స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590, 24 క్యారెట్ల ధర రూ.66,100.. కిలో వెండిపై రూ.77,300 వద్ద కొనసాగుతుంది.. మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉండటంతో కొనుగోళ్లు ఎక్కువ అయ్యాయాని తెలుస్తుంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,600, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,110 గా ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930 వద్ద కొనసాగుతుంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,600 వద్ద ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,110 వద్ద కొనసాగుతుంది.. అదే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 66,100గా నమోదైంది..
హర్యానాలో పెను ప్రమాదం.. లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్
హర్యానాలోని రేవారిలో శనివారం సాయంత్రం బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరంతా ఓ కర్మాగారంలో ఉద్యోగులని భావిస్తున్నారు. గాయపడిన వారిని సివిల్ సర్జన్ డాక్టర్ సురేంద్ర యాదవ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన నగరంలోని ధరుహెరా ప్రాంతంలో జరిగిందని ఆయన తెలిపారు. యాదవ్ మాట్లాడుతూ.. లైఫ్-లాంగ్ ఫ్యాక్టరీలో పేలుడు సాయంత్రం 7 గంటలకు సంభవించింది. మేము ఆసుపత్రులను అప్రమత్తం చేసాము. ఫ్యాక్టరీకి అంబులెన్స్ లను పంపాము. దాదాపు 40 మందికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో రోహ్‌తక్‌కు తరలించామన్నారు.
మరో మారు కాల్పులతో మార్మోగిన అమెరికా.. ముగ్గురిని కాల్చి చంపిన కేటుగాడు
కాల్పులతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో విచక్షణారహిత కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. తూర్పు పెన్సిల్వేనియాలోని ఫాల్స్ టౌన్‌షిప్‌లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం జరిగినట్లు ఫిలడెల్ఫియాలోని మిడిల్‌టౌన్ టౌన్‌షిప్ పోలీసులు తెలిపారు. 26 ఏళ్ల యువకుడు పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ముగ్గురు మృతి చెందాడు. కాల్పుల్లో మరణించిన వ్యక్తులు దాడి చేసిన వ్యక్తికి ముందే తెలుసని పోలీసులు చెప్పారు. టౌన్‌షిప్‌లోని రెండు చోట్ల కాల్పులు జరిగినట్లు ఫాల్స్ టౌన్‌షిప్ పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను చంపిన తర్వాత, నిందితుడు న్యూజెర్సీలోని ఒక ఇంటికి తాళం వేసి ప్రజలను బందీలుగా ఉంచాడు.
నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన
నేడు ఏపీలోని పల్నాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగళం బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఢిల్లీ నుంచి గన్నవరం వరకు ప్రత్యేక విమానంలో రానున్నారు.. గన్నవరం నుండి ప్రత్యేక హెలికాప్టర్లలో బొప్పూడికి మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6 వరకు బొప్పూడి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ప్రధాని రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
4,000 మంది భద్రతా సిబ్బందితో పహారా కాస్తున్నారు పోలీసులు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా సభా వేదిక వద్ద ఐదు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు అధికారులు.. ప్రత్యేక హెలిపాడ్లతో పాటు రాత్రి సమయంలో కూడా ప్రయాణించే అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు సిద్ధం చేశారు అధికారులు.. ప్రజాగలం సభలో ఉమ్మడి రాజకీయ ప్రణాళికను ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
బీఆర్ఎస్ కు ఆరూరి రమేష్ రాజీనామా.. కేసీఆర్ కు లేఖ..!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అరూరి రమేష్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయన వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా.. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీలో చేరుతున్నట్లు కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన నివాసం ఉంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కారులో ఎక్కించుకుని హైదరాబాద్ నందినగర్ లో నివాసముంటున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో అరూరి రమేశ్‌ను బీఆర్‌ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై అరూరి రమేష్ వివరణ ఇచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పాడు. తమ పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ వద్దకు వచ్చానన్నారు. బీఆర్‌ఎస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను అమిత్ షాను కలిశానని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌బీ జేపీలో చేరుతున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీలో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంగళవారం ఆయన కలిశారని వార్తలు వచ్చాయి. అరూరి రమేశ్‌కు బీజేపీ హైకమాండ్ వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన ఎంపీ టికెట్ కోసం బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
నేడే డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్.. కొత్త విజేత ఎవరో!
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గతేడాది తుది పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైకి షాకిచ్చిన బెంగళూరు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్–18లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ముంబైని వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే టైటిల్ కైవసం చేసుకోవచ్చు. అయితే టాపార్డర్ వైఫల్యం బెంగళూరును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎలీస్ పెరీ బాగా ఆడింది. స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్‌లు కూడా రాణిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్‌లు రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం.
గతేడాది రన్నరప్‌గా సరిపెట్టుకున్న ఢిల్లీ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్‌కు దూసుకొ చ్చిన ఢిల్లీ.. భారీ స్కోర్లతో విరుచుకుపడుతోంది. బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్‌లు రాణిస్తున్నారు. ఢిల్లీని ఆపాలంటే బెంగళూరు శ్రమించాల్సిందే. అరుణ్ జైట్లీ స్టేడియం బౌలర్లకు అనుకూలించనుంది. ఇక్కడ బ్యాటర్లు శ్రమించాలి. మ్యాచుకు వర్ష సూచన లేదు.
నేడు గ్రూప్-1 పరీక్ష.. గంట ముందే అనుమతి..
ఏపీపీఎస్సీ గ్రూపు-1స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష నేడు జరగనుంది. అయితే.. పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. నిన్న గ్రూపు-1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. మొత్తం లక్షా 48 వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని చెప్పారు. ఈరోజు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. గ్రూపు-1 పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షించాలని ఏపీపీఎస్సీ అధికారులను సీఎస్ ఆదేశించారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ జవహర్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కవితను కలిసేందుకు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు..
ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం కేటాయించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఈనేపథ్యంలో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ తో సహా హరీష్ రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశాలు వున్నాయి. కాగా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈడీ ఆమె భర్త అనిల్‌కు నోటీసులు పంపింది. సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేరు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకు తమ పార్టీ నాయకురాలు కవితపై తప్పుడు కేసులు బనాయించి, కేసులు పెట్టి, అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అంతరార్థం ఏమిటో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజా కోర్టులో శిక్షిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పేరును చెడగొట్టేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా శనివారం నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.