నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. మరికొన్ని పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి చెల్లుబోయిన వేణు.. వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2014 జూన్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణకు ఆమోదం లభించిందన్నారు.. ఏపీ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ రద్దు.. ఏపీవీవీపీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేసి.. జీపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకున్నామని.. సీపీఎస్ రద్దు చేసి పెన్షన్ గ్యారెంటీ స్కీం అమలు చేస్తామని.. పదవీ విరమణ నాటికి ఉద్యోగి జీతంలో 50 శాతం పెన్షనుగా ఇస్తామని పేర్కొన్నారు.. ఏడాదికి రెండుసార్లు డీఆర్ సవరణ ఇస్తాం.. జీపీఎస్ విధానం దేశానికే ఆదర్శం అన్నారు మంత్రి వేణు.. మూడో తరగతి చదివే విద్యార్ధులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం.. దీని కోసం టోఫెల్ కోచింగ్ ఇస్తామన్నారు.. ఇక, మూతపడిన చిత్తూరు డెయిరీకి చెందిన భూములను అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజ్ కు ఇచ్చామని తెలిపారు.. మరోవైపు.. కొత్త మెడికల్ కాలేజీలకు 2,100 పోస్టుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. జూన్ 28వ తేదీన అమ్మఒడి, జూన్ 12న విద్యా కానుక కిట్ల పంపిణీ.. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యత ఆలయ ధర్మకర్తలకు అప్పజెప్పాలని నిర్ణయించామన్న ఆయన.. నిర్వహణ సరిగా లేకుంటే తిరిగి వాటిని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటామని వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలకు షాకిచ్చిన ప్రభుత్వం
ఉద్యోగ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది.. సాధారణ బదిలీల్లో మినహాయింపు కోరుతూ ఉద్యోగ సంఘాలు జారీ చేసే ఆఫీస్ బేరర్ల లేఖల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శలు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది జీఏడీ. అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. సర్వీసెస్ అసోసియేషన్ల లేఖలను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది.. సిఫార్సు లేఖల్లో నకిలీవి ఉంటున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లోనూ నకిలీ లేఖలు వస్తున్నాయని ఉత్తర్వుల్లో జీఏడీ పేర్కొంది.. ఆఫీస్ బేరర్ల సిఫార్సు లేఖలను స్క్రూట్నీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. సాధారణ బదిలీల నుంచి మినహాయింపు కోసం ఆఫీస్ బేరర్లుగా లేఖలిచ్చిన ఉద్యోగుల వివరాలు తెలపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది జీఏడీ.
ఉద్యమం కొనసాగింపా..? ముగింపా..? రేపే నిర్ణయం..
మా ఉద్యమ ఫలితంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యాయి.. ఇక, మా ఉద్యమాన్ని కొనసాగించాలా..? విరమించాలా..? అనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యమ ఫలితంగా ఈ నిర్ణయాలు రాలేదంటూ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. చంద్రశేఖర్ రెడ్డి నిన్నటి వరకు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు.. ఇప్పుడు ప్రభుత్వానికో.. ఓ ఉద్యోగ సంఘానికో వత్తాసు పలికేలా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదని హితవుపలికారు.. మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతున్నాం.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తారని భావిస్తున్నాం అన్నారు బొప్పరాజు. మా ఉద్యమ ఫలితం వల్లే ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు బొప్పరాజు.. కానీ, జీపీఎస్ విధానం విధి విధానాలు చెప్పలేదన్నారు.. గతంలో 28 శాతం పెన్షన్ ఇస్తామన్నారు.. ఇప్పుడు 50 శాతం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఓపీఎస్ తరహాలోనే ఉద్యోగి చివరి జీతంలో 50 శాతాన్ని ఫించనుగా ఇస్తున్నారు. ఓపీఎస్ తరహాలోనే ఏడాదికి రెండు సార్లు డీఆర్ ఇస్తామన్నారు. కానీ, ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు.. ఓపీఎస్ అని పేర్కొన్నారు.. బిల్లు పెట్టే నాటికి పాత పెన్షన్ విధానాన్ని ఆమోదిస్తారని భావిస్తున్నాం అన్నారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.
తెలంగాణ వేరే వాళ్ల చేతికి పోతే ఆగం అవుతుంది
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుంటుందని.. వేరే వాళ్ళ చేతికి పోతే ఆగం అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పేదలు, రైతులు సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. మునిపల్లి మండలం చిన్న చల్మెడ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పంపు హౌజ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంగమేశ్వర పథకానికి భూములు ఇచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో చాలామంది వస్తుంటారని అన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తి అయితే.. సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిని పూర్తి చేసి, ఇక్కడి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్‌లు ఒకప్పుడు కరవు ప్రాంతాలని.. ఇప్పుడు రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లిస్తామని హరీష్ రావు అన్నారు. దీనిని పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతుందని.. రెండు పంటలు పండుతాయని అన్నారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లే ఈ ప్రాజెక్టు వచ్చిందన్నారు. సింగూర్ నీళ్లు ఇక్కడి ప్రజల సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకే ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఆసుపత్రులను అభివృద్ధి చేశామని అన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇస్తున్నామని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు. పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరించాలన్న ఆయన.. ఈ ప్రాంతాన్ని కోనసీమగా మారుస్తామని మాటిచ్చారు.
ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై.. తర్వాతి స్థానాల్లోని నగరాలు ఇవే..
ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది. ప్రవాసుల కోసం అత్యంత ఖరీదైన భారతీయ నగరంగా మొదటిస్థానంలో ముంబై నిలిచింది. హాంకాంగ్ ప్రపంచవ్యాప్తంగా తొలిస్థానంలో ఉంది. ర్యాంకింగ్స్ ప్రకారం, గ్లోబల్ ర్యాంకింగ్‌లో ముంబై 147, న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213 స్థానాల్లో ఉన్నాయి. ముంబయి ఆసియా నగరాల్లో ఒక స్థానం దిగజారి, అంతకుముందు సంవత్సరం (2022)తో పోలిస్తే 27వ స్థానానికి చేరుకుంది. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే గృహాలు, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, ఎంటర్టైన్మెంట్ సహా 200 కన్నా ఎక్కువ వస్తువుల తులనాత్మక ధర ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అంతర్జాతీయ ఉద్యోగులకు హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ అత్యంత ఖరీదైన నగరాలు అని నివేదిక పేర్కొంది. అతి తక్కువ ఖరీదైన నగరాల జాబితాలో హవానా, పాకిస్తాన్ లోని కరాచీ, ఇస్లామాబాద్ నగరాలు ఉన్నాయి. భారతీయ నగరాల్లో, ముంబైతో పాటు చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, పూణే నగరాల్లో సర్వే చేశారు. ముంబై కన్నా ఇతర నగరాలు ప్రవాసులకు 50 శాతం తక్కువ వసతి ఖర్చులను కలిగి ఉన్నాయి. కోల్‌కతా ప్రవాసుల వసతికి అత్యంత తక్కువ ధరను కలిగి ఉంది. ప్రవాసులకు అనుకూలమైన ధరలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది.
ఒడిశాలో ఘోర ప్రమాదం తర్వాత మళ్లీ పట్టాలెక్కిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్..
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలవరపరిచింది. మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కి పైగా మంది గాయపడ్డారు. ఇంకొందరి సమాచారం తెలియాల్సి ఉంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒడిశాలో ట్రిపుల్ రైలు ప్రమాదంలో చిక్కుకున్న ప్యాసింజర్ రైళ్లలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. తిరిగి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి తిరిగి సేవలను ప్రారంభించింది. మూడు రోజుల తర్వాత చెన్నై-షాలిమర్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుండి చెన్నైకి మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేశారు. జూన్ 4న ధ్వంసమైన ట్రాక్‌లపై రైలు కదలిక, వాటిని మరమ్మతులు జరిగాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో 51 గంటల పాటు పునరుద్ధరణ పనులు జరిగాయి. అనంతరం రైల్వే ట్రాక్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. ఇక రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లు బతికే ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు డ్రైవర్లు భువనేశ్వర్‌లోని ఏఎంఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 36 ఏళ్ల అసిస్టెంట్ లోకో పైలెట్ హజారి బెహిరా సాధారణ వార్డులో చికిత్స పొందుతుండగా, మరో లోకో పైలెట్ డ్రైవర్ జీఎన్ మోహంతికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
పెళ్ళాం ఊరెళ్లిందని మందేస్తే.. మొత్తం ఊడ్చేశారుగా
ప్రేక్షకులకు వినోదాన్ని పంచివ్వడంలో ఆహా ఎప్పుడు ఆహానే. ప్రతి శుక్రవారం కొత్త సినిమానో, వెబ్ సిరీస్ నో అందిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆహా ఒరిజినల్స్ నుంచి వస్తున్న మరో సినిమా ఇంటింటి రామాయణం. కమెడియన్ రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి జంటగా సురేష్ నారెడ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఒక ఊరిలో నరేష్ కుటుంబం నివసిస్తూ ఉంటుంది. అతని కూతురు నవ్య.. ఆ ఊరిలోనే ఉంటున్న రాహుల్ ప్రేమించుకుంటారు. నరేష్ ను రాహుల్ మామ మామ అని పిలుస్తుండడంతో కూతురును కాలేజ్ లో దింపి వచ్చే పని రాహుల్ కు అప్పజెపుతాడు. ఇక వీరు ఇంట్లో తెలియకుండా ప్రేమాయణం నడుపుతుంటారు. ఇంకోపక్క నరేష్ కు ప్రాణాలు ఇచ్చే బావమరిది, తమ్ముడు ఉంటారు. వారిలానే రాహుల్ ను కూడా చూసుకుంటాడు నరేష్. ఇక ఈ క్రమంలోనే నరేష్ పెళ్ళాం, కూతురుతో కలిసి 15 రోజులు ఊరు వెళ్తోంది. ఇక పెళ్ళాం ఊరెళ్ళిందని, నరేష్ తమ్ముడు, బావమరిది, రాహుల్, ఫ్రెండ్స్ అందరు మందు పార్టీ చేసుకుంటారు. ఫుల్ గా మందుకొట్టి ఉదయానే లేచి చూసేసరికి ఇంట్లో బంగారం కనిపించదు. ఆ పార్టీకి వచ్చినవారే తీసారని నరేష్ అనుమానిస్తాడు. ఆ అనుమానం.. బంధాల మధ్య అగాధాన్ని రేకెత్తిస్తాయి. ప్రాణంగా చూసుకున్న బావమరిది, తమ్ముడు కూడా నరేష్ కు ఎదురుతిరుగుతారు.. అసలు ఆ బంగారాన్ని కొట్టేసింది ఎవరు..? రాహుల్ కు ఆ బంగారానికి సంబంధం ఏంటి.. మనోళ్లు, బయటోళ్లు గోల ఏంటి.. ? చివరికి ఈ జంట ఒక్కటో అయ్యారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రాహుల్ హీరోగా చాలా సినిమాలే వచ్చాయి. అయన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వినోదాత్మకంగా సాగే పల్లెటూరి కథ అయినా.. ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే కాబట్టి అందరు ఎడిక్ట్ అవుతారు అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ టీమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
‘ఆదిపురుష్’ థియేటర్ లో దళితులకు ప్రవేశం లేదు
ప్రభాస్, కృతి సనన్ జంటగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. జూన్ 16 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ లో ప్రతి సీటు పక్కన ఒక సీటు హనుమంతునికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ రామాయణం ప్రదర్శించినా అక్కడ హనుమంతుడు వస్తాడని భక్తుల నమ్మకానికి ఇది నిదర్శనమని.. మన పక్కనే హనుమంతుడు కూర్చొని ఆదిపురుష్ చూస్తున్నట్లు నమ్మాలని వారు కోరారు. ఇక ఇదే విషయాన్నీ గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కూడా చెప్పాడు. ప్రస్తుతం ఆదిపురుష్ అంతా పాజిటివ్ టాక్ తో వెళ్తుంది. అయితే ఆ పాజిటివ్ టాక్ ను చెడగొట్టడానికి ట్రోలర్స్ సిద్ధమయ్యారు. నెగటివ్ టాక్ ను తెప్పించడానికి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఒక ప్రకటన సర్క్యూలేట్ అవుతుంది. అందులో ‘ఆదిపురుష్’ థియేటర్ లో దళితులకు ప్రవేశం లేదు అంటూ రాసి ఉంది. దీంతో ఇది చూసిన ప్రేక్షకులు సినిమాపై నెగెటివ్ భావనను పెంచుకుంటున్నారు. అయితే ఈ తప్పును వెంటనే గ్రహించిన మేకర్స్ ఈ ప్రకటన ఫేక్ అంటూ చెప్పుకొచ్చారు. అసలు అందులో ఏముంది అంటే.. “రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా “పురుషి” సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో ధర్మం కోసం నిర్మించిన ఆదిపురుష్ ను హిందువులందరూ తప్పక వీక్షిద్దాం” అని రాసి ఉంది. ఇక ఇది ఫేక్ న్యూస్ అని, దయచేసి వీటిని నమ్మొద్దని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది.