జ్యోతి మల్హోత్రాకు బెయిల్..? నేడు కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది..!
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది. ఆమెను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరు చేయడం జరుగుతుంది. అయితే, గత విచారణలో, హిసార్ కోర్టు జ్యోతి మల్హోత్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె హిసార్ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. కాగా, పాక్ కి గుఢచార్యం చేసిన కేసులో మల్హోత్రాకు జ్యుడీషియల్ కస్టడీని మరింత పొడిగిస్తారా లేదా ఆమెకు బెయిల్ లభిస్తుందా అనేది న్యాయస్థానం ఈరోజు నిర్ణయించనుంది.
ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!
ఆదివారం నాడు అనంతపురంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన్మయను గుర్తు తెలియని దుండగులు అమానుషంగా హత్య చేసిన ఉదంతం గురించి తెలిసిందే. మణిపాల్ స్కూల్ వెనుక భాగంలో విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ పాశవిక చర్య అక్కడి స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన్మయ కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు స్పందించలేదని విద్యార్థినీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అడ్డుకున్న ఐడీఎఫ్
గాజాలో మానవతా సాయం చేసేందుకు వెళ్తున్న పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ బృందాన్ని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. ఫ్రీడమ్ ఫ్లొటిల్లా కూటమి అనే సంస్థ ఆధ్వర్యంలో గాజాకు వస్తున్న నౌకలో థన్‌బర్గ్, 12 మంది ఆందోళనకారులు ఉన్నారు. జూన్ 1న ఇటలీ నుంచి సహాయ సామాగ్రితో కూడిన మాడ్లీన్ నౌక బయల్దేరింది. అయితే ఐడీఎఫ్ దళాలు అడ్డుకున్న సమయంలో లైఫ్ జాకెట్లతో చేతులు పైకెత్తి కూర్చున్న వ్యక్తుల ఫొటోను యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రిమా హసన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
రాయచోటి ఓటింగ్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
రాయచోటి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ, ఓట్ల గణాంకాలను వివరంగా వెల్లడించారు. ఇక ఆయన తెలిపిన సమాచారం మేరకు 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గంలో పోలైన ఓట్లపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు 62 వేల నుంచి 66 వేల ఓట్లు వచ్చాయని, ఆ సమయంలో వైఎస్సార్సిపికి 92 వేల నుంచి 98 వేల ఓట్లు వచ్చినట్లు తెలిపారు.
అమిత్ షా”సైలెంట్ ఆపరేషన్”తో 2026లో డీఎంకే పాలన అంతం..
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా “సైలెంట్ ఆపరేషన్” నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన షాను చూసి డీఎంకే భయపడుతోంది అని అన్నారు. అలాగే, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లే, అమిత్ షా ఇప్పుడు మీనాక్షి అమ్మవారిని సందర్శించి, సింధూర్‌ను తీసుకెళ్లి, డీఎంకే పాలనను అంతం చేయడానికి ‘సైలెంట్ ఆపరేషన్’ ప్రారంభిస్తారు అని నైనార్ నాగేంద్రన్ చెప్పుకొచ్చారు.
నేడు తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
కొత్త మలుపు తిరిగిన హనీమూన్ జంట కేసు.. భార్య సహా నలుగురు అరెస్ట్
హనీమూన్ జంట రాజా, సోనమ్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి దాదాపు 18 రోజుల సస్పెన్స్‌కు తెరపడింది. మేఘాలయలో హత్యకు గురైన రాజా కేసులో హంతకురాలు భార్యనేనని పోలీసులు తేల్చారు. సోనమ్‌ను సజీవంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు నలుగురు కిరాయి హంతకులను కూడా అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. బాడీని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. సోనమ్ సహా నలుగురు హంతకులను యూపీలో అరెస్ట్ చేశారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి रवానవుతారు. అక్కడ ఆయన ఏఐసీసీ (AICC) నేతలను కలిసి, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల కేటాయింపు, పార్టీ కార్యవర్గ విస్తరణపై కీలక చర్చలు జరపనున్నారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విషయమై ఆదివారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో అంచనాలు ప్రారంభమైనప్పటికీ, అధికారికంగా సోమవారం లేదా మంగళవారం శాఖల కేటాయింపు ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనేక శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. వీటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్థక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖలు ప్రముఖంగా ఉన్నాయి. ఇవి కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
వరద ప్రవాహం.. నీటితో కళకళాడుతున్న శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు..!
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 893 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో పూర్తిగా నిలిచింది. జలాశయానికి సంబంధించిన పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.20 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 55.3581 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇటీవల వర్షాలు తగ్గిన నేపథ్యంలో జలాశయంలోకి వరద ప్రవాహం తక్కువగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా తాత్కాలికంగా నిలిపివేయబడినట్టు సమాచారం. అలాగే తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 7,653 క్యూసెక్కులుగా నమోదు కాగా.. అవుట్‌ఫ్లో 213 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1601.69 అడుగులు మాత్రమే నీరు ఉన్నది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 23.786 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.
మాజీ మంత్రిపై వరుస కేసులు.. అక్రమంగా టోల్ గేట్‌ను ఏర్పాటు చేసారంటూ..?
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. తాజాగా, సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్‌ను అక్రమంగా తరలించారనే ఆరోపణలపై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఇద్దరిపై కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ కేసు ఉండగానే.. మరోవైపు కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులోనూ కాకానితో పాటు మరికొందరు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. తొలుత అక్రమ గ్రావెల్ తరలింపు, ఆ తర్వాత టోల్ వసూళ్ల దుర్వినియోగంపై నమోదైన ఈ కేసులతో మాజీ మంత్రి కాకానిపై వివాదాలు మళ్లీ చర్చనీయాంశమవుతున్నాయి. చూడాలి మరి ఈ కేసులపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో.