పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..
బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు దిగొస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జూన్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020లుగా ఉంది. నిన్నటితో (జూన్ 23) పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 400 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 430 తగ్గింది.
జూన్ 19 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 70, 300, 200, 400లుగా తగ్గుతూ వచ్చింది. బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు.. అదనంగా 16,320 సీట్లు అందుబాటులోకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 17 డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. అయితే ఇవి జనరల్ డిగ్రీ కాలేజీలు కాదు. ఈ ఏడాది కొత్తగా 17 బీసీ గురుకులాలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలతో ప్రతి జిల్లాకు ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లో 16,320 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 327 బీసీ గురుకులాలు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సమగ్ర అభివ్రుద్ది కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా మరో 17 బిసి డిగ్రీ గురుకులాలు ప్రారంభించడానికి జీవో జారీ చేయడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కేవలం 19 బిసి గురుకులాలు మాత్రమే ఉండేవని.. వాటిలోనూ అరకొర వసతులతో ఉండేవని గుర్తు చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో 19ని కాస్త నేడు 327కు పెంచుకున్నామన్నారు. విద్య ద్వారా వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయని నమ్మే సీఎం కేసీఆర్.. అందుకోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారన్నారు. కేవలం బిసి గురుకులాల ద్వారానే రాష్ట్రంలో సుమారు 2లక్షల మంది వెనుకబడిన బిడ్డలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనభ్యసిస్తారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈజిప్టు పర్యటనకు బయలుదేరిన ప్రధాని.. 1997 తర్వాత ఇదే తొలిసారి..
ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజలు పాటు ఈయన అమెరికాలో బిజీబీజీగా పర్యటించారు. ఈ రోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజుల పాటు ఆయన ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి హాజరయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోడీని ఈజిప్టులో పర్యటించాల్సిందిగా కోరారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ప్రధాని ఈజిప్టు వెళ్తున్నారు.
ఈ పర్యటనలో ఈజిప్టులోని భారత సంతతిని, ప్రముఖ వ్యక్తులను కలుసుకోవడంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మరింతగా బలపడేందుకు ప్రధాని మోడీ, ఎల్ సిసితో చర్చలు జరపనున్నారు. కైరోలోని హీలియోపోలిస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ శ్మశానవాటికను ప్రధాని సందర్శిస్తారు, ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ మరియు పాలస్తీనాలో సేవ చేసి మరణించిన భారతీయ సైన్యానికి చెందిన దాదాపు 4,000 మంది సైనికులకు స్మారక చిహ్నంగా ఉంది. దావూదీ బోహ్రా కమ్యూనిటి సాయంతో పునరుద్ధరించిన 11వ శతాబ్ధపు అల్-హకీమ్ మసీదును కూడా ఆయన సందర్శిస్తారు.
నేడు హరిదీప్ సింగ్ తో కేటీఆర్ భేటీ.. ఇంకా ఖరారు కాని అమిత్ షా అపాయింట్మెంట్..?
మంత్రి కేటీఆర్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగతుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరితో కేటీఆర్ సమావేశం కానున్నారు. మెట్రో రెండో దశ పనులకు కేంద్ర సాయం కొరనున్నారు. ఇక అమిత్ షా అపాయింట్మంట్ కోసం కేటీఆర్ వేచివున్నారు. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పటి వరకు ఇంకా ఖరారు కాకపోవడ గమనార్హం. నేటితో మంత్రి కేటీఆర్ ఢిల్లీ రెండురోజుల పర్యటన ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో.. ఇవాల షాతో కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ మంత్రి కోరగా ఇంకా ఇప్పటి వవరకు అపాయింట్మెంట్ దొరక్కపోవడం కీలకంగా మారింది. ఒక వేళ షాతో కేటీఆర్ అపాయింట్మెంట్ కుదరకపోతే మరి రేపు కూడా మంత్రి అక్కడే వుండి షా తో మీట్ అయి వస్తారా? లేక ఇవాలే హైదరాబాద్ కు రానున్నారా? అనే విషయం పై సన్నద్ధత నెలకొంది.
నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేటిఆర్ కలిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ లాండ్స్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కేంద్రం సహాయ సహకారాలు అందించాలని పలు సందర్భాల్లో విన్నవించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు అందిన సాయం శూన్యమని విమర్శించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. వ్యాక్సిన్ తయారీకి తెలంగాణ గ్లోబల్ హబ్‌గా మారిందని అన్నారు. హైదరాబాద్ వరదలకు కేంద్రం సాయం చేయలేదన్నారు. హైదరాబాద్‌లో రక్షణ శాఖ భూములు ఉన్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎన్డీయే ప్రభుత్వంలో పనిచేసిన ఐదుగురు రక్షణ మంత్రులను పలుమార్లు కలిశామన్నారు. రాజ్‌సింగ్‌ను మరోసారి కలిశామని తమ డిమాండ్లను వినిపించామని చెప్పారు. ప్రధానంగా నాలుగు వినతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇవాల వాటిని పరిశీలించాల్సిందిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వెళ్లే దారిలో స్కై వెలా నిర్మాణానికి 96 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరాం. దానికి సమానంగా భూమి ఇస్తామని చెప్పారు.
నేడు సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నట్లు అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 72,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,504 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన్లు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను శనివారం విడుదల చేయనుంది టీటీడీ.
శనివారం ఉదయం రూ.300 ప్రత్యేక దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వసతి గదుల కోటాను ఆదివారం విడుదల చేయనుంది టీటీడీ. ఇప్పటికే ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 22న ఆర్జిత సేవా టికెట్లు, 23న అంగప్రదక్షిణం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ.. జూన్ 24 నుంచి 26 వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నారు.
హైకోర్టు అడ్వకేట్ హంగామా.. ఇంట్లో చొరబడి మహిళపై దాడి..
హైదరాబాద్ మలక్‌పేటలో హైకోర్టు అడ్వకేట్ రెచ్చి పోయి హంగామా చేశాడు. ఇంటి ముందు చెత్త వేశారన్న కారణంతో మహిళను, యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఒక మహిళా అని చూడకుండా ఇంట్లోకి వెళ్లి నానా హంగామా చేశాడు. మహిళను చేతులు పట్టుకుని బయటకు లాక్కుని వచ్చి ఇంటి ముందు గొడవకు దిగాడు. ఈ ఘటన మలక్ పేట పీఎస్ పరిధిలో సంచలనంగా మారింది. ముసారాంబాగ్ లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్‌లో ఆంటోనీ రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. ప్లాట్ ముందు చెత్త వేశారని కారణంతో పక్కింటి ఇంట్లో చొరబడి దాడి చేశాడు.
అంతేకాకుండా ఇంట్లో వున్న ఆడవారిని చేతులు పట్టుకుని ఇంటి బయటకు లాక్కుని వచ్చాడు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన వారిపై దాడి చేశాడు. వారికి పిడుగుద్దులు గుద్దాడు. అయితే అతన్ని అడ్డుకునేందుకు పలువురు అడ్వకేట్‌లు ప్రయత్నించినా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారిపై కూడా దాడి చేశాడు. అలా మహిళను చేతులు పట్టుకుని లాక్కుని రావడం ఏంటని ప్రశ్నిస్తున్నా వినకుండా నేను హైకోర్టు అడ్వకేట్ అంటూ ఎరికి చెప్పకుంటారో చెప్పుకోండి అని బెదిరించాడు.
టీసీఎస్‌లో జాబ్స్ కుంభకోణం.. నలుగురు అధికారులపై వేటు!
అవినీతి లేని చోటు లేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు ఎక్కడ చూసిన అవినీతి జరుగుతూనే ఉంది. అయితే ప్రైవేటు సంస్థల్లో కొంత తక్కువగా ఉంటుందనేది వాస్తవం. భారత్‌లోని ప్రైవేటు సంస్థల్లో నమ్మకమైన సంస్థల్లో టాటా కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి టాటా సంస్థకు చెందిన టీసీఎస్‌లో కూడా ఉద్యోగాల కల్పనలో అవినీతి జరిగినట్టు బయటికొచ్చింది. అవినీతిని సహించని సంస్థ యాజమాన్యం .. ఘటనపై విచారణ ఉరిపించి అందుకు బాధ్యులైన వారిని తొలగించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ. ఏటా ఈ కంపెనీలో సగటున 50 వేల మంది వరకు కొత్త ఉద్యోగులు చేరుతుంటారు. గత మూడేళ్లుగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 6 లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. 46 దేశాల్లో 150కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టీసీఎస్ అంటే విలువలతో కూడుకున్న కంపెనీ అన్న పేరుంది. ఇప్పుడు ఇంతటి ఐటీ కంపెనీలోలో సైతం అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. నియామక ప్రక్రియలో.. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీ పడ్డట్లు తెలిసింది. సిబ్బంది నియామక సంస్థల (స్టాఫింగ్ ఫర్మ్స్) నుంచి కొందరు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించింది.