మున్సిపల్ కార్మికులపై కేసులు ఎత్తివేత.. ఏపీ హోంశాఖ ఉత్తర్వులు
సమ్మె సమయంలో మున్సిపల్ కార్మికులపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హోంశాఖ.. సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులపై నమోదైన 6 కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.. 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 11 తేదీ వరకూ నిర్వహించిన సమ్మె కాలంలో.. మున్సిపల్ కార్మికులపై ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులు.. దీంతో, వారిపై కేసులు పెట్టారు పోలీసులు.. కానీ, ఆ సమయంలో మున్సిపల్ అధికారుల చేసిన ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈమేరకు డీజీపీకీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి లేఖ రాశారు.. మున్సిపల్ కార్మికుల సమ్మె సమయంలో ఏలూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, కడపలో నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ స్పష్టం చేసింది.
చంద్రబాబుతో ముగిసిన భేటీ.. వెనక్కి తగ్గని బోడే ప్రసాద్..
పెనమలూరు సీటు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు ఈ సారి టికెట్ లేదనే సంకేతాలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం.. దీంతో.. బోడే ప్రసాద్ వర్గీయులు ఆందోళనకు దిగారు.. ఇక, టికెట్ తనకే ఇవ్వాలని.. లేదంటే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఇండిపెండెంట్‌గా నైనా పోటీకి రెడీ అని ప్రకటించారు బోడే ప్రసాద్.. ఆ తర్వాత టీడీపీ అధిష్టానం నుంచి ఆయన పిలుపు వచ్చింది.. అయితే, పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా వెనక్కి తగ్గడంలేదు బోడే ప్రసాద్.. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుని పోటీ చేస్తానని ప్రకటన చేశారు.. చంద్రబాబుతో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాను అని తెలిపారు.. చివరికి క్షణంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అన్నారు. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ, న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తేల్చేశారు. టికెట్ నాకే ఇవ్వాలని నేను అడుగుతున్నాను.. నేనే పోటీ చేస్తానని చెబుతున్నాను. చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. బీఫామ్ ఇస్తే పార్టీ జెండా పెట్టుకుని ముందుకు వెళ్తాను.. ఇవ్వకపోతే చంద్రబాబు ఫొటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను.
బెజవాడ పశ్చిమలో కీలక పరిణామాలు.. ఇండిపెండెంట్‌గా బరిలోకి జలీల్ ఖాన్..!
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆయా పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది.. ఆయా సీట్లను ఆశిస్తున్న నేతలకు చివరి నిమిషంలో సీటు లేదనే సమాచారం ఇవ్వడం ఒకవైపు అయితే.. ఆ స్థానం ఫలానా పార్టీకి కేటాయిస్తారనే ప్రచారంతో కూడా నేతల్లో ఆందోళన మొదలైంది.. ఈ దశలో బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. పశ్చిమ సీటులో ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతోంది.. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. బెజవాడ పశ్చిమ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్.. అయితే, సీటు జనసేనకు ఇస్తామని అధిష్టానం చెప్పటంతో కాస్త వెనక్కి తగ్గారు నేతలు.. తాజాగా సీటు జనసేనకు కాకుండా బీజేపీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.. దీంతో జనసేన నేత పోతిన మహేష్ వర్గం ఆందోళనలకు దిగింది.. మరోవైపు.. కార్యకర్తల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జలీల్ ఖాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. కార్యకర్తలతో ఈ రోజు సమావేశమైన ఆయన.. ఈ భేటీలో కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ఆలోచనలు ఉన్నారని ప్రచారం సాగుతోంది.
ఎవరి త్యాగాలు వృథా కావు… ఎమ్మెల్సీలు, చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం..
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల వల్ల కీలక నేతలు సైతం సీట్లను త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, ఎవరి త్యాగాలు వృథా కావు.. సీట్లు త్యాగం చేసినవారికి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. టీడీపీనే కాదు, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కూడా టీడీపీ కేడర్ పైనే ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఐదేళ్లుగా ప్రాణాలకు తెగించి పోరాడారు. సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు, చైర్మన్లుగా అవకాశం కల్పిస్తాం. ఎవరి త్యాగాలూ వృథా కావు అన్నారు చంద్రబాబు. ముస్లింలకు తీరని ద్రోహం చేసింది వైఎస్ జగనే అని మండిపడ్డారు చంద్రబాబు.. ముస్లింల పథకాల రద్దు చేశాడు.. ముస్లింలపై దాడులు చేయించాడని విమర్శించారు.. బీజేపీతో పొత్తుపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలన్న ఆయన.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీల పొత్తు.. చరిత్రలో నిలిచేలా చిలకలూరిపేట సభ ఉండబోతోందన్నారు. ముస్లింలకు జగన్ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడింది టీడీపీనే. పార్టీ తరపున నాడు కోర్టులో వాదించేందుకు అడ్వకేట్లను నియమించాం. పండుగ సమయంలో రంజాన్ తోఫాతో పాటు, దుల్హన్ పథకంతో ముస్లింలను ఆదుకున్నాం. కానీ, ముస్లింల కోసం టీడీపీ తెచ్చిన 10 పథకాలను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై కవితపై ఈడీ దాడులు..
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి.. నరేంద్ర మోడీ కంకణం కట్టుకున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ నాయకులు ఈ పిట్ట బెదిరింపులకు భయపడరని తెలిపారు. దీనిపై ప్రజాక్షేత్రంలో, రాజకీయంగానే ఎదుర్కొంటాం.. చట్టపరంగా న్యాయస్థానాల్లో పోరాడుతామని చెప్పారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుందని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 3 గంటలకు పైగా సోదాలు జరిపిన అనంతరం కవితను అరెస్ట్ చేసింది ఈడీ. మరోవైపు ఈడీ సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
కవిత అరెస్ట్ అక్రమం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. కవిత అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా కవితను అరెస్టు చేస్తామని ఈడీ అధికారుల మాదిరిగా చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు. కేసీఆర్ డిమోరలైజ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించారు. అయిని అరెస్టులు బీఆర్ఎస్‌కు కొత్తేమీ కాదని పేర్కొన్నారు. 14 ఏళ్లు పోరాడిన పార్టీ అని.. రాజకీయంగా, న్యాయ పరంగా పోరాటం చేస్తామని తెలిపారు. కవిత పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టు మూడు రోజులు వాయిదా వేసిందని గుర్తుచేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన మాటకు విరుద్ధంగా ఈడీ అరెస్టు చేయడం సరికాదన్నారు. అయినా మహిళల్ని సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత అరెస్టు చేయడంపై కోర్టులో కేసు నడుస్తోందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరా ను ఈడీ విచారిస్తుంది. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా ఈడీకి ఇచ్చారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేసింది. కవితను రాత్రికి ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత.. ఈడీ అదుపులో ఉంచుకుని రేపు ఉదయం అమిత్ అరోరాతో కలిపి కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. అనంతరం.. రేపు మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు.
సీఏఏ దరఖాస్తుదారుల కోసం మొబైల్ యాప్.. ప్రారంభించిన కేంద్రం
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) ప్రకారం అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే మొబైల్ యాప్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రకారం.. ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా వెబ్‌సైట్ https://indiancitizenshiponline.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీఏఏ కింద దరఖాస్తులు చేయడానికి ‘CAA-2019’ మొబైల్ యాప్ పనిచేస్తుందని ప్రతినిధి తెలిపారు. అంతకుముందు, CAA కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వ్యక్తుల కోసం హోం మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం సుగమం చేస్తూ CAA అమలు కోసం నియమాలు సోమవారం నోటిఫై చేయబడ్డాయి. సీఏఏ నిబంధనలను జారీ చేసిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన మూడు దేశాల నుంచి వేధింపులకు గురవుతున్న ముస్లిమేతర వలసదారులకు భారత జాతీయతను మంజూరు చేయడం ప్రారంభిస్తుంది. వీరిలో హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు ఉన్నారు.
తుర్కియే తీరంలో పడవ ప్రమాదం.. 16 మంది మృతి
తుర్కియే సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు తుర్కియే కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గల్లంతైన వారి కోసం కోస్ట్‌గార్డ్ సిబ్బంది రెండు హెలికాఫ్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి చాలామంది తుర్కియే మీదుగా గ్రీకు, ఇటలీతో పాటు యూరప్ దేశాలకు వెళుతుంటారు. ఇటీవల కాలంలో కోస్ట్ గార్డ్ నిఘా పెరగడంతో వీరి సంఖ్య తగ్గిందని స్థానిక అధికారి తెలిపారు. గత వారం తుర్కియే సముద్రతీరంలో అక్రమంగా ప్రయాణిస్తున్న 93 మంది వలసదారులను కోస్టు గార్డు సిబ్బంది పట్టుకున్నారు.
తెగనరుకుతున్న పవన్.. పోస్టర్ అదిరింది!
పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన జనసేన తరఫున అభ్యర్థులను ఫైనల్ చేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఒకపక్క ఎలక్షన్ హడావుడి కొనసాగుతూనే ఉన్న మరొక పక్క పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి ప్రణాళికలు పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ షేర్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ధరించి ఒక కత్తితో విలన్స్ ను నరికి ఆ రక్తంతో తడిసి ముద్దయినట్లు కనిపిస్తున్నాడు. ఒకరకంగా ఈ పోస్టర్ చూసి పవన్ ఫ్యాన్స్ అయితే గూస్ బంప్స్ అని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి స్టఫ్ కదా మనకు కావాల్సింది అంటూ వారు మేకర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి వంటి వారు ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 2024 లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ ని హత్తుకుని ఏడ్చేసిన అభిమాని.. బన్నీ చేసిన పనికి ఫాన్స్ ఫిదా!
మెగా హీరోలలో ఒకరుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక తెలుగులో అనేకమంది స్టార్ హీరోలకు పోటీగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఆయన అభిమానులకు మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరెట్. అలాంటి అల్లు అర్జున్ ని ఒక సామాన్యమైన అభిమాని కలిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది మహా అయితే ఒక ఫోటో ఇచ్చి పంపిస్తారు అంతే కదా అనుకోవచ్చు. కానీ తాజాగా అల్లు అర్జున్ టీం షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ అభిమాని ఒకరు అల్లు అర్జున్ ని కలుసుకునేందుకు వచ్చినట్లు టీం చెబుతోంది. దీంతో అల్లు అర్జున్ అతనిని దగ్గరకు తీసుకుని మాట్లాడడంతో సదరు అభిమానికి నోట మాట రాలేదు. అల్లు అర్జున్ ని ఇంత దగ్గరగా చూస్తున్నాను అనే ఆనందమో లేక మరి ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు కానీ ఆయన్ని చూసి షాక్ అయ్యి హత్తుకుని ఏడ్చేస్తూ కనిపించాడు. అల్లు అర్జున్ కూడా ఇదేంటి అని పక్కకి తోసేయకుండా అతని ఓదారుస్తూ సుమారు 40 సెకండ్ల పాటు ఆ వ్యక్తిని సముదాయిస్తూ కనిపించాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అందరూ అతని స్థానంలో మేము ఉంటే బాగుండు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమాన హీరో ఇలా దగ్గరకు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని ఆ అభిమాని ఎంతో అదృష్టం చేసుకున్నాడని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎన్నాళ్ళయింది మావా.. దేవిశ్రీ గొంతు విని.. అదరగొట్టేశాడు
మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ సినిమాలో విశాల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. ఈ మధ్యనే టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. అందులో విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎంతో గ్యాప్ తరువాత దేవిశ్రీ ప్రసాద్.. సాంగ్ పాడి అలరించాడు. సాంగ్ విశాల్ క్యారెక్టర్ గురించి వివరించారు. సినిమాలో అతని క్యారెక్టర్.. చిన్నతనం నుంచి అతను పెరిగిన విధానం సాంగ్ రూపం లో వివరించారు. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా.. ఇంతకన్నా ఎక్కువ కష్టాలు పడివచ్చా అంటూ రైమింగ్ లో సాగిన ఈ లిరిక్స్ ను శ్రీమణి అందించాడు. ఇక విశాల్ డ్యాన్స్.. హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి సాంగ్స్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చారు. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.