విశాఖలో కోవిడ్ కేసు.. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కూడా మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసు నమోదైంది. విశాఖలో కోవిడ్ కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం యూపీహెచ్సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురికీ నెగెటివ్‌గా రిజల్ట్స్ వచ్చింది. మహిళను వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
ఇండోనేషియా-నేపాల్‌లో భూకంపం
ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని GFZ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగ లేదు. అదే సమయంలో, నేపాల్‌లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంప కేంద్రం 29.36 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 80.44 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడి కాలేదు.
నాపై ఫేక్ న్యూస్ రాసేకంటే.. మంచి సమాచారం ఇవ్వండి!
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) నిష్క్రమించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లక్నో.. సీజన్ మధ్యలో వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ గెలిస్తే.. పట్టికలో కాస్త పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడానికి కారణం రిషభ్ పంత్ అనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా పూర్తిగా నిరాశపరిచాడు. వేలంలో రూ.27 కోట్ల భారీ ధర పలికిన పంత్.. 13 మ్యాచ్‌ల్లో 151 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడు ఎలా ఆడాడో. పంత్ విఫలమైన వేళ నెట్టింట ఓ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. పంత్‌కు రూ.27 కోట్లు చాలా ఎక్కువని, వచ్చే సీజన్‌కు ముందు ఎల్‌ఎస్‌జీ అతడిని రిలీజ్ చేసే అవకాశముందని ఎక్స్‌లో ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుపై పంత్ స్పందిస్తూ నాపై ఫేక్ న్యూస్ రాసేకంటే మంచి సమాచారం ఇస్తే బాగుంటుందన్నాడు.
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు.. విదేశీ విద్యార్థులకు చేర్చుకోవద్దని హుకుం
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ మరో సీరియస్ యాక్షన్ తీసుకుంది. అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునేందుకు ఇచ్చిన సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) సర్టిఫికేషన్ తక్షణమే రద్దు చేయబడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా పని చేస్తే ఇదే పరిణామం ఎదురవుతుందని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజా పరిణామంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయం భారీ షాక్‌కు గురైంది.
తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఆగస్టు 2024లో వివాహం చేసుకున్నారు. 2025 జనవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని కిరణ్, రహస్యలు తెలిపారు. నిన్న (మే 22) ఈ జంటకు పండండి బాబు జన్మించాడు. ‘క’ సినిమాతో గతేడాది మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ప్రస్తుతం ‘కె- ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నారు.
రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన..
దక్షిణ భారతదేశంలో వాతావరణం కీలక మార్పులకు లోనవుతోంది. సాధారణంగా రుతుపవనాల రాకకు సూచికగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇది శుభవార్తే అయినా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ వాయుగుండం పశ్చిమ తీరం వెంబడి విస్తృత వర్షపాతానికి దారితీసే అవకాశం ఉంది. కేవలం అరేబియా సముద్రంలోనే కాకుండా, ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రెండు వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గణనీయంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు విస్తారమైన వర్షాలు సూచించబడుతున్నాయి.
నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహాయం కోసం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రక్షణ, హోం, ఆర్థిక, జలశక్తి, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహా పలు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్, జల వనరుల నిర్వహణ లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలు, పాలనాపరమైన సంసిద్ధతపై చర్చ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానపరమైన “రోడ్ మ్యాప్” ను సమర్పించడానికి “నీతి ఆయోగ్” పాలక మండలి (గవర్నింగ్ కౌన్సిల్) సమావేశంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి తో భేటికానున్నారు. “గ్రీన్ ఎనర్జీ” ప్రాజెక్టులలో సహకారం గురించి చర్చించనున్నారు. తర్వాత, ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం కానున్నారు.
వాన కబురు.. 2 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
కేంద్ర వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే.. అనగా మే 25న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రారంభం అవుతాయని.. షెడ్యూల్ ప్రకారం సకాలంలో వస్తాయని సూచించింది. ఇక ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల వ్యవసాయం పనులు బాగుంటాయని పేర్కొంది. అంతేకాకుండా జలాశయాలు కూడా నిండుకుంటాయని వెల్లడించింది. ఇవన్నీ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని స్పష్టం చేసింది.
మాజీ మంత్రి కొడాలి నానికి లుక్ అవుట్ నోటీసులు జారీ
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలిసులు. కొడాలి నానిపై అనేక కేసులు విచారణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో వైద్య చికిత్స పేరుతో అమెరికా వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు డీజీపీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస రావు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. కొడాలి నానికి ఏపీలో పాస్ పోర్ట్ లేదని, తెలంగాణ అడ్రస్ తో పాస్ పోర్ట్ తీసుకున్నారనే అనుమానంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్, నౌకాశ్రయాలకి ఆన్ లైన్ లో నోటీసులు జారీ చేశారు పోలిసులు.
నమ్మలేని నిజాన్ని చెప్పిన AI.. ChatGPTతో భర్త మోసం బట్టబయలు
నిజంగానే వింతగా ఉంది కదా… ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) మన నిత్యజీవితంలోకి ఎంతగా చొచ్చుకుపోతోందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఒక మహిళ తన భర్త మోసాన్ని కనిపెట్టడానికి ChatGPT అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని ఉపయోగించిందనే వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదెలా సాధ్యమైందంటే… కేవలం కాఫీ కప్పుల ద్వారా..! సాధారణంగా దంపతుల మధ్య గొడవలు, అనుమానాలు సహజమే. కానీ ఈ విషయంలో టెక్నాలజీ ఒక ప్లాట్‌ఫామ్ అయ్యింది. అమెరికాకు చెందిన డైనా, తన భర్త ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించింది. అవేంటో ఆమెకు అర్థం కాలేదు. ఒక రోజు ఇంటికి వచ్చేసరికి తన భర్తకు చెందిన రెండు ఖాళీ కాఫీ కప్పులు చూసింది. అతనికి కాఫీ తాగే అలవాటు ఉన్నా, సాధారణంగా ఒక కప్పు మాత్రమే వాడుతాడు. ఈ రెండు కప్పులు ఆమెకు అనుమానం కలిగించాయి. వెంటనే ఆమె ఆ కాఫీ కప్పులను ఫోటో తీసి ChatGPTలో అప్‌లోడ్ చేసింది.