బాబు, పవన్ పొలిటికల్ టూరిస్టులు.. రైతుల దగ్గర నటిస్తున్నారు..!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ఉనికిని కాపాడుకునేందుకు చంద్రబాబు. పవన్ కల్యాణ్‌ను రైతులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. అసలు పవన్ కు రాజకీయ అవగాహన లేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. మరి అప్పుడు పవన్ ఎందుకు మాట్లాడ లేదు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఏమి చేశారో ఇద్దరూ చెప్పలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు మంత్రి కాకాణి.. అయినా ఉమ్మడి తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో తిరుగుతూ హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.. ఏ సీజన్ లో నష్టం వస్తే ఆ సీజన్ ల లోనే పరిహారం ఇస్తున్నాం అన్నారు.. ఇక, పవన్ కల్యాణ్, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్టులు.. కొన్ని రోజులు కనపడటం.. మళ్లీ డెన్‌లోకి వెళ్లడం వారికి అలవాటు అంటూ మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. కాగా, ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేర్వేరుగా పర్యటించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన విషయం విదితమే.. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు ఇద్దరు నేతలు.. దీంతో.. వారి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
సీఎం పోస్ట్, పొత్తులపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన పవన్.. ఆ తర్వాత జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశారు.. లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలతో కలిసే వైసీపీపై పోరాటం చేయాలనే నాకుంది.. కానీ, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయన్నారు.. వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రభావితం చేసే పార్టీలు కలవాలని కోరుకుంటున్నాం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయని వ్యాఖ్యానించారు.. ప్రతి పార్టీకి వారి వారి ఓట్లు.. వారి వారి బలం ఉంటుంది. కానీ, కలిసి వెళ్తే మరింత బలంగా పోరాడవచ్చు అన్నారు. ఇక, ఉనికి చాటుకోవడానికి పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.. లోతుగా ఆలోచించే గతంలో టీడీపీకి సపోర్ట్ చేశానన్న ఆయన.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మరోసారి స్పష్టం చేశారు.. మాకు గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు వచ్చాయి.. మేం గత ఎన్నికల్లో 137స్థానాల్లో పోటీ చేశామని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తామంటే ఒప్పుకోబోమన్నారు పవన్.. కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం.. ఎవరైనా పొత్తులకు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామని ప్రకటించారు.. సీఎం అభ్యర్థి అయితేనే పొత్తులు పెట్టుకోవాలనుకునే వాళ్లు.. గత ఎన్నికల్లో మమ్మల్ని కనీసం 40 స్థానాల్లో గెలిపించి ఉండాల్సింది అన్నారు పవన్ కల్యాణ్. కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.. ఇక, సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగబోనన్న ఆయన.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతానని పేర్కొన్నారు..
నేను సంపూర్ణమైన రైతును కాను.. అన్నీ తెలుసంటున్న మీరేం చేశారు..
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే, జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. వారిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. నేను సంపూర్ణమైన రైతును కాను.. కానీ, కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని అన్నారు.. అన్నీ తెలుసనంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు అని నిలదీశారు పవన్.. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించామని.. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశ్యం కాదన్నారు.. కానీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులెవ్వరూ వెళ్లలేదు.. తరుగు పేరుతో రైతులను దోచేస్తున్నారు.. రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి 60 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సజ్జల కౌంటర్ ఎటాక్.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులు, సీఎం పోస్టు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కుక్క తోకను ఆడించగలదు.. కానీ, తోక కుక్కను ఆడించ లేదు అని కామెంట్ చ ఏశారు.. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగగా అభివర్ణించిన ఆయన.. పవన్ కు ఇమేజ్ ఉన్నట్లు చంద్రబాబు కొన్ని మీడియా సంస్థల సహాయంతో సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు పల్లకి మోయటమే తన ఎజెండా అని పవన్ స్పష్టత ఇచ్చారన్న ఆయన.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా 2019లో ప్రయత్నించాడని గుర్తుచేశారు. ఇక, ముఖ్యమంత్రి కావాలనే చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కంటున్నాడు అంటూ సెటైర్లు వేశారు సజ్జల.. తనకు బలం లేదని పవన్ అంగీకరించారన్న ఆయన.. తనను ముఖ్యమంత్రిని చేయాలనే అభిమానులను చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నాడని కామెంట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి..
6 నెలల్లో కేసీఆర్‌ని గద్దె దింపాలి.. బీజేపీ ప్రభుత్వం రావాలి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ నువ్ యూజ్ లెస్..నీ ప్రభుత్వం హోప్ లెస్ అని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ‘గతంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు 60, 70 వేలే అంటున్నారు. కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారు…కేసీఆర్ నీకు సిగ్గుందా. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడు. ఏడాది కష్ట పడ్డ 30 లక్షల మంది జీవితాల్ని ఆగం చేశావు. కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోగానే ఏదో ఒకటి లీక్ చేస్తాడు. కేసీఆర్ మనసు క్రూరమైనది. నీ కూతురు లిక్కర్ స్కామ్..నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు… నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్. నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడివి కేసీఆర్. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారు. మునుగోడు లో డబ్బు, మద్యం తో గెలిచారు. ఒకొక్కరికి 5 వేలు, మద్యం పంపిణీ చేశారు. మీరు కూడా ఆలోచించాలి డబ్బులకు అమ్ముడుపోవద్దు. మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీకు కేసీఆర్ పనులు చేయడు. కేసీఆర్ అసలే చేయడు. సచివాలయం ఆయన కోసమే కట్టారట. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట. 400 కోట్ల నుంచి 1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగింది..1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. నిర్ణయం మీదే… రాములక్క చెప్పిన నిజాలు ఇవి. 6 నెలల్లో కేసీఆర్ ని గద్దె దింపాలి.. బిజెపి ప్రభుత్వం రావాలి. BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు తోడు దొంగలే. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, BRS ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారు. 5 వేలు ఇచ్చి ఓటు వేయమంటే మూతి పగలగొట్టండి.’ అని ఆమె వ్యాఖ్యానించారు.
రేపు పెళ్లి.. ఇవాళ వరుడు మృతి
మహబూబాబాద్ జిల్లాలో పెళ్లి ఇంటా విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన పెళ్ళికొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంటా విషాదం అలముకుంది. రేపు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్ళిసందడిగా ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాలో పెళ్ళికొడుకు భూక్య యాకూబ్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. భూక్య బాలాజీ కాంతి దంపతుల ఏకైక కుమారుడు యాకుబ్ కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు మోటార్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయారు.
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్.. విచారణ పూర్తి చేసిన సుప్రీం..
సుప్రీంకోర్టులో ప్రతిష్టాత్మకంగా భావించి విచారణ చేసిన స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపుగా 10 రోజలు పాటు సుదీర్ఘంగా దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్,జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వ ‘స్వలింగ వివాహాల’ చట్టబద్ధతకు వ్యతిరేకంగా తన వాదనల్ని వినిపించింది. ఈ సమస్య కేవలం పట్టణాల్లోని ఉన్నత శ్రేణికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమని, ఇది సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ అంశాన్ని పార్లమెంట్ కే వదిలేయాలని కేంద్రం తన వాదనల్ని వినిపించింది. దీనిపై అన్ని స్థాయిల్లో అన్ని వర్గాల్లో చర్చ జరగాలని తెలిపింది. దీనిపై బుధవారం కూడా కేంద్రం తన వాదనల్ని వినిపించింది. స్వలింగ వివాహాలపై ఎటువంటి ప్రకటన చేసిన ఆది సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలను కోరినట్లు సుప్రీంకు కేంద్రం తెలిపింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయని, మరికొన్ని రాష్ట్రాలు మరింత సమయం కోరాయిన వెల్లడించింది కేంద్రం.
మంకీపాక్స్‌పై ఎమర్జెన్సీ ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ
కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచాన్ని అంతగా భయపెట్టిన వ్యాధి మంకీపాక్స్. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వ్యాధి వేల మందికి వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది. తాజాగా ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి కాదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రకటించారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం కోవిడ్-19 మహమ్మారిపై కూడా అత్యవసర పరిస్థితిని తొలగించారు. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. గతేడాది మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి.
మా పెళ్లి జరిగింది.. కానీ
సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా..? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం గత ఏడాదిగా మీడియాతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు నరేష్. నరేష్, పవిత్ర జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర మళ్లీ పెళ్లి. నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిసున్నాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ముందుగానే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ కూడా ఉండడంతో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈరోజు రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరించిందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ కు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అనుకున్నారో.. అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మీకు పెళ్లి జరిగిందా అన్న ప్రశ్నకు.. నరేష్ సమాధానం చెప్పేశాడు. “కొంతమంది తాళి కట్టి పెళ్లిచేసుకుంటారు.. ఇంకొంతమంది రింగులు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. నా దృష్టిలో పెళ్లి అంటే.. ఇద్దరు మనసుల కలయిక.. మా మనసులు కలిశాయి.. యూనియన్ ఆఫ్ హార్ట్స్.. మాది అదే ” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా పెళ్లి చేసుకున్నాం.. బయటికి చెప్పలేం అని చెప్పాడు. అందుకు కారణం.. నరేష్.. తన మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇవ్వాలని నరేష్ ప్రయత్నిస్తున్నా.. ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు. అందుకే వీరి పెళ్లి ఇంకా బహిరంగం కాలేదు. ఆ విడాకులు వచ్చిన తెల్లారే తాము పెళ్లి చేసుకున్నామని చెప్తారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
ఎన్టీఆర్ మనవడితోనే ఇంకా అవ్వలేదు.. ఏఎన్నార్ మనవడితోనా..?
సాధారణంగా ఒక హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది అంటే.. అది కూడా స్టార్ హీరో సరసన కానీ, లేక వేరే భాషలో స్టార్ హీరోయిన్ కానీ అయ్యి ఉంటే .. ఆమెపైనే కొన్నిరోజులు ఫోకస్ ఉంటుంది. మొదటి సినిమా ఇంకా ఫినిష్ కూడా కాకముందే ఆమెముందు వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అలా ఎంతోమంది హీరోయిన్లకు జరిగింది. ఉప్పెన రిలీజ్ కు ముందే కృతి రెండు సినిమాలకు సైన్ చేసింది.. శ్రీలీల అయితే.. సినిమా సగంలో ఉండగానే నాలుగు సినిమాలకు సైన్ చేసింది.. కేతిక శర్మ.. రొమాంటిక్ చేస్తూనే ఇంకో సినిమాకు సైన్ చేసింది.ఇక తాజాగా అందాల అతిలోక సుందరి డాటర్ జాన్వీ కపూర్ కూడా మొదటి సినిమా రిలీజ్ కన్నా ముందే అమ్మడికి తెలుగులో ఆఫర్లు తన్నుకొచ్చేస్తున్నాయి అంట. అంటే ఆమెఏమి కొత్త హీరోయిన్ కాదు.. మొదటి నుంచి కూడా ఆమెను టాలీవుడ్ రమ్మనే పిలుస్తోంది. కానీ, అమ్మడికే ఇన్నేళ్లు పట్టింది. ఎన్టీఆర్ 30 తో జాన్వీ తెలుగులోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమా ఇప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అంతలోనే చిన్నదానికి మరో లక్కీ ఛాన్స్ వచ్చిందని టాక్ నడుస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్.. ఈ మధ్య ఏజెంట్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చి నిరాశపర్చిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ సినిమా వలన అఖిల్ కొద్దిగా నిరాశ పడ్డాడే కానీ తన గమ్యాన్నివదులుకోలేదు .. ఈసారి మరింత గట్టిగా హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. అఖిల్ తన నెక్స్ట్ ఫిల్మ్.. యూవీ క్రియేషన్స్ లో చేస్తున్నాడని, ఆ సినిమా కోసం ధీర అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన జాన్వీ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే జాన్వితో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఇక ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ మనవడు తారక్ తోనే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు.. అప్పుడే ఏఎన్నార్ మనవడితో జతకట్టడానికి రెడీ అయ్యిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
యశ్ పూరి… ఏమిటీ బాబా శాపం ఇచ్చాడా!?
యశ్ పూరి, అపూర్వ రావు జంటగా రూపుదిద్దుకుంటున్న సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, హామ్స్ టెక్ ఫిల్మ్స్ & సిల్లీ మాంక్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. త్వరలోనే జనం ముందుకు రాబోతున్న ‘హ్యాపీ ఎండింగ్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ కు భిన్నంగా హీరో యశ్ దీనంగా కూర్చున్నాడు. అతని వెనక గణపతి ఫోటో ఉంది. ఒక మునీశ్వరుడుతో పాటు విల్లును ఎక్కుపెట్టిన వ్యక్తి, విల్లు చేతబట్టి యుద్ధానికి వెళుతున్నాడా అనేలా మరో వ్యక్తి బొమ్మలు ఉన్నాయి. ”ఏంటీ.. బాబా శాపం ఇచ్చాడా?” అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటూనే యువతరాన్ని టార్గెట్ చేసుకుని ఈ సినిమాను తీస్తున్నామని నిర్మాతలు యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల చెబుతున్నారు. అజయ్ ఘోష్, విష్ణు ఓయ్, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష రోషన్, జియా శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రవి నిడమర్తి సంగీతాన్ని అందిస్తున్నాడు.