ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం:
మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. పెద్ద బండరాయిని ఢీ కొట్టి బస్సు నిలిచిపోవడంతో 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ కు పెళ్లి బృందం వెళ్లి వస్తుండగా అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. చక్రాలు లోయలోకి వెళ్లిపోవడంతో డ్రైవర్ సీట్ నుంచి ఒక్కొక్కరుగా ప్రయాణికులు బయటపడ్డారు. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్ లో అతి ప్రమాదకరమైన ఇజ్జలూరు టర్నింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. బండరాయి 30 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది. బండరాయి ఉండటంతో 60 అడుగుల లోయ వద్ద ట్రావెల్స్ బస్సు నిలిచిపోయి ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
నేడు తాడేపల్లికి వైసీపీ అధినేత వైఎస్ జగన్:
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి.. సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వైఎస్ జగన్ చేరుకుంటారు. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. ఉదయం 11.15 గంటలకు తెనాలి ఐతానగర్ చేరుకుంటారు. అనంతరం ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు:
పుట్టిన రోజు ప్రతి ఒక్కరికి మధురమైన రోజు. స్పెషల్ డే రోజు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు, కేక్ కటింగ్స్, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం, పార్టీలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అయితే ఇటీవల బర్త్ డే సెలబ్రేషన్స్ హద్దులు మీరుతున్నాయి. నడిరోడ్లపై కేక్ కట్ చేస్తూ యువకులు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు రెక్కీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో యువకులు రోడ్డుపై బర్త్ డే వేడుకలు జరుపుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. హైదరాబాద్ లో అర్థరాత్రిళ్ళు రోడ్లపై బర్త్ డే వేడుకలు జరుపుకోవడం కొత్త ట్రెండ్ గా మారింది. ఈ వేడుకలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. దీంతో పోలీసులు, రాత్రిళ్ళు ఇలా పుట్టిన రోజు సందర్భంగా రోడ్లపై కేక్ కట్ చేయడాలు, కేకలు పెట్టడాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. ఉప్పల్‌ల్లో అర్థరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.. మరోసారి రిపీట్ ఐతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకా మీదట బర్త్ డేలు రోడ్ల పై అర్థరాత్రిళ్ళు చేశారో.. బర్త్ డే సంగతి దేవుడెరుగు.. పుట్టినరోజు నాడే పోలీసులతో తన్నులు లేదా తిట్లు దండకం వినాల్సి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త.
పట్టిస్తే రూ.25 వేల బహుమానం:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరంగా మారింది. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందరిమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని తనకు పట్టిస్తే పార్టీ నుంచి రూ.25వేలు బహుమానంగా ఇప్పిస్తానని తెలిపారు. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. హంటర్‌రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికైనా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT కాన్పూర్) నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు హాజరైన విద్యార్థుల ఫలితాలు ఈరోజు అంటే జూన్ 2, 2025న విడుదలయ్యాయి. ఫలితాలు IIT కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. విద్యార్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు, ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది. JEE అడ్వాన్స్‌డ్ ఆదివారం, మే 18, 2025న నిర్వహించారు. JEE అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్‌కు అర్హులు అవుతారు. 23 IITలు, 32 NITలు, 26 IIITలు మరియు 38 ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలకు (GFTIలు) సీట్ల కేటాయింపు ప్రక్రియను JoSAA నిర్వహిస్తుంది. ఆర్కిటెక్చర్‌ను అభ్యసించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2025 కోసం రిజిస్ట్రేషన్ జూన్ 2 నుంచి జూన్ 3 వరకు ఉంటుంది. AAT 2025 పరీక్ష జూన్ 5న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. ఫలితాలు జూన్ 8న విడుదలయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో గాలి బీభత్సం:
దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం ఢిల్లీలో మరోసారి దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. అయితే అదే సమయంలో 6E 6313కి చెందిన ఇండిగో విమానం రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి వస్తోంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. ఇంతలోనే పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. 80 కి.మీ వేగంతో గాలులు వీచాయి. దీంతో విమానం ల్యాండ్ అయ్యేందుకు కుదరలేదు. దీంతో మళ్లీ విమానాన్ని పైకి లేపాడు. ఇక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇక విమానం కుదుపులకు గురి కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురై కేకలు వేశారు. చివరికి విమానం సాయంత్రం 5.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా ఎట్టకేలకు సాయంత్రం 5.43 గంటలకు ల్యాండ్ అయింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
బలూచిస్తాన్‌పై నిషికాంత్ దూబే:
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్‌కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు. రొట్టెలకు బదులుగా బుల్లెట్ల సంప్రదాయాన్ని అనుసరిస్తున్న పాకిస్తాన్ సైన్యానికి ప్రతీ చోట తిరుగుబాటు జరుగుతోందని దూబే చెప్పారు. బలూచిస్తాన్‌లో హక్కుల కోసం జరిగే పోరాటాన్ని ఇస్లాంకు వ్యతిరేక పోరాటంగా పాకిస్తాన్ చెబుతోందని, తన దేశ పౌరులను భారత ఏజెంట్లుగా పిలుస్తోందని దూబే ఆరోపించారు. ‘‘బలూచిస్తాన్ లో జరిగే అశాంతిని భారత్ ప్రేరేపిస్తోందని, పాకిస్తాన్ ఇస్లామిక్ విశ్వాసం, సార్వభౌమత్వానికి హానికరం’’ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా ఒక లేఖను పంచుకుంది. ఇందులో బలూచిస్తాన్ అశాంతికి భారత్ కారణమని ఆరోపించింది. దీనిని దూబే షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గాజా సహాయ కేంద్రం దగ్గర కాల్పులు:
గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది. ఆదివారం దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్‌ఎఫ్) పంపిణీ కేంద్రం దగ్గర ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. పంపిణీ చేస్తున్న సాయాన్ని ప్రజలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడికక్కడే 31 మంది పాలస్తీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ట్యాంకులు.. ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించింది.
పీఎస్‌జీ ఛాంపియన్స్ విజయోత్స వేడుకల్లో ఘర్షణ:
పారిస్‌లో చెలరేగిన హింసలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.. ఇక భారీగా కార్లు, బైకులు తగలబడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఆదివారం పారిస్‌లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జర్మైన్ (PSG) క్లబ్ విజయం సాధించింది. ఇంటర్ మిలన్‌పై పీఎస్‌జీ క్లబ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్‌లపై ఏర్పాటు చేశారు. స్టేడియం వెలుపల దాదాపు 50 వేల మంది ప్రజలు గుమిగూడి మ్యాచ్‌ను వీక్షించారు. ఇక పీఎస్‌జీ క్లబ్ విజయం సాధించగానే అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా బాణసంచా పేలిస్తూ నానా హంగామా సృష్టించారు. బాణసంచాను విసిరడంతో ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. అభిమానులు-పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీలు, వాటర్ కేన్‌లు ప్రయోగించారు. దీంతో అభిమానులు మరింత రెచ్చిపోయి.. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పోలీసులతో సహా వందల మంది ప్రజలు గాయాలు పాలయ్యారు.
భారీ మ్యాచులంటే నాకు చాలా ఇష్టం:
భారీ మ్యాచులంటే తనకు చాలా ఇష్టం అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కామ్‌గా ఉండటం వెనుక కారణం ఏమీ లేదని చెప్పాడు. నిశ్శబ్దంగా కృషి చేస్తే ఫలితం అదే వస్తుందని తన జట్టు సహచరులకు ఎప్పుడూ చెబుతుంటా అని పేరొకొన్నాడు. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదంతా అక్కడితోనే మరిచిపోయాం అని చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్‌లో పంజాబ్ ఢీ కొట్టనుంది. క్వాలిఫయర్-2లో పంజాబ్ సారథి శ్రేయస్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్:
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. 204 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ దాటికి ముంబై మరో టైటిల్ కల చెదిరింది. ఫైనల్‌కు వెళ్లడం పంజాబ్‌కు ఇది రెండోసారి. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో పంజాబ్ మొదటిసారి ఫైనల్ చేరింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ ఫైనల్‌లో తలపడనుంది.
ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత:
తమిళ స్టార్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం.. మధురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. దీంతో ఆయన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి, X వేదికగా ‘ప్రియమైన సోదర నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను, మీమల్ని ప్రతి క్షణం ఎల్లప్పుడూ ఆదరిస్తాను. చాలా త్వరగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్న’ అంటూ తెలిపారు.
ఇండస్ట్రీలో అలా అయితేనే కెరీర్ ఉంటుంది
బాలీవుడ్ నటి విద్యా బాలన్ గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ప్రజంట్ సూధీర్ బాబు మూవీ ‘జటాధర’లో నటిస్తోంది. రజనీకాంత్ సరసన నటిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే కెరీర్ పరంగా ఎలా ఉన్నప్పటికి బయట మాత్రం ముక్కుసూటి మనిషి. ఉన్నది ఉన్నట్టు చెబుతుంది.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల గురించి, నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘సినిమా ఇండస్ట్రీలో మార్పు సహజం. పరిస్థితులకు తగ్గట్టు మారుతారు, అది అంగీకరించక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు ఇండస్ట్రీలో ఉంటారు. లేకపోతే ఫేడ్ అవుట్ అవుతారు. నేను నా చిన్న తనంలో చాలా అల్లరి చేసేదాన్ని. ముఖ్యంగా నైట్‌లు ఎక్కువగా మేల్కొనే దాన్ని. ఆ అలవాటు మానేయడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. నా జీవితాన్ని మార్చేసింది మాత్రం సినిమాలే. పెళ్లి తర్వాత కూడా నేను సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ విద్యాబాలన్ తెలిపింది.
మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ:
గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అక్కర్లేదు. ‘దేవదాసు’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నప్పటి, మహేశ్ బాబుకి జోడిగా ‘పోకిరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో ‘జల్సా’, రవితేజతో ‘కిక్’ వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అనంతరం కాస్తంత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌లోకి జంప్ అయింది ఇలియానా. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ 2023లో పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సారి కూడా తల్లి కాబోతుంది. వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా.. ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాస్తా టైం గడిపింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. ఓ హిట్ మూవీ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూ.. ‘‘మేడమ్.. ‘రైడ్ 2’ సినిమాలో మీరెందుకు నటించలేదు? మీ కమ్‌బ్యాక్ ఎప్పుడు ఉంటుంది?’’ అని అడిగాడు.. ఇలియానా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీని నేనెంతో మిస్ అవుతున్నా. ‘రైడ్’ నాకెంతో ప్రత్యేకమైన మూవీ. నాక్కూడా ఆ సినిమాలో భాగం కావాలనిపించింది. మాలిని పాత్రలో మరోసారి ఒదిగి పోవాలనుకున్నా. మా దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా, నటుడు అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి వర్క్ చేయాలని నాక్కూడా ఉంది. నిజం చెప్పాలంటే, సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్ చేయమని అడిగింది. కానీ అదే సమయంలో నాకు బాబు పుట్టాడు. దీనివల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కానీ మీ అందరికోసం భవిష్యత్తులో తప్పకుండా మంచి కం బ్యాక్ అయితే ఇస్తా’ అని ఇలియానా బదులిచ్చింది.