండి, ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి, ప్రజాపాలన సమయంలో పథకానికి దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు వారి నెలవారీ వినియోగం 200 యూనిట్లలోపు ఉంటే ‘జీరో బిల్లులు’ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నా కుమార్తెను ఎన్నికల్లో గెలిపించండి..
దయచేసి తన కూతురు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో నూతన సచివాలయం, పాలశీతలీకరణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఇప్పుడు తన మైండ్ ఫ్రీ అయిపోయిందని.. తాను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదని, ఎవరికీ తలవంచననని నారాయణ స్వామి అన్నారు. తనకు మంచి జరిగినా, చెడు జరిగిన నారాయణస్వామి డబ్బు తీసుకొని పనిచేశాడని ఎవరూ చెప్పలేరన్నారు. అలా ఎవరైనా డబ్బు తీసుకున్నానని చెప్పమనండి.. తాను, తన కుమార్తె కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన అన్నారు. సీఎం జగన్ తన కోరికను తీర్చాడని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. తన కుమార్తె బాగా చదువుకుందని.. నీతిమంతురాలుగా ఉంటూనే ఎమ్మెల్యేగా పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా అయిన ఒక సంవత్సరం లోపల నీతివంతురాలా కాదా అని తేలిపోతుందన్నారు. ఒకవేళ ఆమె అవినీతి వంతురాలైతే నేనే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయిస్తానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.
రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ధృవీకరించిన సీఎం సిద్ధరామయ్య..
బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో ఈ రోజు మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. ప్రముఖ ఫుడ్ జాయింట్‌గా ఉన్న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 9 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాంబ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.
సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ వదిలేసినట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈ బ్యాగ్ పేలుడుకు కారణమైననట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తు్న్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర హోం మంత్రి సంఘటనా స్థలానికి వెళ్తున్నట్లు సీఎం వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేలుడు సంభవించిందని సీఎం అన్నారు. కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీఎం, హోంమంత్రికి పూర్తి సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకోసం ఉచిత శిక్షణ
15 రోజుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నిపుణులైన లెక్చరర్ లతో పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ భట్టి విక్రమార్క. ప్రశ్నాపత్రాలు లీకులు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. బడ్జెట్ పెట్టే సమయంలో పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలన్నీ గుర్తుచేసుకొని కేటాయింపులు చేశానన్నారు. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నాటి నుంచి డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వడ్డీ మాఫీ చెక్కులను అందించేందుకు భారీ సభ నిర్వహించాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలను మహాలక్ష్మిలుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
వైసీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి
పులివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. 27 ఏళ్లు టీడీపీకి పని చేశానని.. కష్టపడి పులివెందులలో టీడీపీని నిర్మించానని.. తన కష్టానికి ఫలితం ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీని వదిలి బయటకి వచ్చానన్నారు. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశానని.. ఇబ్బందులు పెట్టానని.. అయినా జగన్ పెద్ద మనసుతో నన్ను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. నాలుగేళ్లు టీడీపి పట్టించుకోలేదని.. ఇప్పుడు రాయబారం పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకువస్తాం
కేటీఆర్ మల్కాజిగిరి ఎంపీ పదవి పై నిన్న సవాల్ విసరడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాం. నీకు నచ్చిన వ్యక్తి పేరు చెబితే రాజీనామా చేస్తారన్నారు. రాష్ట్రంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, భవిష్యత్తులో శిక్ష తప్పదని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కేటీఆర్ అలా మాట్లాడుతున్నట్లు ఉన్నారన్నారు. కేటీఆర్ నువ్వు ఎక్కడ ఉన్నా బేడీలు వేసి తీసుకు వస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి అవసరం లేదు కేటీఆర్… కరీంనగర్ చాలు అని, నాడు జైకా ద్వారా 4600కోట్ల రుణం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్నారన్నారు.
మమత సర్కార్.. ఇండియా కూటమిపై మోడీ ఫైర్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌కు రక్షణ కల్పించారని మోడీ ఆరోపించారు. ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
గత కొద్దిరోజులుగా సందేశ్‌ఖాలీ ఘటనతో అట్టుడుకుతోంది. భూకబ్జా, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌పై మహిళలు ఆరోపణ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా బీజేపీ కూడా ఆందోళనలు చేపట్టింది. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. మొత్తానికి షాజహాన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది.
కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తా..
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
ఈ అయిదేళ్ల కాలంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని సుమారు పది సార్లు సందర్శించానని.. ఇక్కడ ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నానన్నారు. ఇటీవల విశాఖ-కిరాండాల్ ఎక్స్ ప్రెస్‌ను శృంగవరపుకోటలో ఆగే విధంగా సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ రైలును ఇక్కడ ఆపేలా చేశానన్నారు. పెందుర్తి బొడ్డవర వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర పధకాల ద్వార జలజీవన్ మిషన్ ద్వారా త్రాగు నీరు, సోలార్ విద్యుత్ వెలుగులు అందిస్తున్నామని, అదేవిధంగా ఇక్కడి స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్!
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్‌ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ముద్రగడ కుటుంబాన్ని పార్టీనలో చేర్చుకుని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. వంగా గీతకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించే ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
త్వరలోనే రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్
త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని అన్నారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వాళ్ల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు సూచనలు అందిస్తుందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టి ముచ్చటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ ను తెరిచామని, ప్రజా భవన్ ను ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనువుగా అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందుకే ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పరిస్థితి, సాగునీటి రంగం పరిస్థితి పై పూర్తి వివరాలతో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు